అడుగడుగునా ఘన స్వాగతం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అడుగడుగునా ఘన స్వాగతం

అడుగడుగునా ఘన స్వాగతం

Written By news on Friday, October 19, 2012 | 10/19/2012

Written by Rajababu On 10/19/2012 2:50:00 AM
మీ వెనుకే మేముంటామంటూ లక్షలాది గొంతుకల ధ్వనులు ఇడుపులపాయలో ప్రతిధ్వనించాయి. మహానేత వైఎస్ కుమార్తె షర్మిల చేపట్టిన ‘మరోప్రజాప్రస్థానం’కు ముక్తకంఠంతో జేజేలు పలికారు. దారిపొడవునా మహిళలు, వృద్ధులు, వికలాంగులకు అభివాదం చేస్తూ .. నాన్నను మరిపిస్తూ షర్మిల ముందుకు సాగారు. మండుటెండలో లక్షలాది పాదాలు ఏకమై షర్మిల పాదయాత్రలో అడుగు వేశాయి. ఉదయం 10.30 గంటలకు ఇడుపులపాయ వైఎస్‌ఆర్ ఘాట్‌కు చేరుకున్న వైఎస్ విజయమ్మ, తనయ షర్మిలమ్మ, కోడలు భారతి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి మహానేత వైఎస్ ఘాట్ వద్ద ప్రార్థనలుచేశారు. అనంతరం హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దల ఆశీస్సులను షర్మిల అందుకున్నారు. అక్కడే ఉన్న వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

అనంతరం వేదిక మీదకు చేరుకున్న వైఎస్ విజయమ్మ ఉద్వేగంగా ప్రసంగిస్తూ... ‘ప్రజల మనిషి, జన హితుడు నా భర్త మృతి చెందారు. ఇద్దరు బిడ్డలుంటే ఒక బిడ్డను జైలుపాలు చేశారు. చాలా బాధగా ఉంది. జగన్ చేయాల్సిన యాత్ర ఇది. ఇంకోబిడ్డ రోడ్డుమీదికి రావాల్సి వచ్చింది’ అని గద్గద స్వరంతో వైఎస్ విజయమ్మ అనగానే సభా ప్రాంగణం మూగబోయింది. మీరంతా మా పక్షం ఉన్నారనే ధైర్యంతో నా బిడ్డను మీకప్పగిస్తున్నా. జగన్‌బాబు లాగే నా బిడ్డను మీరు ఆశీర్వదించాలని కోరడం విజయమ్మ తల్లి మనస్సుకు అద్దం పట్టింది అని అన్నారు.

అనంతరం షర్మిల మాట్లాడారు. ‘జగనన్న వదిలిన బాణాన్ని నేను’ అంటూ పాలక, ప్రతిపక్ష నేతలకు కలవరం పుట్టించారు. గురువారం వైఎస్ తనయ షర్మిల చేపట్టిన పాదయాత్రకు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. ఇడుపులపాయ నుంచి ట్రిపుల్ ఐటీ, మారుతినగర్, వీరన్నగట్టుపల్లె, కుమ్మరాంపల్లె వరకు విజయమ్మ పాదయాత్రలో ముందుకు సాగారు. ముందుగా షర్మిల ట్రిపుల్ ఐటీ విద్యార్థుల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ అపూర్వ స్వాగతం లభించింది. డప్పు వాయిద్యాలు, బాణ సంచా నడుమ వారికి పూల వర్షం కురిపించారు. వేంపల్లె బైపాస్, నాలుగు రోడ్ల కూడలి మీదుగా పాదయాత్ర కొనసాగింది. పాదయాత్ర మధ్యాహ్న భోజన విరామ సమయానికి కుమ్మరాంపల్లెకు చేరుకుంది. అక్కడ నుంచి పాదయాత్ర ప్రారంభించగానే.. కుమ్మరాంపల్లె, వేంపల్లె వద్ద వరుణదేవుడు చిరుజల్లులు కురిపించి షర్మిల పాదయాత్రను ఆశీర్వదించారు.

షర్మిలతోపాటు పాదయాత్రలో పాల్గొన్న వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డికి ఇడుపులపాయలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు హారతులు పట్టారు. ఆమెతో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. ఆమె కూడా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. వీరన్నగట్టుపల్లె వరకు ఆమె పాదయాత్రలో పాల్గొని వెళ్లిపోయారు. ఇ.సి.గంగిరెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ పాదయాత్రలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు షర్మిలతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు.

ఇడుపులపాయలో మిట్టమధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన మరో ప్రజా ప్రస్థానం ఆర్‌కే వ్యాలీ, వీరన్నగట్టుపల్లె, కుమ్మరాంపల్లె, రాజారెడ్డినగర్, చింతలమడుగుపల్లె మీదుగా వేంపల్లె నాలుగు రోడ్ల కూడలి నుంచి రాజీవ్ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన గూడారాల దగ్గరికి చేరడంతో తొలిరోజు యాత్ర ముగిసింది. తొలి రోజున సుమారు 15 కిలోమీటర్ల యాత్ర షెడ్యూల్ మేరకు కొనసాగింది.
Share this article :

0 comments: