చింతమనేనిని అరెస్టు చేయాలి: అంబటి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చింతమనేనిని అరెస్టు చేయాలి: అంబటి

చింతమనేనిని అరెస్టు చేయాలి: అంబటి

Written By news on Friday, July 10, 2015 | 7/10/2015


చింతమనేనిని అరెస్టు చేయాలి: అంబటి
వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు డిమాండ్
* తాము తప్పుచేసి ఎదుటి వారిపై కేసులు పెట్టడం టీడీపీకి ఆనవాయితీ


సాక్షి, హైదరాబాద్: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసిన దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను తక్షణం అరెస్టు చేయాలని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోలీసుల సమక్షంలోనే ఆమెపై దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు.

వనజాక్షిపై దాడి చేసింది చాలక, ఓ ఇద్దరు మహిళలతో మళ్లీ ఆమెపై తప్పుడు ఫిర్యాదులు ఇప్పించి కేసులు పెట్టించారని దుయ్యబట్టారు. తాము తప్పు చేస్తూ దొరికిపోవడం, ఆ తరువాత ఎదుటి వారిపై కేసులు పెట్టడం టీడీపీకి ఆనవాయితీ అని... ఓటుకు కోట్లు వ్యవహారంలో ఇదే జరిగిందని ఎద్దేవా చేశారు. వనజాక్షి ఉదంతంలో జరుగుతున్న పరిణామాలను రాష్ట్రంలోని ఉద్యోగులంతా గమనించాలని, చంద్రబాబు నైజం ఏమిటో తెలుసుకోవాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఎమ్మెల్యేలు బరితెగించి పోయారని, యధేచ్ఛగా దోపిడీలకు పాల్పడుతున్నారని అభ్యంతరం తెలిపారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆళ్లగడ్డలో ఓ పోలీసు అధికారిని ‘డోంట్ టచ్‌మి...’ అన్నందుకే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై ఎస్సీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసును నమోదు చేసి అరెస్టు చేసిన ప్రభుత్వం చింతమనేని విషయంలో ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని  అంబటి ప్రశ్నించారు. వనజాక్షితోపాటు ఆమె సిబ్బందిపై జరిగిన దాడిని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.

పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా  రాజకీయాల్లో వాడుకుని వదిలేసే రకమైన చంద్రబాబు పవన్ కల్యాణ్ విషయంలో కూడా అలాగే వ్యవహరించారని అంబటి తెలిపారు. ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ వద్ద పడిగాపులుకాచి  తనకు మద్దతుగా ప్రచారానికి తెచ్చుకున్న బాబు ఇపుడు ఆయనను తన ఎంపీల చేత అనరాని మాటలు అనిపిస్తున్నారన్నారు.
Share this article :

0 comments: