www.ysrcongress.net :
Home » » ప్రభుత్వమే మద్యం అమ్మడమా?

ప్రభుత్వమే మద్యం అమ్మడమా?

Written By news on Wednesday, April 22, 2015 | 4/22/2015


ప్రభుత్వమే మద్యం అమ్మడమా?
సాక్షి, హైదరాబాద్: మద్యం అమ్మకాలను ప్రోత్సహించి ఆదాయాన్ని పెంచుకోవాలనే మత్తు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు  బయటకు రావాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ హితవు పలికారు. ఆమె మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మద్యం విషయంలో సీఎం ఎన్నికలకు ముందు చెప్పినదానికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తమిళనాడు తరహాలో ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేపట్టాలనేది ఒక దగుల్బాజీ విధానమని, అలాంటి ఆలోచనను మానుకోవాలని సూచించారు.

తమిళనాడులో ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేయడం వల్ల సమాజంపై పడుతున్న దుష్ర్పభావంపై అక్కడి ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని చెప్పారు. ఎన్నికలపుడు చంద్రబాబు ఏ వేదిక ఎక్కినా మహిళలవైపు చూసి బెల్ట్‌షాపులు రద్దు చేస్తానని, మద్యం మహమ్మారి వల్ల ఆడపడుచులు ఎన్ని బాధలు పడుతున్నారో తనకు తెలుసునంటూ ఆవేదన ఒలకబోశారని, తీరా అధికారంలోకి వచ్చాక మద్యం అమ్మకాలను ప్రోత్సహించే  చర్యలు చేపడుతున్నారని ధ్వజమెత్తారు. ‘‘తొలి ఐదు సంతకాల్లో నాలుగోదిగా మద్యం బెల్ట్‌షాపులను రద్దు చేశామని చెప్పారు. కానీ ఆ తరువాత అది అమలైందో లేదో పట్టించుకోలేదు. రైతుల రుణాలను మాఫీ చేసేశాం.. డ్వాక్రా మహిళలకు ఆర్థికసాయం చేసేశాం అని టీడీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నట్లుగానే బెల్ట్‌షాపుల రద్దుపై సంతకం చేసి రద్దు చేసేశామని చెప్పుకుంటున్నారు’’ అని పద్మ విమర్శించారు. దశలవారీగా మద్యాన్ని నియంత్రిస్తామన్న సీఎం, మంత్రులు మద్యం ఆదాయం పెంపుదలపై అధికారులకు టార్గెట్ల(లక్ష్యాల)ను నిర్దేశిస్తున్నారని ఆమె విమర్శించారు. చంద్రబాబు ఎంతసేపూ ఆదాయం పెరగాలి, పెరగాలంటూ మద్యం ఆకర్షణలో పడిపోయి.. మత్తులో పడిపోతున్నారని, ప్రజల జీవితాలను, ముఖ్యంగా మహిళల బతుకులను ఇదెంత దుర్భరం చేస్తోందో గుర్తించట్లేదని ఆమె విమర్శించారు.
Share this article :

0 comments: