16 నుంచి 26 దాకా దేశమంతా పర్యటిస్తా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 16 నుంచి 26 దాకా దేశమంతా పర్యటిస్తా

16 నుంచి 26 దాకా దేశమంతా పర్యటిస్తా

Written By news on Saturday, November 9, 2013 | 11/09/2013

దేశవ్యాప్తంగా సమైక్య యాత్ర: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
*16 నుంచి 26 దాకా దేశమంతా పర్యటిస్తా: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ముఖ్య రాష్ట్రాలకు వెళ్లి పార్టీల మద్దతు కోరతాం
వాటినీ విభజించే ప్రమాదముందని చెబుతాం
 వైఖరి మార్చుకోవాలని బీజేపీ తదితరాలను కోరతాం
సహకరించాలని లెఫ్ట్ పార్టీలకు విజ్ఞప్తి చేస్తాం
జీవోఎం భేటీకి మా పార్టీ నుంచి మైసూరా వెళ్తారు
నాలుగు తిట్లు తిట్టి, వాళ్లకు గట్టిగా గడ్డి పెట్టి వస్తారు
సమైక్య తీర్మానం చేసిన 9,368 పంచాయతీలకు సలామ్
26 నుంచి జగన్ ‘సమైక్యాంధ్రప్రదేశ్’ యాత్ర
తెలంగాణతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటన
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి దేశవ్యాప్తంగా పర్యటించి అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరతానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. నవంబర్ 16 నుంచి 26 వరకు ఆయా రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ పర్యటించనున్నట్టు తెలిపారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలు మైసూరారెడ్డి, జూపూడి ప్రభాకరరావు, దాడి వీరభద్రరావు, గట్టు రామచంద్రరావులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విషయంలో అన్ని పార్టీల మద్దతు కూడగట్టేందుకు తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఒడిశా వంటి ప్రతి ముఖ్యమైన రాష్ట్రానికీ వెళ్లి.. అక్కడి రాజకీయ పక్షాలన్నింటినీ కలుస్తామని చెప్పారు.
 
  బీజేపీ వంటి ప్రతి ముఖ్య పార్టీనీ కలిసి రాష్ట్ర విభజనపై వారి వైఖరిని మార్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తామని వెల్లడించారు. అలాగే కమ్యూనిస్టుల వంటి ముఖ్యమైన పార్టీలను కూడా తమకు సహకరించాల్సిందిగా కోరతామన్నారు. దేశంలో ఎక్కడా కనీవినీ ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్నవాళ్లు, ఆ తర్వాతి ఎన్నికల్లో ఏదైనా రాష్ట్రం తమకు రాదని భావిస్తే, దాన్ని విడదీసే కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడుతున్నారని దుయ్యబట్టారు. ‘‘ఇలాంటి అడ్డగోలు ప్రక్రియ మన రాష్ట్రంతోనే ప్రారంభమైంది. ఇదిక్కడితోనే ఆగదు.
  

ఢిల్లీలో అధికారం చేపట్టినవారు తర్వాత ఏ రాష్ట్రంలోనైతే వారికి సీట్లు రావని, బలహీనంగా ఉన్నామని భావిస్తారో అక్కడల్లా ఇలాంటి అడ్డగోలు కార్యక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఊరుకుంటే.. రేపటి రోజున కేంద్రంలో అధికారంలో ఉన్నవారు తమ ప్రయోజనాల కోసం ఇలాంటి విధానాన్నే ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేసే ప్రమాదం ఉందన్న విషయాన్ని అన్ని రాష్ట్రాల నేతలకు వివరిస్తా. ఇవాళ మీరు వ్యతిరేకించకపోతే మీ వరకు వచ్చేసరికి ఎవరూ కనపడరని నచ్చజెబుతా’’ అని వివరించారు. అదేవిధంగా నవంబర్ 26 నుంచి సమైక్యాంధ్రప్రదేశ్ నినాదంతో రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టనున్నట్టు తెలిపారు. ఏయే ప్రాంతాల్లో పర్యటిస్తానన్న వివరాలను పార్టీ నేతలు తర్వాత వెల్లడిస్తారని పేర్కొన్నారు. తెలంగాణలోనూ పర్యటన కొనసాగుతుందా అని విలేకరులు ప్రశ్నించగా కచ్చితంగా ఉంటుందని బదులిచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సమైక్యాన్ని చాటుతూనే ఓదార్పు కుటుంబాలను పరామర్శిస్తూ పర్యటన సాగుతుందని వెల్లడించారు.
 
 జీవోఎం భేటీకి ఆహ్వానం అందింది
 వివిధ రాజకీయ పార్టీలతో జీవోఎం తలపెట్టిన సమావేశానికి వైఎస్సార్‌సీపీని ఆహ్వానిస్తూ పంపిన లేఖ శుక్రవారం తమకు అందిందని జగన్ తెలిపారు. తాము కచ్చితంగా ఆ భేటీకి వెళతామని, పార్టీ ప్రతినిధిగా మైసూరారెడ్డిని పంపుతున్నామని పేర్కొన్నారు. ‘‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న పార్టీ వాదననే ఆ సమావేశంలో గట్టిగా చెప్పమని మైసూరా అన్నకు చెబుతా. అంతేకాదు నాలుగు తిట్లు తిట్టి.. వారికి బుద్ధి వచ్చేలా కాస్త గడ్డి పెట్టి రమ్మని కూడా చెప్పి పంపుతా’’ అని వెల్లడించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ గ్రామసభల్లో తీర్మానం చేసి కేంద్ర హోం శాఖకు పంపిన 9,368 గ్రామ పంచాయతీల సభ్యులకు జగన్  కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సమైక్యానికి మద్దతుగా 48 గంటల పాటు నిర్వహించిన రహదారుల దిగ్బంధన కార్యక్రమాన్ని పోలీసుల జులం మధ్య కూడా విజయవంతం చేసినవారికీ, సహకరించిన ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.
 
 నిమిషాల్లోనే విభజన నిర్ణయాలా?: విభజన ప్రక్రియకు సంబంధించి నివేదికల పేరుతో ఢిల్లీ నుంచి రోజుకోలా లీకులు వెలువడుతుండటంపై జగన్ తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారి తీరు బాధ్యతారాహిత్యంతో.. ‘మాకు ఓట్లూ, సీట్లూ కావాలి, వాటి కోసం ఏదైనా చేస్తాం, ఆ తర్వాత మీ చావు మీరు చావండి’ అన్నట్టుగా ఉందని దుయ్యబట్టారు. విభజన ప్రక్రియకు సంబంధించిన కీలక నిర్ణయాలకు కూడా నిమిషాల్లో పరిష్కారం చూపిస్తోంటే ఆశ్చర్యమేస్తోందన్నారు. జల వనరులకు సం బంధించి జైరాం రమేశ్ ఇచ్చిన నివేదికను ఈ సందర్భంగా జగన్ ప్రస్తావించారు. ‘‘సాగునీటికి సంబంధించి జైరాం రమేశ్ ఇచ్చిన నివేదికను పేపర్లో చదివా. జల వనరుల మంత్రి అధ్యక్షతన ఒక మండలి పెడతారట. వాటిలో రెండు రాష్ట్రాలకు చెందిన సీఎంలు, సెక్రటరీలు ఉంటారట. ఆ మం డలి కింద బోర్డులు వేస్తారట. ఈ సందర్భంగా వారిని ఒకటి అడగదలుచుకున్నా. దేశంలో 28 రాష్ట్రాల్లో ఏ ఒక్కరికీ లేనిది మా రాష్ట్రంలోనే ఇలా ఎందుకు తీసుకొస్తున్నారు? ఇప్పటికే కృష్ణా నదీజలాల వినియోగంలో ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక తమ ప్రాజెక్టుల అవసరాలు తీరాకే కిం దకు వదులుతున్నాయి.
 
  రాష్ట్రం ఐక్యంగా ఉన్నప్పుడే నీరు వదలడం లేదు. మీరు చెబుతున్న మండలిని ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకల్లో పెట్టి నీళ్లెం దుకు ఇవ్వడం లేదు?’’ అని ప్రశ్నించారు. మన రాష్ట్రంలోనే మండలి ఏర్పాటు చేసి దాని కింద బోర్డులంటే ఇకపై మిగులు జలాలు వాడుకునే పరిస్థితి ఉండదని, వాటిపై కట్టిన ప్రాజెక్టులన్నీ శూన్యమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘పై రాష్ట్రాలు మాత్రం మిగులు జలాలతో ప్రాజెక్టులు పూర్తి చేసుకుం టాయి. మన రాష్ట్రంలో మాత్రం ఈ మండలి ఉంటుంది కాబట్టి దీని ఆధ్వర్యంలోనే అన్నీ జరగాలనే షరతుతో ప్రాజెక్టు నిలిపేస్తారు. దీంతో రాష్ట్రం ఎడారి అవుతున్నా చూస్తూ ఊరుకోవాల్సిందే తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఉత్పన్నం కానుంది. నిజంగా వీళ్లు ఇస్తున్న తీర్పును చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది’’ అని ఆవేదన వ్యక్తంచేశారు.
 
 బాబూ.. విభజన లేఖను వెనక్కి తీసుకో!
 రాష్ట్రం విడిపోతే అన్ని రకాలుగా నష్టపోయే ప్రమాదమున్నందున టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి, విభజనకు అనుకూలంగా గతంలో ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని జగన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ కేంద్రానికి లేఖ రాయాలని సూచించారు. ఈ విషయంలో చరిత్రహీనుడిగా మిగిలిపోవద్దని హితవు పలికారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ ఏకం కావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రం నష్టపోయే పరిస్థితి ఉన్న ఈ సమయంలో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేయవద్దని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ‘‘అందరం ఏకమైతేనే విభజనను ఆపగలుగుతాం.
 
 రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్కరినీ వేడుకుంటున్నా. అంతా ఒక్కటవాల్సిన సమయం ఆసన్నమైంది. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అందరం బాగుపడతాం. దేశంలో హిందీ తర్వాత రెండో అతి పెద్ద జాతిగా ఉన్న తెలుగువారం విచ్ఛిన్నమైతే ఎవరూ పట్టించుకునే పరిస్థితి ఉండదు. రూ.1.75 లక్షల కోట్ల బడ్జెట్‌తో దేశంలో మూడో అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఉన్న రాష్ట్రాన్ని విడగొడితే భవిష్యత్తు అంధకారమవుతుంది’’ అని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల్లో పర్యటనకు కోర్టు నుంచి అనుమతి రాలేదు కదా అని విలేకరులు ప్రస్తావించగా.. కాంగ్రెస్, సీబీఐ ఒక్కటై అడ్డుకోవచ్చు గానీ న్యాయస్థానాలు వాళ్ల చేతుల్లో లేవని విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు. న్యాయస్థానాల పట్ల తనకు నమ్మకముందని, వారు అనుమతి ఇస్తారనే భావిస్తున్నట్టు చెప్పారు.
Share this article :

0 comments: