చంద్రబాబు తీరు హాస్యాస్పదం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు తీరు హాస్యాస్పదం

చంద్రబాబు తీరు హాస్యాస్పదం

Written By news on Sunday, September 14, 2014 | 9/14/2014

చంద్రబాబు తీరు హాస్యాస్పదం
ఒంగోలు అర్బన్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవహారశైలి హాస్యాస్పదంగా ఉందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ విమర్శించారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో నవ్యాంధ్రప్రదేశ్‌లోని ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతుంటే కనీసం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా చంద్రబాబు అమలుచేయకుండా విజన్-2029 పేరుతో పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని విమర్శిస్తూ కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు.

చివరకు శుక్రవారం తిరుపతిలో జరిగిన 14వ ఆర్థిక సంఘ సమావేశంలోనూ నవ్యాంధ్రకు కావాల్సిన నిధుల గురించి మాట్లాడకుండా అర్థంపర్థంలేని విజన్-2029 గురించే ప్రసంగించారని ధ్వజమెత్తారు. రాబోయే ఐదేళ్లకు సంబంధించిన ఆర్థిక సంఘం ఎదుట ఐదేళ్లపాటు పదవిలో ఉండే సీఎం.. ప్రస్తుత పరిస్థితులు, ఈ ఐదేళ్ల పాలన గురించి పట్టించుకోకుండా 15 ఏళ్లలో జరగబోయే దాని గురించి మాట్లాడటం అవసరమా అని సురేష్ ప్రశ్నించారు. గతంలో తొమ్మిదేళ్లు సీఎంగా, పదేళ్లు ప్రతిపక్షనేతగా అనుభవం ఉన్న చంద్రబాబుకు రాజ్యాంగబద్ధమైన ఆర్థిక సంఘం ముందు ఎలా మాట్లాడాలో తెలియకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌తో పాటు వైఎస్‌ఆర్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అదే ఆర్థిక సంఘ సమావేశంలో పాల్గొన్న వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు డీఏ సోమయాజులు, ఎంపీ మిథున్‌రెడ్డి నవ్యాంధ్రకు నిధుల కోసం చక్కగా మాట్లాడారని సురేష్ పేర్కొన్నారు. నవ్యాంధ్రకు నిధుల కోసం వైఎస్‌ఆర్ సీపీ చిత్తశుద్ధితో కృషి చేస్తోందని తెలిపారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు, టీడీపీ ప్రజాప్రతినిధులు నిజాయితీగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు.
Share this article :

0 comments: