కార్పొరేషన్‌పై జెండా ఎగరడం ఖాయం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కార్పొరేషన్‌పై జెండా ఎగరడం ఖాయం

కార్పొరేషన్‌పై జెండా ఎగరడం ఖాయం

Written By news on Sunday, July 5, 2015 | 7/05/2015


కార్పొరేషన్‌పై జెండా ఎగరడం ఖాయం
మురికివాడల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమం
నగర ముఖ్య కార్యకర్తల సమావేశంలో వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి

 సాక్షిప్రతినిధి, ఖమ్మం : ఖమ్మం కార్పొరేషన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తంచేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో నగర ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మందడపు వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నెలలో తాను నగరంలోని మురికివాడల్లో పర్యటించినప్పుడు పార్టీలకతీతంగా ప్రజల నుంచి వస్తున్న స్పందన మరువలేనిదన్నారు.

ముఖ్యంగా తమతమ ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరిస్తాననే నమ్మకాన్ని స్థానికుల నుంచి తాను గ్రహించానని, అందుకే నగరంలోని అన్ని మురికివాడల్లోనూ పాదయాత్ర నిర్వహించి, ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు సాగుతానని హామీ ఇచ్చారు. ప్రధానంగా నగరంలోని డ్రెయినేజీ అస్తవ్యస్తంగా ఉందని, కొన్ని ప్రాంతాల్లో అంతర్గత రహదారులు సక్రమంగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంపీ నాయకులకు వివరించారు. నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు.

రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కితే తమ సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకంతో నగర ప్రజలున్నారని, వారి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయకూడదని సూచించారు. ఖమ్మంనగర ప్రజలు తనపైన, పార్టీపైన చూపుతున్న మమకారాన్ని ఎప్పటికీ మరచిపోనని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి ఆశయం మేరకు ఖమ్మం నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు.

నగర అభివృద్ధికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రణాళికబద్ధంగా కార్యచరణ రూపొందించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు తోట రామారావు, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకులమూర్తి, పాలేరు నియోజకవర్గ ఇంచార్జి సాధురమేష్‌రెడ్డి, వైరా నియోజకవర్గ ఇంచార్జి బొర్రా రాజశేఖర్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఎండి.ముస్తఫా, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కీసర పద్మజారెడ్డి, డాక్టర్ విభాగం రాష్ట్ర కార్యదర్శి దోరేపల్లి శ్వేత, నాయకులు మలీదు జగన్, తుమ్మా అప్పిరెడ్డి, బీమనాదుల అశోక్‌రెడ్డి, వంటికొమ్ము శ్రీనివాసరెడ్డి, మందడపు రామకృష్ణారెడ్డి, సంపెట వెంకటేశ్వర్లు, పగడాల భాస్కర్‌నాయుడు, సుగ్గల కిరణ్, గుండపునేని ఉదయ్‌కుమార్, సుధీర్, దుంపల రవికుమార్, ఇస్లావత్ రాంబాబు, పొదిలి వెంకటేశ్వర్లు, శాంతయ్య, కె.వి.చారి, నారుమళ్ల వెంకన్న, దుర్గారెడ్డి, ఎవి నాగేశ్వరరావు, బాణాల లక్ష్మణ్, జాకబ్‌ప్రతాప్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: