ముడుపులు తీసుకుని రాయితీలు: అంబటి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ముడుపులు తీసుకుని రాయితీలు: అంబటి

ముడుపులు తీసుకుని రాయితీలు: అంబటి

Written By news on Saturday, April 25, 2015 | 4/25/2015


ముడుపులు తీసుకుని రాయితీలు: అంబటి
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ హామీల అమలుకు నిధుల్లేవని చెప్పే సీఎం చంద్రబాబు.. ముడుపులు ముట్టే చోట మాత్రం వేల కోట్లు నిధులిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు మళ్లీ అధికారం చేపట్టాక మార్చిలో పారిశ్రామికవేత్తలకు రూ. 2,060 కోట్లు రాయితీ రూపేణా చెల్లించారన్నారు. ఆ రాయితీ పొందిన వారిలో 99 శాతం మంది నిత్యం బాబు చుట్టూ ఉండే వారు, టీడీపీకి అనుకూలురేనన్నారు. ఈ రాయితీల్లో రూ. 600-700 కోట్లు చంద్రబాబుకు, ఆయన కుటుంబ సభ్యులకు ముడుపులుగా ముట్టాయనే ప్రచారం పారిశ్రామికవర్గాల్లో జోరుగా సాగుతుందన్నారు. పరిశ్రమలకు రాయితీలివ్వడాన్ని వ్యతిరేకించడంలేదని, అయితే ఎన్నికల హమీలను పక్కన పెట్టి ముడుపులు వచ్చే చోటే నిధులు కేటాయిస్తున్న తీరును తప్పుపడుతున్నామని అంబటి పేర్కొన్నారు.
 
 భూ కేటాయింపులోనూ ఇదే తంతు
 పరిశ్రమలకు, రాజధాని, ఎయిర్‌పోర్టు అంటూ రైతుల నుంచి వేలాది ఎకరాలు లాక్కుంటున్న చంద్రబాబు ప్రభుత్వం.. యోగా గురువులకు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని కట్టబెడుతోందని మండిపడ్డారు. యోగా గురువు జగ్గీ వాసుదేవ్‌కు 400 ఎకరాలు కట్టబెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. చంద్రబాబుది ఎక్కడి మాట అక్కడ మాట్లాడే నైజమని, మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో ఆయన మాటలే అందుకు నిదర్శనమని అంబటి విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుకు తానే మొదటి లేఖ రాశానని తెలంగాణలో చెప్పిన బాబు, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ కారణమంటున్నారని అంబటి దుయ్యబట్టారు.
 
 ‘హోదా’ రాకపోవడం బాబు వైఫల్యమే
 ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి లిఖిత పూర్వకంగా చెప్పడం దురదృష్టకరమని అంబటి వ్యాఖ్యానించారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఈ ప్రకటనతో చంద్రబాబు, టీడీపీ సిగ్గుతో తలదించుకోవాలన్నారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉంటూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించకపోవడంలో బాబు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అఖిలపక్షం ఏర్పాటు చేయాలని కొన్ని ప్రతిపక్ష పార్టీలు కోరినా.. కేంద్రం తప్పనిసరిగా ఇస్తుందని చంద్రబాబు మాయ మాటల చెప్పి అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే టీడీపీ- బీజేపీకి ఓటు వేయాలని ఎన్నికల సమయంలో ప్రతి సందులో ప్రచారం చేసిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్య, సీఎం చంద్రబాబు ఇప్పుడు ప్రజలను మోసం చేశారని చెప్పారు. ప్రత్యేక హోదా తీసుకురావడంలో ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ వైఫల్యం చెందిందా అని ఒక విలేకరి ప్రశ్నించగా.. ఇందులో చంద్రబాబు సఫలమయ్యారని, జగన్‌మోహన్‌రెడ్డి విఫలమయ్యారన్నది మీ ఉద్దేశమైతే తామీ జవాబు చెప్పగలమని బదులిచ్చారు.
Share this article :

0 comments: