మధ్యతరగతికి విద్యుత్ షాక్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మధ్యతరగతికి విద్యుత్ షాక్

మధ్యతరగతికి విద్యుత్ షాక్

Written By news on Wednesday, February 11, 2015 | 2/11/2015

కొత్త విద్యుత్ చార్జీల ప్రతిపాదనలు బహిర్గతం
ఒక్కో యూనిట్‌పై కనిష్టంగా 10 పైసల నుంచి గరిష్టంగా 48 పైసల వరకూ వడ్డింపు
వంద యూనిట్లలోపు వినియోగిస్తే ప్రస్తుత చార్జీలే
200 యూనిట్ల వరకు 4% పెంపు.. ఆపై 5.75 శాతం వాత
26.30 లక్షల గృహాలపై చార్జీల పెంపు ప్రభావం
పరిశ్రమలపై 4.75% చార్జీల పెంపు
రూ. 1,088.68 కోట్ల వరకూ భారం
ఇంకా రూ. 6,476.23 కోట్ల లోటు చూపిన డిస్కంలు


సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మధ్యతరగతికి విద్యుత్ షాక్ తగలనుంది.. తక్కువ విద్యుత్ ఉపయోగించే పేదలకు మాత్రం మినహాయింపు లభించినా... ఎక్కువ విద్యుత్ వినియోగించేవారిపై చార్జీల మోత మోగనుంది. వివిధ కేటగిరీల వారీగా నాలుగు శాతం నుంచి 5.75 శాతం వరకు పెంపును వడ్డించనున్నారు. మొత్తంగా కొత్త రాష్ట్రంలో తొలిసారిగా విద్యుత్ చార్జీల పెంపు ద్వారా ప్రజలపై రూ. 1,089 కోట్ల భారం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

డిస్కంలు 2015-16 సంవత్సరానికి సంబంధించి విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు, వార్షిక ఆదాయ అవసరాల నివేదికలను (ఏఆర్‌ఆర్‌లు) గత శనివారమే రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి (టీఎస్‌ఈఆర్సీ) సమర్పించిన విషయం తెలిసిందే. ఈ కొత్త చార్జీల వివరాలను గోప్యంగా ఉంచిన డిస్కంలు... రెండు రోజుల పాటు హైడ్రామా నడిపించాయి. దీంతో ప్రతిపాదనల వివరాలను మంగళవారం రోజున వెబ్‌సైట్లో పెట్టాలని సోమవారం డిస్కంలకు ఈఆర్సీ మెమో జారీ చేసింది కూడా.

ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ ఈఆర్సీ కార్యాలయంలో టీఎస్‌ఎస్పీపీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, డెరైక్టర్ శ్రీనివాసరావు, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ అధికారులతో సమావేశమయ్యారు. చార్జీల వివరాలు, ఏఆర్‌ఆర్‌లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని వారికి సూచించారు. భేటీ అనంతరం డిస్కంల ప్రతిపాదనల వివరాలను ఈఆర్సీ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు.

గరిష్టంగా 48 పైసల వరకూ..
వివిధ కేటగిరీల్లో చార్జీల పెంపు నాలుగు శాతం నుంచి 5.75 శాతం వరకు ప్రతిపాదించారు. ఒక్కో యూనిట్‌పై కనిష్టంగా 10 పైసల నుంచి గరిష్టంగా 48 పైసల వరకు పెంచుతూ రేట్ల పట్టికను తయారు చేశారు. ఈ కొత్త టారిఫ్ ప్రకారం వంద యూనిట్లలోపు గృహ వినియోగదారులకు ప్రస్తుతమున్న చార్జీలే వర్తిస్తాయి. 101-200 యూనిట్ల మధ్య విద్యుత్ వినియోగించే గృహాలకు నాలుగు శాతం చార్జీలు పెరుగుతాయి. మిగతా అన్ని కేటగిరీలకు 5.75 శాతం చార్జీని వడ్డించారు. పరిశ్రమల కేటగిరీలో 4.75 శాతం పెంపును ప్రతిపాదించారు.

వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకం యథాతథంగా కొనసాగుతుందని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. డిస్కంలు ఏఆర్‌ఆర్‌లలో మొత్తంగా రూ. 7,564.91 కోట్ల లోటును చూపించాయి. ఇందులో రూ. 1,088.68 కోట్లను చార్జీల పెంపు ద్వారా భర్తీ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఈఆర్సీని కోరాయి. ఈ పెంపు అమలైనా కూడా రూ. 6,476.23 కోట్లు నికరంగా లోటు ఉంటుంది. దీనిని పూడ్చుకునేందుకు డిస్కంలు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ప్రస్తుతం నెలకు రూ. 300 కోట్ల చొప్పున ఏటా రూ. 3,600 కోట్లు సబ్సిడీగా తెలంగాణ సర్కారు డిస్కంలకు చెల్లిస్తోంది. వచ్చే ఏడాది అదనంగా మరో రూ.2,876.23 కోట్లను సర్కారు నుంచి ఆశిస్తున్నట్లు డిస్కంల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

ఇక రాష్ట్రంలో సరిపడేంత విద్యుత్ అందుబాటులో లేకపోవటంతో పాటు, విద్యుత్ కొనుగోలు చేయాల్సి రావటంతో.. గతంతో పోలిస్తే డిస్కంల ఖర్చులు పెరిగిపోయాయి. 2015-16లో మొత్తం రూ. 26,473.76 కోట్ల వ్యయం అవుతుందని.. ప్రస్తుత చార్జీల ద్వారా రూ. 18,908.85 కోట్లు ఆదాయం వస్తుందని.. పెంపుతో అదనంగా మరో రూ.1,088.68 కోట్లు ఆదా యం వస్తుందని డిస్కంలు పేర్కొన్నాయి.

పేదలకు ఊరట
చార్జీల పెంపుతో దాదాపు 70% మంది వినియోగదారులకు అదనపు భారమేమీ ఉండబోదని డిస్కంలు చెబుతున్నాయి. తెలంగాణలో వంద యూనిట్లలోపు వినియోగించే కుటుంబాలు సుమారు 62.10 లక్షలు ఉన్నాయి. వారందరికీ ప్రస్తుతం అమల్లో ఉన్న చార్జీలే వర్తించనున్నాయి. అంతకు మించి విద్యుత్ వినియోగించే 26.3 లక్షల కుటుంబాలపై చార్జీల భారం పడుతుంది. 200 యూనిట్లు దాటితే వాత: తాజా చార్జీల పెంపు ప్రతిపాదనలను పరిశీలిస్తే... వంద యూనిట్ల వరకు భారం లేకున్నా, విద్యుత్ వినియోగం 200 యూనిట్లు దాటితే స్లాబ్ పద్ధతిలో రేట్లు వర్తిస్తాయి. దీంతో వినియోగదారులపై ఎక్కువగా భారం పడనుంది.

సాధారణంగా 200 యూనిట్లు వినియోగించే మధ్య తరగతి గృహాలకు ప్రస్తుత పెంపుతో విద్యుత్ బిల్లు రూ. 600 నుంచి రూ. 625కు పెరుగుతుంది. కానీ అంతకన్నా అదనంగా ఒక్క యూనిట్ వాడితే.. బిల్లు అమాంతం రూ. 872.75కు చేరుతుంది. 500 యూనిట్లు వాడే వినియోగదారులు ప్రస్తుతం రూ. 3,007 వరకు చెల్లిస్తుండగా.. ఈ మొత్తం రూ.3,180.50కు పెరగనుంది. అదే మరో యూనిట్ అదనంగా (501 యూనిట్లు) వాడితే.. బిల్లు మోత ఏకంగా రూ. 4,438.86కు చేరుతుంది.

హెచ్చు వినియోగానికి..
2015-2016 సంవత్సరానికి సంబంధించి డిస్కంలు ఎక్కువ విద్యుత్ వినియోగించేవారికి, పరిశ్రమలు, వ్యవసాయం వంటి పలు రంగాలకు చెందిన పెంపు ప్రతిపాదనలను సమర్పించాయి. గృహ లేదా వాణిజ్యావసరాలకు ఎల్‌టీ-2 కేటగిరీ కింద 50 యూనిట్ల వరకు రూ. 5.71 చార్జీగా నిర్ణయించారు.

ఇక ఎల్‌టీ-2 (బీ) కేటగిరీలో 0-50 యూనిట్ల వరకు రూ. 7.01, 51-100 యూనిట్ల వరకు రూ. 7.80, 101-300 యూనిట్ల వరకు రూ. 8.60, 301-500 యూనిట్ల వరకు రూ. 9.13, 500పైగా యూనిట్లకు రూ. 9.65 చొప్పున నిర్ధారించారు. ఇక ఎల్‌టీ-2(సి) కేటగిరీ కింద ప్రకటనల హోర్డింగ్‌లకు రూ.11.66 చార్జీగా నిర్ధారించారు.

ఎల్‌టీ కేటగిరి 3-కింద పరిశ్రమలకు యూనిట్‌కు రూ.6.43, సీజనల్ పరిశ్రమలకు రూ.7.14, చేప/రొయ్యల సాగుకు రూ. 4.90, చెరకు కర్మాగారానికి రూ. 4.90, కోళ్ల ఫారాలకు రూ. 5.95, పుట్టగొడుగులు/కుందేలు ఫారాలకు రూ. 5.95, గ్రీన్‌హౌస్‌లో ఫ్లోరికల్చర్‌కు రూ. 5.95కు చార్జీ పెంపును ప్రతిపాదించారు. ఎల్‌టీ కేటగిరీ 4- కుటీర పరిశ్రమలు  (10హెచ్‌పీపైగా) రూ. 3.97, ఆగ్రోబేస్డ్‌కు  (10హెచ్‌పీపైగా) రూ. 3.97; ఎల్‌టీ కేటగిరి 5 కింద వ్యవసాయానికి చార్జీలను మార్చలేదు.

ఎల్‌టీ కేటగిరి 6 కింద వీధి దీపాలు, పీడబ్ల్యుఎస్‌లకు స్వల్పంగా పెం చారు. ఎల్‌టీ కేటగిరి 7 (ఏ) కింద జనరల్ వినియోగానికి యూనిట్‌కు రూ. 6.91, ఎల్‌టీ 7(బి) కింద రిలీజియస్ ప్రాంతాల్లో రూ.4.97ను నిర్ధారించారు. ఎల్‌టీ కేటగిరి 8 కింద తాత్కాలిక సరఫరాకు రూ. 9.97, హెచ్‌టీ-1(ఎ) జనరల్‌లో 11 కెవీ, 33, 132 కేవీలకు సంబంధించి కొద్దిపాటి మార్పులు చేశారు.
Share this article :

0 comments: