రాజధాని పేరిట రైతుల భూములతో పక్కా రియల్ వ్యాపారం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజధాని పేరిట రైతుల భూములతో పక్కా రియల్ వ్యాపారం

రాజధాని పేరిట రైతుల భూములతో పక్కా రియల్ వ్యాపారం

Written By news on Sunday, September 27, 2015 | 9/27/2015


రియల్ దోపిడీ
♦ రాజధాని పేరిట రైతుల భూములతో పక్కా రియల్ వ్యాపారం
♦ నిర్మాణ పురోగతిపై నివేదిక ఇస్తేనే తదుపరి నిధుల మంజూరు
♦ రాజధానికి 2వేల ఎకరాలు సరిపోతుందని మహానాడులో తీర్మానం
♦ మొదట 33,400 ఎకరాలు.. తాజాగా మరో 2,600 ఎకరాలకు ఎసరు
♦ రాజధానిలో రైతుకు కేటాయించే భూమి ఎక్కడిస్తారో చెప్పని వైనం..

 సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణం పక్కా రియల్ ఎస్టేట్ వ్యాపారం కాబోతోంది. సింగపూర్ ప్రభుత్వంతో ఉన్న పూర్వ పరిచయాల దృష్ట్యా ఉచితంగా ప్రపంచస్థాయి రాజధానిని నిర్మింపజేస్తామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రైతుల నుంచి లాక్కొన్న భూములను రాజధాని నిర్మాణం పేరిట సింగపూర్ సంస్థలకు అప్పనంగా అప్పగించి.. అన్నదాతలను నిలువు దోపిడీ చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. పైసా పెట్టుబడి లేకుండా రైతుల నుంచి సమీకరించిన భూముల్ని ఎలాంటి టెండర్లు లేకుండా ఆ దేశ సంస్థలకు ధారాదత్తం చేయడం వెనుక పెద్ద గూడుపుఠాణి దాగి ఉందనేది స్పష్టమవుతోంది. ముక్కారు పంటలు పండే భూములను స్విస్ చాలెంజ్ విధానంలో సింగపూర్ సంస్థలకు అప్పగించడం వెనుక  కేవలం తన స్వప్రయోజనాల కోసం, కమీషన్ల కోసమే చంద్రబాబు ఇదంతా చేస్తున్నారని ఇట్టే అర్థమవుతోంది.

 కోట్లాది నిధులిచ్చినా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారం...
 రాజధాని నిర్మాణం కోసం కేంద్రం రూ.1,850 కోట్లు ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు నయాపైసా ఖర్చు చేయలేదు. కనీసం ఒక్క ఇటుకైనా సమకూర్చలేదు. కేంద్రం కేటాయించిన నిధుల్ని సీఎం చంద్రబాబు కన్సల్టెన్సీల సేవలంటూ ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారు. రాజధానికి కేంద్రం ఇదివరకే రూ.1,500 కోట్లు ఇవ్వగా, తాజాగా మరో రూ.350 కోట్ల మంజూరు చేసింది. కేంద్రం ప్రకటించిన నిధులతో సచివాలయం,అసెంబ్లీ, రాజ్‌భవన్, హైకోర్టు తదితర ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు ఇప్పటికే మొదలు పెట్టి ఉంటే ఈపాటికే కొంత పురోగతి ఉండేది. కేంద్రంపైనా ఒత్తిడి పెరిగేది.

తద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు రాబట్టడానికి అవకాశం ఉండేది. కేంద్రం రాజధాని నిర్మాణం కోసం అంగీకరించిన రూ.5 వేల కోట్లు అందించేది. దీంతో ఈ ప్రాంతంలో అభివృద్ధికి బాటలు పడేవి. సహజంగానే భూమి రేట్టు పెరిగేవి. ఇలాంటప్పుడు సమీకరించిన భూములను జోనింగ్ చేసి ఉంటే ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు చేపట్టడం వల్ల రూ.2 కోట్లు పలుకుతున్న ఎకరం భూమి విలువ రూ.5 నుంచి రూ.6 కోట్ల వరకు చేరేది. తద్వారా రైతులకు లబ్ధి చేకూరేది. కానీ, కేంద్రం ఇప్పటికే మంజూరు చేసిన నిధులకు సంబంధించి పనుల పురోగతిపై నివేదికలు(యుటిలైజేషన్ సర్టిఫికెట్లు) సమర్పిస్తే తప్ప తదుపరి నిధులు మంజూరు చేయదు.

ఈ విషయాలన్నీ చంద్రబాబుకు తెలిసినా, అందరూ అనుకున్నట్లే.. ప్రతిపక్షాలు మొదట్నుంచీ చెబుతున్నట్లుగా భూములన్నిటినీ సింగపూర్ సంస్థలకు కారుచౌకగా ధారాదత్తం చేయడానికి ముఖ్యమంత్రి పక్కా ప్రణాళిక రచించారు. సింగపూర్ సంస్థలకు బహుళ ప్రయోజనాలు కల్పించడంవ్యూహం వెనుక తన స్వప్రయోజనాలూ దాగి ఉండటం వల్లే ముఖ్యమంత్రి ఈ వైఖరిని ఎంచుకున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

 టీడీపీ మహానాడులో చెప్పిందొకటి... ఇప్పుడు చేసేది మరొకటి
 రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి ఇప్పటికే 33,400 ఎకరాల పంట భూములను ప్రభుత్వం లాగేసుకుంది. రాజధాని ప్రాంతంలో అసైన్డ్, దేవాదాయ, అటవీ భూములన్నీ కలిపి 52 వేల ఎకరాల వరకు భూమి ఉంది. సమీకరించిన 33,400 ఎకరాలు సరిపోదని, మరో 2,600 ఎకరాలు అవసరమని ప్రభుత్వం భావించింది. అయితే, సమీకరణకు రైతులు ముందుకు రాకపోవడంతో భూసేకరణ నోటిఫికేషన్‌ను ప్రయోగించింది. రాజధాని నిర్మాణానికి 2వేల ఎకరాలు సరిపోతుందని టీడీపీ మహానాడులో చేసిన తీర్మానంలోనూ పేర్కొన్న విషయం తెలిసిందే.

అందుకు భిన్నంగా, రైతుల నుంచి ఇంత పెద్ద మొత్తంలో భూములు సమీకరించడం వెనుక ‘రియల్ ఎస్టేట్’ ప్లాన్ స్పష్టంగా కనబడుతోంది. గతంలో హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మించిన సమయంలో అనుసరించిన విధంగానే ఇప్పుడూ వ్యవహరిస్తున్నారు. హైటెక్ సిటీ నిర్మించినప్పుడు ఏపీఐఐసీ(ప్రభుత్వ వాటా)కి 11 శాతం, డెవలపర్‌గా నిర్మాణం సంస్థ ఎల్‌అండ్‌టీకి 89 శాతం కట్టబెట్టారు. హైటెక్ సిటీకి అవసరమైన భూమితోపాటు 24 గంటల విద్యుత్, మంచినీరు సౌకర్యం, పలు రాయితీలు ఇచ్చారు. ఇంత చేసినా సర్కారు వాటా కేవలం 11 శాతం మాత్రమే. అదే పద్ధతిన స్విస్ చాలెంజ్ విధానంలో సింగపూర్ సంస్థలకు రైతుల భూములను అప్పగించేస్తున్నారు.

 వంచన చక్ర బంధంలో అన్నదాత...
 ఎకరాకు 4,840 గజాలు. వుడా(విజయవాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) నిబంధనల ప్రకారం ప్రభుత్వమే జోనింగ్ చేసి లేఔట్ వేస్తే 35 శాతం రోడ్లు, మార్టిగేజ్, ఇతర మౌలిక అవసరాలకు పోతుంది. అంటే ఎకరాకు వచ్చే 4,840 గజాల్లో 1,694 గజాలు మౌలిక వసతులకు పోతుంది. రైతుకు 3,146 గజాలు మిగులుతుంది. ఇందులో రైతులు తన ఇష్టానుసారం నిర్మాణమో, వ్యాపారమో, వ్యవసాయమో చేసుకునేవారు. ప్రభుత్వం రైతుల నుంచి సమీకరించిన భూములకు జరీబు, మెట్ట భూములుగా లెక్కించి పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

జరీబు భూములకు రెసిడెన్షియల్, కమర్షియల్ కలిపి 1,450 గజాలు, మెట్ట భూములకు 1,200 గజాలు మాత్రమే రైతులకు దక్కుతుందని ప్రకటించింది. పైగా ప్రభుత్వం పరిహారం కింద అందించే భూమిని ఎక్కడ ఇస్తుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. మరోవైపు సీడ్ కేపిటల్ ప్లానింగ్‌లో రైతు తనకు కేటాయించిన భూమిలో స్వయంగా వాణిజ్య సముదాయాన్ని గానీ, నివాసాన్ని గానీ నిర్మించుకోలేని దుస్థితి కల్పించింది. భవన సముదాయాలు(అపార్టుమెంట్లు) నిర్మించుకోవాలని తేల్చి చెప్పింది. ఇలాంటి పెద్ద నిర్మాణాలను రైతులు స్వయంగా నిర్మించుకోలేరు కాబట్టి, డెవలపర్‌ను ఆశ్రయించాల్సిందే.

అదే జోనింగ్ చేస్తే రాజధాని నిర్మాణం వల్ల ఒనగూరే గరిష్ట ప్రయోజనం నేరుగా రైతుకే దక్కుతుంది. రాజధాని నిర్మాణం కోసం త్యాగం చేసినందుకు ఫలితమూ దక్కుతుంది. ఎకరా లేఔట్‌కు పోనూ మిగిలే 3,146 గజాల్లో 70 శాతం రైతుకు, 30 శాతం డెవలపర్‌కు వాటా నిష్పత్తిగా రైతుకు అదనపు ప్రయోజం కలిగేది. ఈ వాటా నిష్పత్తి ప్రకారం 3,146 గజాల్లో 70 శాతం అంటే 2,202 గజాలు రైతుకు, 943 గజాలు డెవలపర్‌కు దక్కుతుందన్నమాట.
Share this article :

0 comments: