రాప్తాడులో సర్కారీ వేట! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాప్తాడులో సర్కారీ వేట!

రాప్తాడులో సర్కారీ వేట!

Written By news on Thursday, April 30, 2015 | 4/30/2015


‘అనంత’లో తహసీల్దార్ ఆఫీస్‌లోనే వైఎస్సార్ సీపీ నేత దారుణ హత్య
⇒ పోలీస్‌స్టేషన్‌కు పక్కనే పథకం ప్రకారం ఘాతుకం
⇒ ఘటనాస్థలంలో రాప్తాడు ఎస్‌ఐ నేమ్‌బ్యాడ్జీ లభ్యం
⇒ మంత్రి పరిటాల సునీత కుటుంబీకులు, పోలీసు, రెవెన్యూ సిబ్బంది పాత్రపై అనుమానాలు

సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం మరోసారి రక్తసిక్తమైంది. విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాప్తాడు మండల నేత భూమిరెడ్డి శివప్రసాదరెడ్డి(49)పై రాజకీయ ప్రత్యర్థులు వేటకొడవళ్లతో విచక్షణా రహితంగా దాడిచేసి నరికి చంపారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలోని ఆర్‌ఐ చాంబర్‌లోనే ప్రసాదరెడ్డి ఉసురు తీశారు. సాక్షాత్తూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గ కేంద్రం రాప్తాడులో జరిగిన ఈ ఘటన వెనుక ప్రభుత్వంలోని పెద్దల హస్తం స్పష్టంగా కనిపిస్తోంది.

హత్య జరిగిన ప్రాంతం రెవెన్యూ కార్యాలయంలోని ఆర్‌ఐ చాంబర్ కావడం, అక్కడి బీరువాలోనే హత్యకు ఉపయోగించిన వేట కొడవళ్లను దాచి ఉంచడం, ఘటన జరిగిన ప్రాంతానికి కూతవేటు దూరంలో పోలీస్ స్టేషన్ ఉండడం, ఘటనా ప్రాంతంలో ఆ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్.ఐ.నాగేంద్రప్రసాద్ నేమ్ బ్యాడ్జి లభ్యం కావడం, హత్య జరిగిన సమయంలో పోలీస్ స్టేషన్‌లో అధికారులు సహా సిబ్బంది ఉండడం, అయినా ప్రత్యర్థులు వ్యూహాత్మకంగా హత్య చేయడం వంటి పరిణామాలు ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ఈ దారుణం జరిగిందనడానికి ప్రత్యక్ష నిదర్శనా లుగా కనిపిస్తున్నాయి. కాగా, ప్రభుత్వమే ఈ హత్యను చేయించిందని వైఎస్సార్ సీపీ నేతలు ముక్తకంఠంతో పేర్కొన్నారు.  

జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటనతో ప్రసాదరెడ్డి అనుచరులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లోని సామగ్రిని ధ్వంసం చేసి.. నిప్పుపెట్టారు. మరోపక్క ప్రసాదరెడ్డి హత్యతో ఆయన కుటుంబం కన్నీరుమున్నీరైంది. మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్, పరిటాల మురళిల అండతోనే హత్య జరిగిందని విరుచుకుపడ్డారు.  

పక్కా ప్రణాళికతో.. మూడు నిమిషాల్లోనే..
రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి గ్రామ సర్పంచ్ సావిత్రి భర్త ప్రసాదరెడ్డి వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్‌గా గతంలో బాధ్యతలు నిర్వర్తించారు. వ్యక్తిగత పని నిమిత్తం ఇటీవల మండల కేంద్రానికి వస్తూ వెళ్తుండేవారు. ప్రత్యర్థులు దీనిని అవకాశంగా తీసుకుని హత్యకు కుట్ర పన్నారు. ఈ క్రమంలో ప్రసాదరెడ్డిని తహశీల్దార్, ఆర్‌ఐలే బుధవారం పని ఉందంటూ ఫోన్ చేసి పిలవడంతో మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రసాదరెడ్డి తన అనుచరుడు శివయాదవ్‌తో కలసి రాప్తాడు తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లారు.అప్పటికే 8 మంది ప్రత్యర్థులు అక్కడ మాటు వేసి ఉన్నారు.

ప్రసాదరెడ్డి ఆర్‌ఐ దివాకర్ గదిలోకి వెళ్లి కూర్చున్నారు. ఇంతలోనే రెప్పపాటు కాలంలో ప్రత్యర్థులు ఒక్కసారిగా కార్యాలయంలోకి చొరబడి, శివయాదవ్‌ను కంప్యూటర్ గదిలోకితోసి తలుపులు మూసి, ఆర్‌ఐ చాంబర్ లోపల గడియపెట్టి ప్రసాదరెడ్డిపై వేటకొడవళ్లతో విరుచుకుపడ్డారు. మెడపై విచక్షణా రహితంగా నరికారు. చేతిని తెగ్గొట్టారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రెవెన్యూ కార్యాలయ సిబ్బంది సాక్షిగా మూడు నాలుగు నిమిషాల్లోనే ఈ ఘాతుకం జరిగిపోయింది. ప్రసాదరెడ్డికి భార్య, కుమారుడు రమణారెడ్డి ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.

పోలీస్, రెవెన్యూ సిబ్బంది పాత్రపై అనుమానం

హత్యకు పోలీసులతో పాటు రెవెన్యూ సిబ్బంది సహకరించారని ప్రసాదరెడ్డి సోదరుడు మహానందరెడ్డి ఆరోపించారు. నాగేంద్రప్రసాద్ ఇటీవల పరిటాల సునీత సొంత మండలం రామగిరి నుంచి రాప్తాడుకు బదిలీ అయ్యారు. ప్రసాదరెడ్డి హత్య కుట్రలో భాగంగానే నాగేంద్రప్రసాద్‌ను ఇక్కడికి బదిలీ చేయిం చినట్లు మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.

ఘటన స్థలంలో ఎస్‌ఐ నేమ్‌బ్యాడ్జి
ప్రసాదరెడ్డి హత్య జరిగిన ప్రదేశంలో రాప్తాడు ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్ నేమ్‌బ్యాడ్జీ దొరికింది. నేమ్‌బ్యాడ్జీ ఊడిపోయి ఉందంటే తోపులాట లేదా ఘర్షణ జరిగి ఉండాలని, అంటే ఎస్‌ఐ కూడా హత్య జరిగిన సందర్భంలో ఘటనా స్థలంలో ఉన్నట్లేనని బంధువులు ఆరోపిస్తున్నారు.ఈయన టీడీపీ వారికి సహకరిస్తూ.. వైఎస్సార్‌సీపీ వారి పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తుంటారనే విమర్శలున్నాయి. కాగా, ఇటీవల పెద్దవడుగూరు మండలం కిష్టిపాడులో సింగిల్‌విండో అధ్యక్షుడు విజయభాస్కరరెడ్డిని సొసైటీ కార్యాలయంలోనే ప్రత్యర్థులు హత్యచేశారు. ఇంతలోనే ఈ ఘటన జరగడంతో జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు విఫలమయ్యారనే వాదన వినిపిస్తోంది.

ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన
అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయిన తర్వాత ప్రసాదరెడ్డి మృతదేహాన్ని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్దకు తీసుకెళ్లేందుకు వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరారు. ఎస్పీ కార్యాలయం సమీపంలోకి రాగానే పోలీసులు అడ్డుకున్నారు. మరోదారి గుండా వెళ్లాలని సూచించారు. దీంతో వారు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎస్పీ రాజశేఖరబాబు  వచ్చి 24 గంటల్లో నిందితులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. అనంతరం మృతదేహాన్ని ప్రసాదరెడ్డి నివాసానికి తీసుకెళ్లారు.

రాప్తాడులో తీవ్ర ఉద్రిక్తత
హత్య సమాచారం తెలిసిన వెంటనే ప్రసాదరెడ్డి బంధువులు, అనుచరులు రాప్తాడుకి చేరుకుని ఆర్‌ఐ చాంబర్‌లో రక్తపు మడుగులో పడివున్న ప్రసాద్‌రెడ్డి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. ఆయన అనుచరులు ఆవేశానికిగురై.. తహశీల్దార్, మండల పరిషత్ కార్యాలయాల్లోని సామగ్రిని ధ్వంసం చేసి.. నిప్పంటించారు. సీఎం చంద్రబాబు చిత్రపటాలకు నిప్పంటించారు. ప్రసాదరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు తీసుకెళ్లేందుకు యత్నించగా.. అనుచరులు అడ్డుపడ్డారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన ఎస్పీ రాజశేఖరబాబు.. మహానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డితో చర్చించి మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

పాతకక్షలతోనే హత్య: డీఐజీ
పాత కక్షల నేపథ్యంలోనే ప్రసాద్‌రెడ్డి హత్య జరిగిందని డీఐజీ బాలకృష్ణ చెప్పారు. బుధవారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. 2003లో రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లిలో జరిగిన ఉప్పర చలపతితో పాటు మరో ఇద్దరి హత్య కేసులో ప్రసాద్‌రెడ్డి, ఆయన సోదరుడు మహానందరెడ్డితో పాటు గోపాల్‌రెడ్డి నిందితులన్నారు. కాగా, ప్రసాదరెడ్డి హత్య కేసులో నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుంటామని చెప్పారు.

సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: వైఎస్సార్ సీపీ నేతలు
ప్రసాదరెడ్డిది రాజకీయహత్య అని, పథకం ప్రకారమే పోలీసులు, రెవెన్యూ సిబ్బంది హత్యకు సహకరించారని, మంత్రి పరిటాల సునీతతో పాటు పరిటాల మురళి, శ్రీరామ్ పాత్ర ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, చాంద్‌బాషా, పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాంలు ప్రభుత్వాస్పత్రిలో ప్రసాద్‌రెడ్డి మృతదేహాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రసాదరెడ్డి హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
పథకం ప్రకారమే..
⇒ వైఎస్సార్‌సీపీ నేత భూమిరెడ్డి శివప్రసాదరెడ్డి దారుణహత్య
⇒ రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలో నరికి చంపిన ప్రత్యర్థులు
⇒ పోలీసులు, రెవెన్యూ అధికారుల అండతో మంత్రి పరిటాల సునీత హత్య చేయించారని బంధువుల ఆరోపణ
⇒ తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలకు నిప్పు.. రాప్తాడులో ఉద్రిక్తత
⇒ పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు
⇒ 13 మందిపై కేసు.. నిందితుల్లో ఎంపీపీ దగ్గుపాటి ప్రసాద్, ఉప్పర శ్రీనివాసులు

 
(సాక్షి ప్రతినిధి, అనంతపురం): రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లికి చెందిన  వైఎస్సార్‌సీపీ కీలక నేత భూమిరెడ్డి శివ  ప్రసాదరెడ్డిని ప్రత్యర్థులు పథకం ప్రకారమే హత్య చేసినట్లు స్పష్టమవుతోంది. బుధవారం రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలో అధికారులందరూ చూస్తుండగానే  వేటకొడవళ్లతో అతి కిరాతకంగా నరికి చంపారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల సహకారంతో మంత్రి పరిటాల సునీత ఈ హత్య చేయించారని ప్రసాదరెడ్డి బంధువులు ఆరోపిస్తున్నారు. హత్యతో రాప్తాడుతో పాటు అనంతపురంలో  తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రసాదరెడ్డి మొన్నటిదాకా వైఎస్సార్‌సీపీ రాప్తాడు మండల కన్వీనర్‌గా కొనసాగారు. ప్రస్తుతం ఆయన భార్య సావిత్రి ప్రసన్నాయపల్లి సర్పంచ్‌గా ఉన్నారు. ప్రసాదరెడ్డి ఓ వ్యక్తిగత పని కోసం తహశీల్దార్ కార్యాలయానికి కొన్నిరోజులుగా వస్తూ పోతూ ఉండేవారు. దీన్ని గమనించిన ప్రత్యర్థులు హత్యకు పక్కా వ్యూహం రచించారు. బుధవారం మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రసాదరెడ్డి తన అనుచరుడు శివయాదవ్‌తో కలిసి తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. ఆర్‌ఐ దివాకర్ గదిలో కూర్చొన్నారు.

అప్పటికే ఎనిమిది మంది దుండగులు అక్కడ మాటు వేసివున్నారు. ప్రసాదరెడ్డి ఆర్‌ఐ ఛాంబర్‌లోకి వెళ్లిన కొద్దిసేపటికే వారు కార్యాలయం లోపలికి చొరబడ్డారు. మొదట కొందరు ప్రసాద్ అనుచరుడు శివను కంప్యూటర్ గదిలో నిర్బంధించి.. తలుపు వేశారు. ఇంకొందరు ఆర్‌ఐ ఛాంబర్‌లోకి వెళ్లి తలుపులు మూసి.. వేటకొడవళ్లతో ప్రసాదరెడ్డిపై విరుచుకుపడ్డారు. మెడపై బలంగా నరికారు. రక్షించుకునే ప్రయత్నంలో ప్రసాదరెడ్డి చేయి అడ్డుపెట్టగా.. చేతివేళ్లు తెగిపోయాయి. ఆయన ఒక్కడే కావడం...ప్రత్యర్థులు భారీగా ఆయుధాలతో రావడంతో ఏమీ చేయలేకపోయారు. వారి దాడిలో అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. ప్రసాదరెడ్డికి కుమారుడు రమణారెడ్డి ఉన్నారు.
 
బోరున విలపించిన కుటుంబ సభ్యులు
హత్య విషయం తెలీగానే  ప్రసాదరెడ్డి భార్య సావిత్రి, సోదరుడు మహానందరెడ్డితో పాటు కుటుంబ సభ్యులు ఘటన స్థలికి చేరుకున్నారు. రక్తపు మడుగుల్లో ఉన్న ప్రసాదరెడ్డిని చూసి బోరున విలపించారు. ‘వస్తానని చెప్పి వెళ్లి ఇలా అయ్యాడే’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇంతలోనే భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రసాదరెడ్డి అనుచరులు అక్కడికి వచ్చారు. ఆగ్రహావేశాలకు లోనయ్యారు. తహశీల్దార్ కార్యాలయంలోని ఫర్నీచర్‌తో పాటు రికార్డులను ధ్వంసం చేసి.. నిప్పటించారు. బైక్‌లకు నిప్పటించారు. మండల పరిషత్ కార్యాలయంలోకీ చొరబడి.. ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి, నిప్పటించారు. దీంతో పోలీసు బలగాలను భారీగా రప్పించారు. ఎస్పీతో పాటు  పలువురు డీఎస్పీలు, సీఐలు, స్పెషల్‌పార్టీ పోలీసులు చేరుకున్నారు.
 
ఎస్పీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత
పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని దివంగత సీఎం రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలు భారీర్యాలీగా బయలుదేరారు. ఎస్పీ కార్యాలయం వద్ద  ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. మరో దారి గుండా వెళ్లాలని సూచించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శాంతియుతంగా వైఎస్సార్ విగ్రహం వద్దకు వెళ్లడం కూడా తప్పేనా అని మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి పోలీసులను నిలదీశారు. పది నెలల్లో చాలా ఘోరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయని, పోలీసులు ఏం చేశారని అనంత వెంకట్రామిరెడ్డి నిలదీశారు.

డీజీపీ వచ్చిన రోజే పెద్దవడుగూరులో హత్య, అనంతపురం తహశీల్దార్ షేక్ మహబూబ్ బాషాపై దాడి చేశారని గుర్తు చేశారు.  ఇవాల తహశీల్దార్ కార్యాలయంలోనే ప్రసాదరెడ్డిని హతమార్చారన్నారు. ఇవన్నీ మీ నిర్లక్ష్యంతోనే జరిగాయంటూ మండిపడ్డారు.  డీఎస్పీలు చివరకు జిల్లా ఎస్పీకి సమాచారాన్ని అందించారు.  ఎస్పీ  వచ్చి  ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామనడంతో వారు శాంతించారు.
 
పక్కా వ్యూహం ప్రకారం హత్య
ప్రసాదరెడ్డి హత్య పక్కా వ్యూహం ప్రకారం జరిగింది. ప్రసాదరెడ్డి బుధవారం తహశీల్దార్ కార్యాలయానికి వస్తారనే సంగతిని ప్రత్యర్థులు ముందే ఎలా పసిగట్టారనే దానిపై బోలెడు అనుమానాలు తలెత్తుతున్నాయి.కార్యాలయానికి ప్రసాదరెడ్డిని..తహశీల్దార్ హరికుమార్, ఆర్‌ఐ దివాకర్ ఫోన్ చేసి పిలిపించినట్లు ఆయన సోదరుడు మహానందరెడ్డి చెబుతున్నారు. పైగా ప్రత్యర్థులు ఆర్‌ఐ ఛాంబర్‌లోకి వచ్చిన తర్వాత అక్కడి బీరువాలో నుంచి వేటకొడవళ్లను తీసుకున్నారని కూడా తెలుస్తోంది. అంటే పథకం ప్రకారమే వేటకొడవళ్లను బీరువాలో ఉంచి, హత్యకు రెవె న్యూ అధికారులు కూడా సహకరించారని తెలుస్తోంది.
 
ఎస్‌ఐ నాగేంద్రప్రసాద ఆధ్వర్యంలోనే హత్య?
ప్రసాదరెడ్డి హత్యకు రాప్తాడు ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్  పూర్తిగా సహకరించారని మహానందరెడ్డి ఆరోపిస్తున్నారు. తహశీల్దార్ కార్యాలయం, పోలీసుస్టేషన్ పక్కపక్కనే ఉన్నాయి. రెంటికీ ముళ్లకంచె మాత్రమే అడ్డు. పైగా హత్య జరిగిన ప్రదేశంలో ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్ నేమ్‌బ్యాడ్జీ దొరికింది. అది ఊడిపోయి ఉందంటే తోపులాట లేదా ఘర్షణ జరిగి ఉండాలని, అంటే ఎస్‌ఐ కూడా హత్య జరిగే సందర్భంలో ఉన్నట్లేనని బంధువులు ఆరోపిస్తున్నారు. నాగేంద్రప్రసాద్ ఇటీవలే  పరిటాల సునీత సొంత మండలం రామగిరి నుంచి రాప్తాడుకు బదిలీ అయ్యారు. టీడీపీ నేతలకు ఈయన పూర్తిగా సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రసాదరెడ్డి హత్య కుట్రలో భాగంగానే నాగేంద్రప్రసాద్‌ను రాప్తాడుకు బదిలీ చేయించినట్లు ప్రసాదరెడ్డి బంధువులు ఆరోపిస్తున్నారు.
 
13 మందిపై కేసు : ప్రసాదరెడ్డి హత్యకు సంబం ధించి 13 మందిపై   కేసు నమోదు చేశారు. రాప్తాడు ఎంపీపీ దగ్గుపాటి ప్రసాద్, ఉప్పర శ్రీనివాసులతో పాటు పలువురిని నిందితులుగా పేర్కొన్నారు.  
 
తలశిల రఘురాం పరామర్శ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం కో ఆర్డినేటర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ప్రసాదరెడ్డి కుటుంబీకులను ఓదార్చారు. వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రసాదరెడ్డి తమ్ముడు మహానంద రెడ్డితో మాట్లాడారు.  
 
మృతదేహం తీసుకెళ్లకుండా ఆందోళన
ప్రసాదరెడ్డి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పార్టీ కార్యకర్తలు, మిహ ళలు తహశీల్దార్ కార్యాలయం గేటు ఎదురుగా బైఠాయించి ఆందోళన చేశారు. చివరకు ఎస్పీ రాజశేఖర్‌బాబు.. ప్రసాదరెడ్డి సోదరుడు మహానందరెడ్డి,మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డితో చర్చించారు.

మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు సహకరించాలని కోరారు. దీంతో ప్రసాదరెడ్డి వాహనంలోనే మృతదేహాన్ని  అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, చాంద్‌బాషా, పార్టీ రాష్ట్రప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, క్రమశిక్షణ కమిటీ సభ్యులు ఎర్రిస్వామిరెడ్డి, తోపుదుర్తి భాస్కర్‌రెడ్డితో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్దకు వచ్చారు.
Share this article :

0 comments: