‘పచ్చ’ తమ్ముళ్లే ఎర్ర దొంగలు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘పచ్చ’ తమ్ముళ్లే ఎర్ర దొంగలు!

‘పచ్చ’ తమ్ముళ్లే ఎర్ర దొంగలు!

Written By news on Sunday, May 3, 2015 | 5/03/2015


‘పచ్చ’ తమ్ముళ్లే ఎర్ర దొంగలు!
సీఎంతో ఎర్రచందనం స్మగ్లర్లకు ప్రత్యక్ష అనుబంధం
సాక్షి హైదరాబాద్,నెట్‌వర్క్: ఎర్రచందనం స్మగ్లింగ్ పుట్ట తవ్వినకొద్దీ తెలుగుతమ్ముళ్ల పేర్లే బయటకు వస్తున్నాయి. టీడీపీ అధినేతతోపాటు కీలక నేతలతో ప్రత్యక్ష సంబంధాలున్న స్థానిక నేతలదే స్మగ్లింగులో కీలకభూమికని వెల్లడవుతోంది. తమపార్టీలోని బడా స్మగ్లర్లను రక్షించుకునేందుకే 20 మంది కూలీలను ఎన్‌కౌంటర్ చేయించారన్న విమర్శలూ వినవస్తున్నాయి. చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలో పీడీ చట్టం కింద కేసులు నమోదైన వారిలో అత్యధికులు టీడీపీ నేతలు కావడమే ఇందుకు నిదర్శనం.

గత ఎన్నికల్లో పలువురు ఎర్రస్మగ్లర్లకు టీడీపీ టిక్కెట్లు ఇవ్వడమే ప్రత్యక్షసాక్ష్యం. ఒకప్పుడు బతుకుదెరువుకోసం కువైట్ వెళ్లి వచ్చిన వారే పచ్చ గొడుగు నీడలో బడా స్మగ్లర్లుగా మారారు. రాష్ట్రంలోని తిరుపతి, హైదరాబాద్ లాంటి నగరాల్లోనే కాకుండా బెంగళూరు, చెన్నైల్లో సైతం భారీ భవంతులకు అధినేతలయ్యారు. వేలకోట్ల విలువైన ఎర్రచందనం కొల్లగొట్టి వందలకోట్లు పార్టీకి విరాళాలుగా ఇచ్చారు. పోలీసు, అటవీ అధికారులకు నోట్ల కట్టలు వెదజల్లారు... లొంగని వారిని  బెదిరించారు. పచ్చజెండా అండతో మరికొందరు తెలుగు తముళ్లుకూడా శేషాచలం అడవుల బాట పడుతున్నారు. వారి నుంచి  పార్టీ అధినేతకు భారీగా ముడుతోందనే ఆరోపణలు అధికార పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి.

గురుశిష్యులతో  అనుబంధం

ఎర్రచందనం స్మగ్లింగ్‌తో సంబంధం ఉన్న టీడీపీ నాయకుల పేర్ల జాబితా కొండవీటి చాంతాడంతవుతుంది. ముందుగా చప్పిడి మహేష్‌నాయుడు, మద్దిపెట్ల రెడ్డినారాయణ అనే గురుశిష్యుల గురించి తెలుసుకుందాం. వైఎస్సార్ జిల్లా  సుండుపల్లె, సంబేపల్లె మండలాల పరిధిలో ఆ ఇరువురి గ్రామాలున్నాయి. జీవనోపాధికోసం ఇద్దరూ కువైట్‌కు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత పక్కనే ఉన్న శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ మొదలుపెట్టారు. 15 ఏళ్లుగా అదే ప్రధానవృత్తిగా జీవనం సాగిస్తున్నారని పోలీసు రికార్డులు తేటతెల్లం చేస్తున్నాయి.

గ్రామీణులను అడవులకు పంపించి చందనం చెట్లు నరికించి చెన్నై పంపించడం ద్వారా స్మగ్లింగ్ మొదలుపెట్టిన వీరు ఇప్పుడు అంతర్జాతీయ స్మగ్లర్లుగా ఎదిగిపోయారు. వీరి వ్యవహారాలకు అడ్డు నిలిచిన అటవీ అధికారులపై అనేకసార్లు దాడులకు తెగబడ్డారు. ఆమేరకు సుండుపల్లె, సంబేపల్లె పోలీసుస్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. వారే టీడీపీలో కీలక నేతలుగా ఎదిగారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా అసెంబ్లీలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారనే కారణంగా వైఎస్సార్ జిల్లాకు చెందిన ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు ఎమ్మెల్యే పదవులు కోల్పోయిన సందర్భంగా జరిగిన ఉప ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ తరఫున ఈ గురుశిష్యులే ప్రధాన భూమిక పోషించారు.

రాజంపేట అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా మహేష్‌నాయుడుకు చంద్రబాబు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అతని పిలుపుతోప్రచారం నిమిత్తం సుండుపల్లెకు హెలికాప్టర్‌లో వెళ్లారు. ఆ సభలో మహేష్‌నాయుడును తన పక్కనే కూర్చోబెట్టుకొని పొగడ్తలతో ముంచెత్తారు. రాయచోటి నియోజకవర్గ పరిధిలో రెడ్డినారాయణ నిర్ణయాలకే బాబు ప్రాధాన్యం ఇచ్చారు. అప్పటికే ఓమారు పీడీ యాక్టు కింద అరెస్టయిన రెడ్డినారాయణకు సంబేపల్లె జెడ్పీటీసీ అభ్యర్థిగా బీఫారం ఇచ్చారు. ఆయనను  ప్రజలు ఓడించారు. సుండుపల్లె మండలంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక మహేష్‌నాయుడు కనుసన్నల్లో సాగింది.  స్మగ్లింగు సొమ్మును నీళ్లలా ఖర్చుచేసి ఆయన తల్లి శ్రీలతదేవికి జీ.రెడ్డివారిపల్లె ఎంపీటీసీగా గెలిపించుకున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘ఎర్రదండు’

స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎర్రచందనం స్మగ్లర్లనే టీడీపీ ప్రోత్సహించింది. సుండుపల్లె మండలం జీకే రాచపల్లెకు చెందిన పటాల రమణపై పలు కేసులున్నాయి. ఆయన సోదరుడు వీరమల్లనాయుడుకు టీడీపీ సుండుపల్లె జడ్పీటీసీ టికెట్ ఇచ్చింది. ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లె ఎంపీటీసీ సుబ్బానాయుడు, రాజంపేట మండలం బసినాయుడుగారిపల్లెకు చెందిన దేవానాయుడు, సాతుపల్లెకు చెందిన సత్యాల రామకృష్ణ మీద కూడా స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి.

మైదుకూరు మండలం జాండ్లవరానిక చెందిన టీడీపీ నేత శ్రీనివాసులనాయుడు ప్రస్తుతం పీడీ యాక్టు కింద రాజమండ్రి జైల్లో ఉన్నారు. బి.మఠం మండలంలో టీడీపీ కీలక నేత చెంచయ్యగారిపల్లెకు చెందిన సి.సుబ్బారెడ్డికీ ఈ స్మగ్లింగ్‌తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. టీడీపీ మైదుకూరు ఇన్‌ఛార్జి పుట్టా సుధాకర్‌యాదవ్ అనుచరులు చినమల నరసింహులు యాదవ్, కటారి చిన్న వీరయ్యపైనా ఈ కేసులు ఉన్నాయి.
 
కర్నూలు జిల్లాలో....: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని కొందరు టీడీపీ నేతలకు కూడా ఈ స్మగ్లింగ్‌తో సంబంధాలున్నాయి. రుద్రవరం మండలం నాగులవరం గ్రామానికి చెందిన గంధం భాస్కరరెడ్డి 2014 ఎన్నికల ముందు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆయనపై రుద్రవరం పోలీసు స్టేషన్‌లో రౌడీషీట్ కూడా ఉంది. తర్వాత ఎర్రచందనం అక్రమ రవాణా కేసు నమోదైంది. కొత్తపల్లి మాజీ సర్పంచ్ సావిత్రి భర్త రాఘవరెడ్డిపై కూడా ఎర్రచందనం అక్రమ రవాణా కేసు ఉంది.  ఆయన టీడీపీ నేత గంగుల ప్రతాప్‌రెడ్డి ముఖ్య అనుచరుడు.
 
పీడీ యాక్టులో అత్యధికులు టీడీపీ నేతలే
వైఎస్సార్ జిల్లాలో ఇటీవల కాలంలో 16 మందిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదుకాగా ఇందులో ఎనిమిది మంది  టీడీపీ మద్దతుదారులే. జాండ్లవరం శ్రీనివాసులునాయుడు, ఒంటిమిట్ట మండలంలోని గాండ్లపల్లె జంగాల శివశంకర్, అదేమండలంలోని పట్రపల్లెకు చెందిన బొడ్డే శ్రీనివాసులు, కాశినాయన మండలానికి  చెందిన ఎంబడి జయరాజు, సిద్దవటం మండలం తుర్రావెంకటసుబ్బయ్య, సంబేపల్లె మండలానికి చెందిన రెడ్డినారాయణ, సుండపల్లె మండలానికి చెందిన మహేష్‌నాయుడు,  శివప్రసాద్‌నాయుడు అలియాస్ గుట్ట బాబు పీడీ యాక్టు కింద గతంలో అరెస్టయ్యారు. వీరంతా టీడీపీ మద్దతుదారులే. మిగిలిన వారిలో ఐదుగురికి ఏ రాజకీయ పక్షంతో సంబంధం లేదని అటవీ అధికారులు తెలిపారు.
 
సీఎం సొంత జిల్లాలో....
సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో పలువురు టీడీపీ నేతలు ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా భారీగా సంపాదించి విదేశాల్లో సైతం వ్యాపారాలు సాగిస్తున్నారు. టీడీపీ ప్రచార కార్యదర్శిగా పనిచేసిన చెరుకూరి వసంతకుమార్‌పై జిల్లాలో ఏడు ఎర్రచందనం కేసులు ఉన్నాయి. గతంలో పోలీసులు అరెస్టు చేసినా బెయిల్‌పై బయటకు వచ్చేశారు.

ఆయనపై పీడీ యాక్టు కింద కేసు పెట్టినా సీఎం తనయుడు లోకేష్ స్వయంగా కల్పించుకోవడంతో అడ్వయిజరీ బోర్డు సమావేశం పెట్టకుండానే ప్రభుత్వం కేసు ఎత్తివేసింది. అందుకు ప్రతిఫలంగా గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పలువురు టీడీపీ అభ్యర్థులకు వసంతకుమార్ డబ్బు పంపిణీ చేశారు. యాదమరి మండలానికి చెందిన పాపిదేశి ఆనందనాయుడు, చుండ్లవంకకు చెందిన శ్రీశైలం ఆంజనేయులు, చిన్నగొట్టిగల్లు తుమ్మిచేనపల్లెకు చెందిన ఆవుల మోహనరెడ్డిలపై కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి.
Share this article :

0 comments: