'గ్రేటర్' ఎన్నికల్లో పోటీ చేయడం లేదు... ఎందుకంటే.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'గ్రేటర్' ఎన్నికల్లో పోటీ చేయడం లేదు... ఎందుకంటే..

'గ్రేటర్' ఎన్నికల్లో పోటీ చేయడం లేదు... ఎందుకంటే..

Written By news on Wednesday, January 13, 2016 | 1/13/2016


'గ్రేటర్' ఎన్నికల్లో పోటీ చేయడం లేదు... ఎందుకంటే..
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయరాదని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. బుధవారం నాడు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు. వైఎస్ఆర్ సీపీ సంస్థాగతంగా బలోపేతమయ్యేవరకు వేచిచూడాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేసుకుంటూనే ప్రజల పక్షాన పోరాడుతామని పొంగులేటి చెప్పారు. ఏపీలో అధికారంలో ఉండి అవినీతి వ్యవహారాల్లో లెక్కకు మించి డబ్బు సంపాదిస్తోన్న టీడీపీ, కేంద్రంలో అధికారాన్ని చూసుకుని బీజేపీ, పొరుగు రాష్ట్రం కర్ణాటక ప్రభుత్వ మద్ధతుతో కాంగ్రెస్ పార్టీ, ఇక తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందుకోసం ఎంతైనా డబ్బు ఖర్చు చేసేందుకు ఆ పార్టీలు వెనుకాడటం లేదన్నారు.
ఆ పార్టీలు ఈ పోటీలో డబ్బుతోనే నెగ్గాలని చూస్తున్నాయని ఆరోపించారు. మరోవైపు పార్టీని బలోపేతం చేయాలని, అప్పటి వరకు వేచి చూడాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ కారణాలతోనే ఫిబ్రవరి 2న జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించుకున్నట్లు పొంగులేటి వివరించారు. 2009లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేయలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రజల పక్షాన నిలిచి, వారికి అవసరమైనప్పుడు అండగా ఉండేందుకు వైఎస్ఆర్ సీపీ క్షణం కూడా వెనుకాడదన్నారు.
దివంగత నేత వైఎస్ఆర్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ అభివృద్ధి కోసం కృషిచేశారని, సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి రైతులను ఆదుకున్నారని చెప్పారు. ఉచిత విద్యుత్, ఫీ రీయింబర్స్ మెంట్ ద్వారా లక్షల మందికి ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి వృత్తివిద్యా కోర్సులు చదివేందుకు అవకాశం కల్పించారని దివంగత ముఖ్యమంత్రి సేవల్ని కొనియాడారు. వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లినప్పుడు వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిలకు ప్రజలు అడుగడుగునా స్వాగతం పలికారని పేర్కొన్నారు. భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన పార్టీగా అవతరించడానికి సంస్థాగతంగా బలమైన యంత్రాంగాన్ని నిర్మించుకుంటోందని అందుకే ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయవద్దని నిర్ణయించినట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు.
Share this article :

0 comments: