29 గ్రామాల్లోని 34 వేల ఎకరాల్లో ఇవే చివరి పంటలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 29 గ్రామాల్లోని 34 వేల ఎకరాల్లో ఇవే చివరి పంటలు

29 గ్రామాల్లోని 34 వేల ఎకరాల్లో ఇవే చివరి పంటలు

Written By news on Thursday, January 29, 2015 | 1/29/2015


పంటలపై పిడుగు!
రాజధాని ప్రాంత రైతులు ఇక సాగుకు దూరం
29 గ్రామాల్లోని 34 వేల ఎకరాల్లో ఇవే చివరి పంటలు
ప్రస్తుత రబీ సీజన్ వరకే పంటల సాగును అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం
ఏడాదిలో మూడు పంటలు పండించే రైతన్నలకు శరాఘాతం
ఎకరాకు సగటున రూ. లక్ష వరకు ఆర్జిస్తున్న అన్నదాతలు
భూ సమీకరణ కొలిక్కి రాకుండానే సర్కారు తీసుకున్న నిర్ణయంపై విస్మయం


సాక్షి, హైదరాబాద్: ఆరుగాలం శ్రమిస్తూ, కంటికి రెప్పలా పంటల్ని కాపాడుకుంటూ.. సాగులో సిరులు కురిపిస్తున్న కృష్ణానది పరీవాహక రాజధాని ప్రాంత రైతుల పాలిట పిడుగుపాటు లాంటి వార్త ఇది. ఏడాదికి మూడు పంటలు పండే ఆయా గ్రామాల్లో తదుపరి సీజన్ నుంచి సాగును అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. తరతరాల నుంచి సంప్రదాయంగా వస్తున్న పంటల సాగును రైతులకు దూరం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వేలాది మంది రైతుల భవితను ప్రశ్నార్థకంగా మారుస్తోంది.

రాజధాని ప్రాంతంలో పంటల సాగుకు ఈ సీజన్ (రబీ) వరకే అనుమతి ఉందని సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ బుధవారం ప్రకటించడంతో మూడు మండలాల పరిధిలోని 29 గ్రామాల రైతుల్లో ఒక్కసారిగా అలజడి, ఆందోళన మొదలైంది. రాజధాని కోసం ఎంపిక చేసిన గ్రామాల్లో భూ సమీకరణ సంక్లిష్టంగా మారిన పరిస్థితుల్లో.. ఆ ప్రక్రియ ఇంకా ఓ కొలిక్కి రాకముందే.. ఆ మొత్తం ప్రాంతంలో వచ్చే సీజన్ నుంచి ప్రభుత్వం పంటల సాగును నిషేధించడం రైతులకు విస్మయం కలిగిస్తోంది.

సాగుకు దూరంగా ఉండాలనే ఊహతోనే రైతన్నలు కుమిలిపోతున్నారు. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి ఇక దయనీయంగా మారనుంది. ఎన్నో ఏళ్లుగా సాగునే నమ్ముకుని స్వాభిమానంతో జీవనం కొనసాగిస్తున్న అన్నదాతలకు భూ సమీకరణ శరాఘాతంలా తగిలింది.

రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు జిల్లాకు చెందిన మూడు మండలాల పరిధిలో 29 గ్రామాలను రాజధాని ప్రాంతంగా గుర్తించింది. ఈ గ్రామాల్లో పట్టా, అసైన్డ్, దేవాదాయ, అటవీ, పోరంబోకు భూములన్నీ కలిపి 51,788 ఎకరాలున్నట్టుగా అప్పట్లో నివేదికలు సిద్ధం చేసింది. ఈ 29 గ్రామాల పరిధిలో రైతులు సాగు చేస్తున్న భూములు మొత్తం 41,750 ఎకరాలు. అయితే రాజధాని నిర్మాణం కోసం ఈ గ్రామాల్లో 34 వేల ఎకరాల భూమిని సమీకరించేందుకు నిర్ణయించి ఈ నెల 2 నుంచి విడతల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసింది.

ఒక్కసారి నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత పంటలు వేసుకునేందుకు అవకాశమే లేదని తాజాగా తేల్చి చెప్పడంతో బ్యాంకు రుణాలు దక్కే పరిస్థితి లేకుండా పోయింది. ఆ ప్రాంత రైతులకు రుణాలు మంజూరు చేయరాదని బ్యాంకర్లకు ఇప్పటికే ప్రభుత్వం మౌఖికంగా తెలియజేసింది. ఇలావుండగా ప్రభుత్వం భూ సమీకరణకు ప్రతిపాదించిన 29 గ్రామాలన్నింటిలో రైతులు ఏడాది పొడవునా మూడు పంటలు పండిస్తున్నారు. అరటి, పసుపు, కంద, మొక్కజొన్న, అన్ని రకాల పూలతోటలు, అన్ని రకాల కూరగాయలు, ఉల్లి, మునగ పంటలు సాగు చేస్తున్నారు.

మార్కెట్ సౌకర్యం కూడా రైతులకు అందుబాటులో ఉండటంతో నికర లాభాలను ఆర్జిస్తున్నారు. కృష్ణా పరివాహక జరీబు భూముల్లో అంతర పంటలు (అరటిలో కంద, పసుపు, పూలతోటలు) సాగు చేసి ఒకేసారి రెండు పంటల ఫలసాయాన్ని కూడా రైతన్నలు పొందుతున్నారు. మెట్ట పైర్లు అరటి, పసుపు, కంద సాగుతో రూ.90 వేలు నుంచి రూ.లక్ష వరకు ఆదాయం ఆర్జిస్తున్నారు. ఈ ప్రాంతంలో కౌలు రేట్లే ఏడాదికి ఎకరాకు రూ.50 వేల వరకు ఉన్నాయంటే పంటల సాగు ఏ విధంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. కౌలు రైతులు భూముల్ని సాగు చేసి ఎకరాకు పెట్టుబడి ఖర్చులన్నీ పోనూ రూ.70 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారమే ఇక్కడున్న 12 వేల మంది కౌలు రైతులు జరీబు భూముల్ని సాగు చేసి నికర ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.

పరిహారం ఊసెత్తని ప్రభుత్వం
రాజధానికి భూములిచ్చే రైతులకు పరిహారంగా ఎకరాకు మెట్ట భూములకైతే రూ.30 వేలు, జరీబు భూములకు రూ.50 వేలు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అదీ పదేళ్ళ పాటు మాత్రమే. మధ్యలో అభివృద్ధి చేసిన భూమి అమ్ముకుంటే ప్రకటించిన పరిహారం ఇవ్వరు. ఇక పరిహారం ఎప్పుడిస్తారన్న దానిపై స్పష్టత లేదు. తాజాగా పంటల సాగుకు అనుమతి లేదని చెప్పారే కానీ పరిహారం విషయం ప్రస్తావించలేదు. అయినా ఏడాది పొడవునా సాగు చేస్తే తమకు వచ్చే ఆదాయంలో ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఏ పాటి? అని రైతులు ప్రశ్నిస్తున్నారు.
Share this article :

0 comments: