తొలి విడద ఐదు రోజుల పాటు ‘రైతు భరోసా యాత్ర’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తొలి విడద ఐదు రోజుల పాటు ‘రైతు భరోసా యాత్ర’

తొలి విడద ఐదు రోజుల పాటు ‘రైతు భరోసా యాత్ర’

Written By news on Tuesday, February 17, 2015 | 2/17/2015


జిల్లాలో 22 నుంచి జగన్ పర్యటన
తొలి విడద ఐదు రోజుల పాటు ‘రైతు భరోసా యాత్ర’
 ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించనున్న వైఎస్ జగన్

 
అనంతపురం అర్బన్ : అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించి వారిలో భరోసా కల్పించేందుకు ఈ నెల 22 నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో రైతు భరోసా యాత్ర నిర్వహించనున్నారు. తొలి విడత యాత్ర హిందూపురం నియోజకవర్గం నుంచి మొదలై ఐదు రోజుల పాటు సాగనుంది. జగన్  పర్యటన వివరాలను సోమవారం ఆ పార్టీ పోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రైతుల పక్షాన నిలిచి ఓ భరోసాను కల్పించారన్నారు. 2004లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, అంతకు మునుపు టీడీపీ హాయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు 421 జీవో ద్వారా పరిహారం అందించి ఆదుకున్నారని గుర్తు చేశారు. వైఎస్ తర్వాత రైతులకు అండగా నిలిచిన నేతలు లేరన్నారు.

ఈ క్రమంలో ప్రస్తుతం పంటలు పండక, అరకొర పండిన పంటకు గిట్టుబాటు ధర లేక అప్పుల భారంతో రైతులు తీవ్రవేదన పడుతున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే బంగారు, బ్యాంకుల్లో రుణాలను మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటించారని, సీఎం అయిన తర్వాత ఇచ్చిన మాటను నిలుపుకోలేకపోయారన్నారు. దీంతో అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మాభిమానం చంపుకోలేనివారు బలవన్మరణాలకు పాల్పడ్డారన్నారు. ఈ కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతులు జిల్లాలో ఆత్మహత్యలు చేసుకోలేదని చంద్రబాబు వ్యాఖ్యానిస్తే.. అసెంబ్లీలో వైఎస్ జగన్ పూర్తి వివరాలు, ఆధారాలతో వివరించి ప్రభుత్వాన్ని ఒప్పించారన్నారు. ఈరోజు ప్రభుత్వం పరిహారం ప్రకటించిందంటే అది తమ పార్టీ ఘనతే అన్నారు.   
 
కలెక్టర్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ నాయకులు

సోమవారం రాత్రి వైఎస్‌ఆర్‌సీపీ నేతలు జిల్లా కలెక్టర్ కోన శశిధర్‌ను కలిసి జిల్లా పరిస్థితి, రైతాంగం పరిస్థితి వివరించారు. జిల్లాలో రైతులు సాగుచేసిన పంటలు చేతిరాక 66 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో తీవ్ర కరువుతో లక్షలాది మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని తెలిపారు. ముందుస్తు కరువు నివారణ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కలెక్టర్‌కు వివరించారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతుకు ప్రభుత్వం పరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో అతి తక్కువ వర్షపాతం నమోదు కావడంతో వందలాది గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని చెప్పారు.

ప్రత్యేక చర్యలు తీసుకుని ప్రజలు, పశువులకు తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలన్నారు. పశుగ్రాసం కొరత లేకుండా చూడాలన్నారు. పింఛన్లు కోల్పోయిన అర్హులందరికి పింఛన్ సౌకర్యం ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆర్. రాజీవ్‌రెడ్డి, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి యుపి నాగిరెడ్డి, నగరాధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, దిలీప్‌రెడ్డి, యువజన నగరాధ్యక్షుడు ఎల్లుట్ల మారుతి నాయుడు, వెన్నపూస రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: