23న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల పర్యటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 23న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల పర్యటన

23న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల పర్యటన

Written By news on Thursday, February 19, 2015 | 2/19/2015


23న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల పర్యటన
రాజధాని గ్రామాల్లో సమస్యలు తెలుసుకునేందుకు
 పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి వెల్లడి
- రైతుల్ని బెదిరించి మరీ భూములు తీసుకుంటున్నారు
- దీనిని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం..

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో ఈ నెల 23న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పర్యటించనున్నారు. పార్టీ శాసనసభాపక్షం ఎమ్మెల్యేలంతా ఆ రోజున రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటించి అక్కడి రైతుల సమస్యలు, ఇబ్బందులు తెలుసుకుని మార్చి 7 నుంచి ప్రారంభమవనున్న అసెంబ్లీ సమావేశాల్లో వాటిని ప్రస్తావించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళతారు. వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి.. మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్‌తో కలసి బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.

ఎమ్మెల్యేలందరూ 23న విజయవాడకు చేరుకుని అక్కడినుంచి రాజధాని గ్రామాలకు బయలుదేరతారని ఆయన తెలిపారు. రాజధాని నిర్మాణం అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో జరగాల్సి ఉండగా సీఎం చంద్రబాబు ఎవర్నీ పట్టించుకోకుండా నిరంకుశంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పార్థసారథి ధ్వజమెత్తారు. ఈ విషయంలో ప్రజల్నిగానీ, ప్రజా సంస్థలనుగానీ, ప్రతిపక్షాన్నిగానీ లెక్క చేయకుండా చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాలకోసం అప్రజాస్వామికంగా ముందుకెళుతున్నారని దుయ్యబట్టారు. రైతులనుంచి రాజధానికోసం సేకరిస్తున్న భూమిని వ్యాపార ప్రయోజనాలకోసం వాడుకోబోతున్నట్లు తేటతెల్లమైందన్నారు. అనుభవజ్ఞుడని చంద్రబాబును ప్రజలు ఎన్నుకుంటే రైతుల భూములను లాక్కుని వాటితో వ్యాపారంచేసి కోట్లు గడించాలనుకుంటున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు.

స్వచ్ఛందంగా భూములిచ్చేవారి నుంచే సేకరిస్తామని తొలుత చెప్పిన చంద్రబాబు.. ఆచరణలో మాత్రం రైతులను బెదిరించి అంగీకార పత్రాలను తీసుకుంటున్నారన్నారు. భూములివ్వబోమని తీవ్రంగా ప్రతిఘటించిన బోయపాటి సుధారాణి అనే మహిళను పోలీసుల ద్వారా బెదిరించి భూములను తీసుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. బహుళ పంటలు పండే భూములను తీసుకోవడాన్నీ తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. రాజధాని విషయంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభలో మాట్లాడినపుడల్లా తుళ్లూరులో రాజధాని ఏర్పాటుకు తాము వ్యతిరేకమని, జగన్‌కు భూములున్నాయి కనుక దొనకొండలో పెట్టాలని చెబుతున్నారని, అసంబద్ధమైన రీతిలో టీడీపీ నేతలు, మంత్రులు మాట్లాడారని ఆయన విమర్శించారు.
Share this article :

0 comments: