రైతులను ఆదుకోవాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైతులను ఆదుకోవాలి

రైతులను ఆదుకోవాలి

Written By news on Tuesday, April 21, 2015 | 4/21/2015


రైతులను ఆదుకోవాలి
- ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు అన్ని రాయితీలు ఇవ్వాలి
- లోకసభలో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, తిరుపతి: అన్నదాతలను ఆదుకోవాలని రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి లోకసభలో సోమవారం గళమెత్తారు. రైతు సమస్యలపై జరిగిన చర్చలో ఆయన పాల్గొని ప్రధానంగా అన్నదాతల సమస్యలను కళ్లకు కట్టినట్లు వివరించారు. రాష్ట్రంలో అన్నదాతలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని వివరించారు.

ముఖ్యంగా ప్రభుత్వం రైతులకు ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సూచించిన మేర కనీస మద్దతు ధర ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కృష్ణా డెల్టాలోని రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువ ధర *780కు ధాన్యం విక్రయిస్తున్నారన్నారు. హుదూద్ బాధితులను ఇంతవరకు ఆదుకోలేదని ఆయన సభ దృష్టికి తెచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో భూగర్భజలాలు అడుగంటిపోయాయన్నారు.

దీంతో సుమారు 35 ఏళ్లకు పైబడిన మామిడి చెట్లు నిలువునా ఎండిపోయాయన్నారు. గోరుచుట్టుపై రోకటిపోటు అన్న చందంగా ఇటీవల కురిసిన అకాలవర్షం, వడగండ్ల వానకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ 5 కిలోల వడగండ్లు పడిన విషయాన్ని సభ దృష్టికి  తెచ్చారు.

తీవ్ర సంక్షోభంలో ఉన్న అన్నదాతను అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా కనీస మద్దతు ధర ఇన్‌పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్‌తో పాటు అన్ని రాయితీలు ప్రభుత్వం రైతులకు అందించాలన్నారు. రైతులు తీసుకున్న పంట రుణాలను రద్దు చేయాలని ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.
Share this article :

0 comments: