నాలుగోరోజు 5 కుటుంబాలకు పరామర్శ.. అడుగడుగునా నీరాజనం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నాలుగోరోజు 5 కుటుంబాలకు పరామర్శ.. అడుగడుగునా నీరాజనం

నాలుగోరోజు 5 కుటుంబాలకు పరామర్శ.. అడుగడుగునా నీరాజనం

Written By news on Sunday, January 25, 2015 | 1/25/2015


కోట్లాది గుండెల్లో వైఎస్సార్..
* నల్లగొండ జిల్లా ‘పరామర్శయాత్ర’లో షర్మిల
* ఒక నాయకుడి కోసం వందల గుండెలు ఆగిన చరిత్ర లేదు
* ఆయనకు ముందు ఏ సీఎం పేదవాడి గురించి ఆలోచించలేదు
* ఏ ముఖ్యమంత్రీ విద్యార్థుల గురించి పట్టించుకోలేదు
* వైఎస్సార్ పేదవాడిని భుజాన మోశారు.. రైతును రాజును చేశారు
* ఆశయాల కోసం చేయికలుపుదామని వైఎస్ జగన్ సోదరి పిలుపు
* నాలుగోరోజు 5 కుటుంబాలకు పరామర్శ.. అడుగడుగునా నీరాజనం


సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ప్రజాస్వామ్యంలో ఓ నాయకుడి గురించి వందలాది గుండెలు ఆగి పోయిన చరిత్ర ఎప్పుడూ లేదని... అది ఒక్క వైఎస్సార్ విషయంలోనే జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. వైఎస్ పేద ప్రజల కోసమే బతికారని, పేదలకు మేలు చేయడం కోసమే ఆయన పోరాడారని చెప్పారు. పేదవాడిని తన భుజాన మోసి, రైతును రాజును చేశా డు కాబట్టే కోట్లాది మంది గుండెల్లో రాజన్నగా కొలువుదీరారని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల నాలుగో రోజు శనివారం హుజూర్‌నగర్ నియోజక వర్గంలో పర్యటించారు.
 
 ఈ సందర్భంగా నేరేడుచర్ల, గరిడేపల్లి, హుజూర్‌నగర్‌తో పాటు మేళ్లచెరువులో తనను చూసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ‘‘వైఎస్ కంటే ముందు ఏ ముఖ్యమంత్రి కూడా పేద విద్యార్థుల గురించి ఆలోచించలేదు.. పేదవాడి ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు. వైఎస్ మాత్రమే రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చి, రైతును దేశానికి వెన్నెముకగా చేయాలనుకున్నారు. తెలుగు ప్రజలందరినీ సొంత బిడ్డలుగా ప్రేమించారు. ఏ అవసరమున్నా మీకు తోడుగా ఉంటానంటూ ప్రజల పక్షాన నిలబడ్డారు. కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా.. తన పార్టీనా, వేరే పార్టీనా అనేది చూడకుండా ప్రజాశ్రేయస్సే పరమావధిగా పనిచేశారు. అందుకే వైఎస్‌కు మరణం లేదు. తెలుగు జాతి బతికున్నంత వరకు వైఎస్సార్ ప్రజల గుండెల్లో నిలిచిపోతారు’’ అని షర్మిల పేర్కొన్నారు.
 
 కోట్లాది మందికి మేలు చేశారు..: దేశంలో, రాష్ట్రంలో ఎందరో ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు పనిచేసినా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఒక్కడికే కోట్లాది మంది ప్రజలు తమ గుండెల్లో చోటిచ్చారని షర్మిల పేర్కొన్నారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల మేలు కోసమే ఆయన పాటుపడ్డారన్నారు. రైతులు, రైతు కూలీలకు అండగా నిలబడ్డ వైఎస్ వారి కోసం ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీ, మద్దతు ధర ఇచ్చారని చెప్పారు.
 
వైఎస్ ప్రవేశపెట్టిన పథకాల వల్ల లక్షలాది మంది విద్యార్థులు పెద్ద చదువులు చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నారని, లక్షలాది మంది పేదలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్నారని షర్మిల తెలిపారు. ఇన్ని చేసినా ఏ ఒక్క రోజు ఏ ఒక్క చార్జీ, ఏ ఒక్క పన్ను పెంచలేదని... పన్నులు, చార్జీలు పెంచకుండానే అన్ని పథకాలను అద్భుతంగా అమలుచేసిన రికార్డు ముఖ్యమంత్రిగా వైఎస్ నిలిచిపోయారని షర్మిల తెలిపారు. అలాంటి వైఎస్సార్ ఆశయాలను మనమే ముందుకు తీసుకెళ్లాలని... అందుకే రాజన్న రాజ్యం కోసం అందరం చేయి చేయి కలపాలని షర్మిల కోరారు.
 
మేళ్లచెర్వు జన సంద్రం..: పరామర్శయాత్రలో భాగంగా షర్మిల మేళ్లచెర్వు మండల కేంద్రానికి చేరుకునే సరికి సాయంత్రం ఆరున్నర గంటలైంది. ఆ ఊరి బయట పెట్రోల్‌బంక్ వద్ద నుంచే ప్రజలు షర్మిలను చూడడానికి బారులు తీరారు. అక్కడి నుంచి రేవూరు రోడ్డు వరకు దారి పొడవునా భారీ సంఖ్యలో మహిళలు, యువకులు, అన్నివర్గాల ప్రజలు ఎదురేగి షర్మిలకు స్వాగతం పలికారు. ఈ సమయంలో ఎక్కడచూసినా జనమే కనిపిం చారు. ఇక గరిడేపల్లి మండలంలోని కీతవారిగూడెం బస్టాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన దివంగత సీఎం వైఎస్‌ఆర్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు.
 
  ఇన్నేళ్లయినా వైఎస్‌ను గుర్తుపెట్టుకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఆ గ్రామ ప్రజలకు షర్మిల కృతజ్ఞతలు తెలిపారు. యాత్రలో షర్మిల వెంట వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు ఎడ్మ కిష్టారెడ్డి, కొండా రాఘవరెడ్డి, శివకుమార్, నల్లా సూర్యప్రకాశరావు, గున్నం నాగిరెడ్డి, భీష్వ రవీందర్, పి.సిద్ధార్థరెడ్డి, ఆకుల మూర్తి, మెండెం జయరాజ్, జార్జ్‌హెర్బర్ట్, ముస్తఫా అహ్మద్, వడ్లోజు వెంకటేశం, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, షర్మిలా సంపత్, ఇరుగు సునీల్‌కుమార్, మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మామిడి శ్యాం సుందర్‌రెడ్డి, వరంగల్ అధ్యక్షుడు జిన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, ఎన్.భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
 
ప్రపంచానికి మీరే వెలుగులు..
హుజూర్‌నగర్ నియోజకవర్గంలో పరామర్శయాత్ర ప్రారంభించడానికి ముందు నేరేడుచర్ల సమీపంలోని సిటీ సెంట్రల్ స్కూల్ విద్యార్థులతో షర్మిల కొంతసేపు ముచ్చటించారు. ఆ పాఠశాలకు వెళ్లిన షర్మిలను చూడగానే పిల్లలు కేరింతలు కొట్టారు. వారందరితో కరచాలనం చేసిన షర్మిల కాసేపు మాట్లాడారు. వారిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులే సమాజంలో మార్పు తీసుకురాగలరని.. ఈ ప్రపంచానికి మీరే వెలుగు దివ్వెలని చెప్పారు. సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో వారి బాధ్యత చాలా ఉందన్నారు.
 
 రానున్నవి మంచి రోజులు..: పొంగులేటి
 రానున్నవి మంచిరోజులేనని.. వైఎస్సార్ కలలుగన్న సమాజాన్ని నిర్మించుకునేందుకు అందరం చేయి కలిపి పనిచేయాలని వైఎస్సార్ సీపీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మేళ్లచెరువు, హుజూర్‌నగర్, నేరేడుచర్లలలో ప్రసంగించారు. తెలంగాణలో వైఎస్సార్‌సీపీ లేదనే రాజకీయ పార్టీలు ఒక్కసారి హుజూర్‌నగర్ నియోజకవర్గ ప్రజలు వైఎస్ కుటుంబంపై చూపుతున్న ప్రేమను చూడాలన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా వైఎస్సార్ సీపీ అధికారంలోనికి వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. వైఎస్‌లాంటి పాలన అందించాలని, మంచి ముఖ్యమంత్రులుగా పేరు తెచ్చుకోవాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు.
 
ఐదు కుటుంబాలకు పరామర్శ..
 పరామర్శయాత్రలో భాగంగా షర్మిల నాలుగోరోజు ఐదు కుటుంబాలను పరామర్శించారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన వారి ఇళ్లకు వెళ్లి.. వారి కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ఒక్కొక్కరినీ పేరుపేరునా పలకరించి, వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ముందుగా నేరేడుచర్ల మండలంలోని దిర్శించర్లలో తురక లింగయ్య కుటుంబాన్ని షర్మిల కలుసుకున్నారు. తర్వాత గరిడేపల్లి మండలం కాల్వపల్లిలో వెంకటగిరి జయమ్మ, హుజూర్‌నగర్ పట్టణంలోని సుందరయ్యనగర్‌లో లింగం పాండు కుటుంబాలను ఆమె పరామర్శించారు. భోజన విరామం తర్వాత మేళ్లచెర్వు మండల కేంద్రంలోని చల్లా పూర్ణయ్య కుటుంబం వద్దకు వెళ్లారు. ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడి, అదే మండలంలోని కందిబండలో పేరుపంగు లింగయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు.
Share this article :

0 comments: