సీబీఐకి విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐకి విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ

సీబీఐకి విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ

Written By news on Saturday, November 12, 2011 | 11/12/2011

ఈ విషయాన్ని మీ సమక్షంలోనే రుజువు చేస్తా 
‘డెలాయిట్’ సుదర్శన్‌తో ముఖాముఖికి అవకాశమివ్వండి
జగతి విలువ పెంపును, పాత తేదీతో నివేదికను నేనెప్పుడూ కోరలేదు.. 
నాకా అవసరమూ లేదు.. 
మీడియాలోని ప్రత్యర్థి వర్గం పన్నాగమిది
జగన్, జగతిలపై అవి విషం కక్కుతున్నాయి
నా ప్రతిష్టను దిగజార్చేలా రాస్తున్నాయి.. 
రాజ్యాంగేతర శక్తులుగా విచారణ చేస్తున్నాయి
‘డెలాయిట్’ సుదర్శన్ ఇచ్చారంటున్న వాంగ్మూలం ప్రతిని నాకివ్వండి
రూ.1,800 కోట్ల నష్టాల్లో ఉన్న ఉషోదయా విలువను రూ.7,000 కోట్లుగా ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ అంచనా కట్టలేదా?
దాని ఆధారంగా రూ.100 షేరును రూ.5.28 లక్షల చొప్పున రామోజీ అమ్ముకోలేదా?
తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే లేఖను మీడియాకు విడుదల చేస్తున్నాను 

హైదరాబాద్, న్యూస్‌లైన్:జగతి పబ్లికేషన్స్ విలువ పెంచాలని గానీ, మదింపు నివేదికను పాత తేదీతో ఇవ్వాలని గానీ డెలాయిట్ సీనియర్ డెరైక్టర్ సుదర్శన్‌ను, వారి సంస్థకు చెందిన ఇతరులను ఎవరినీ తానెప్పుడూ ఒత్తిడి చేయలేదని ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి కుండబద్దలు కొట్టారు. కనీసం అలా కోరను కూడా లేదన్నారు. ‘‘నాకు ఆ అవసరమే లేదు. పైగా డెలయిట్ నేపథ్యం, స్థాయి దృష్ట్యా అది సాధ్యం కూడా కాదు’’ అన్నారు. తన ప్రొఫెషనల్ కెరీర్లో ఎప్పుడూ సందేహాస్పద రీతిలో ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. ‘‘నివేదికను పాత తేదీతో ఇవ్వాల్సిందిగా నేను ఒత్తిడి తెచ్చానన్న సుదర్శన్ వాదన పూర్తిగా అవాస్తవం. ఆ నివేదికను ఇవ్వడానికి ముందే, అంటే 2007 ఆగస్టు నుంచే మా కంపెనీలోకి పెట్టుబడుల రాక మొదలవడమే ఇందుకు నిదర్శనం’’ అని వివరించారు. సుదర్శన్ ఇచ్చారంటున్న వాంగ్మూలం, మరీ ముఖ్యంగా ఆ మేరకు ఒక వర్గం మీడియాకు అందుతున్న లీకులు తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు. ‘‘దీనిపై నా వాదనలను విచారణలో వాద ప్రతివాదాల సందర్భంగా మాత్రమే బయట పెడతాను. అయితే చట్టానికి కట్టుబడి ఉండే పౌరునిగా సీబీఐ దర్యాప్తుకు నేను పూర్తిగా సహకరిస్తూ వస్తున్నాను. పై ఆరోపణల్లోని అసత్యాన్ని సుదర్శన్ సమక్షంలోనే రుజువు చేస్తాను. మీ దర్యాప్తులో భాగంగా, మీ కార్యాలయంలోనే అందుకు నాకు అవకాశం కల్పించండి’’ అని సీబీఐని కోరారు. ఈ మేరకు సీబీఐ విచారణాధికారికి శుక్రవారం విజయసాయిరెడ్డి లేఖ రాశారు. సుదర్శన్ ఇచ్చారంటున్న వాంగ్మూలం ప్రతులను తనకు అందజేయాలని అందులో విజ్ఞప్తి చేశారు. దాంతోపాటు ఇలాంటి లీకు వార్తల నుంచి తనకు రక్షణ కావాలన్నారు. లేఖ సారాంశం ఆయన మాటల్లోనే...

ఉద్దేశపూర్వకంగానే లీకులు...

జగతి పబ్లికేషన్స్ విలువను రూ.2,500 కోట్ల నుంచి రూ.3,500 కోట్లకు పెంచేలా నేను ఒత్తిడి తెచ్చి బలవంతం చేశానని డెలాయిట్ టచ్ తొమట్సు ప్రైవేట్ లిమిటెడ్ (డెలాయిట్) సంస్థ డెరైక్టర్ సుదర్శన్ రైల్వే మేజిస్ట్రేట్ ముందు సీఆర్‌పీసీ 164 సెక్షన్ కింద వాంగ్మూలమిచ్చారంటూ ఒక వర్గం మీడియాలో వచ్చిన వార్తలు చూసి నేను విస్మయం చెందాను. పైగా నా ఒత్తిడి వల్లే ఆ నివేదికను ముందు తేదీతో ఇచ్చానని ఆయన చెప్పినట్టుగా వాటిలో వచ్చింది. జగతి పబ్లికేషన్స్‌కు సంబంధించిన కేసులో నేను రెండో నిందితుడినని మీకు తెలుసు. అయినా సుదర్శన్ ఇచ్చారంటున్న వాంగ్మూలాన్ని నాకు అందజేయలేదు. కానీ జగతి పబ్లికేషన్స్‌తో, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కార్పొరేట్, వ్యాపార స్పర్ధలున్న మీడియా సంస్థల యాజమాన్యంలో నడిచే వార్తా పత్రికల్లో మాత్రం సదరు వాంగ్మూలంలోని వివరాలపై వార్తలు వచ్చాయి! ఆ మీడియా సంస్థలు తమ స్వప్రయోజనాలను నెరవేర్చుకునే లక్ష్యంతో జగతి పబ్లికేషన్స్, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలపై విషం కక్కుతున్నాయి. సుదర్శన్ ఇచ్చారంటున్న వాంగ్మూలాన్ని మమ్మల్ని బాహాటంగా వ్యతిరేకించే మీడియా వర్గాలకు మాత్రమే కొన్ని స్వార్థ ప్రయోజన శక్తులు ఉద్దేశపూర్వకంగా లీక్ చేయడం నన్ను తీవ్రంగా షాక్‌కు గురి చేసింది. పైగా చెబుతున్న ఈ వాంగ్మూలం పూర్తిగా అవాస్తవం. సుదర్శన్ నిజంగానే దాన్ని ఇచ్చి ఉంటే, ఆయన కచ్చితంగా సదరు స్వార్థ ప్రయోజన శక్తుల ఒత్తిడికి లోబడే అలా చేసి ఉంటారు. ఎలాగోలా మా ఇమేజీని దెబ్బతీసి, మమ్మల్ని ఏదో ఒక కేసులో ఇరికించేందుకు ఏ ఒక్క అవకాశాన్నీ ఆ శక్తులు వదులుకోవడం లేదు. సుదర్శన్‌కు ఆపాదిస్తూ, ఆయన వాంగ్మూలంలోని వివరాలంటూ వచ్చిన వార్తలు ఒకవేళ నిజమే అయితే.. అవన్నీ నన్ను తప్పుగా చిత్రించే ప్రయత్నాలే.

విలువ తక్కువ కట్టారు

మా సంస్థకు విలువ కట్టే విషయంలో నేను సుదర్శన్‌పై ఆధిపత్యం చలాయించే పరిస్థితిలో అసలే లేను. ఎందుకంటే ఆయన ఒక ప్రొఫెషనల్. మేం ఆయనను సంప్రదించిన క్లయింట్లం. ఓ క్లయింటు తన ప్రొఫెషనల్‌పై ఒత్తిడి తెచ్చాడనడం సహజ ప్రవర్తనకు పూర్తి విరుద్ధం. మేం కేవలం వాస్తవాలు, గణాంకాలు, అంచనాలను మాత్రమే అందించాం. ఆయన తన వృత్తిగత జడ్జిమెంటును ఉపయోగించుకుంటూ సంస్థ విలువపై స్వీయ అభిప్రాయాన్ని అందించారు. నిజానికి ఆ సమయంలో జగతి పబ్లికేషన్స్ సంస్థాగత విలువ రూ.3,900 కోట్ల నుంచి రూ.4,000 కోట్ల దాకా ఉంటుందన్నది స్వయంగా ఒక ప్రొఫెషనల్‌ను అయిన నా నిశ్చితాభిప్రాయం. కాబట్టి సుదర్శన్ ఇచ్చిన రూ.3,050 కోట్ల విలువ నా స్వీయ మదింపు కంటే చాలా తక్కువ. పైగా డెలాయిట్ అంతర్జాతీయంగా నాలుగో స్థానంలో ఉన్న ప్రపంచ స్థాయి ఆడిటింగ్/కన్సల్టింగ్ సంస్థ. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో నమోదై, కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ నియంత్రణలో పని చేస్తుంది. అలాంటి సంస్థను నేను ఒత్తిడి చేయడం అలా ఉంచి, కనీసం ప్రభావితమైనా చేయగలుగుతానా?

ఉషోదయా మాటేమిటి?

ఈనాడు వార్తా పత్రికను ప్రచురించే వ్యాపారంలోనే ఉన్న రామోజీరావు యాజమాన్యంలోని ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మరో కార్పొరేట్ సంస్థ ఉదంతాన్ని మీ దృష్టికి తేదలచాను. దాని విలువను రూ.6,500-7,000 కోట్లుగా ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ మా సంస్థను సుదర్శన్ విలువ కట్టేందుకు కేవలం కొద్ది నెలల ముందే లెక్కగట్టింది. కానీ ఉషోదయాకు ఆ సమయానికి రూ.1,800 కోట్ల సంచిత నష్టాలున్నాయి! అయినా ఎర్నెస్ట్ అంచనా కట్టిన విలువ ఆధారంగా ఒక్కొక్కటీ రూ.100 విలువ చేసే ఉషోదయా షేరుకు రూ.5,28,630 ప్రీమియం చొప్పున ఒక కొనుగోలుదారు చెల్లించాడు. అతనికి సంస్థలో 26 శాతం ఈక్విటీని బదలాయించారు! ఏ సంస్థ అంచనా విలువ అయినా తన కార్యకలాపాల తీరుతెన్నులు, సాధ్యాసాధ్యాలపై మార్కెట్ శక్తులకు సూచికగా ఉపయోగపడుతుంది. అంతేతప్ప దాన్ని ఎవరో చేసిన వ్యక్తిగత ఒత్తిడి యుక్తి పరిణామంగా చూడరాదు. అలా కానిపక్షంలో ప్రతి కార్యకలాపంపైనా అనుమానపు నీలినీడలు కమ్ముకుని, వాటన్నింటినీ విచారణార్హాలుగా మార్చేస్తాయి!

విషప్రచారంతో లబ్ధి ఎవరికో అందరికీ తెలుసు

కానీ జగతి, జగన్‌లకు విరోధులైన కొన్ని మీడియా శక్తులు సుదర్శన్ ఉదంతం నుంచి అనుచిత ప్రయోజనం పొందుతున్నాయి. రాజ్యాంగేతర శక్తులుగా మారి, మేమిప్పటిదాకా కట్టుబడిన చట్ట, విచారణ ప్రక్రియలను కూడా గౌరవించకుండా మాపై తమంత తాముగా విచారణ జరిపేస్తున్నాయి. ప్రజల దృష్టిలో మమ్మల్ని దోషులుగా నిర్ధారించి, శిక్షించజూస్తున్నాయి! చట్టంలోని సంక్లిష్టతలు సామాన్యులకేం తెలుస్తాయి లెమ్మన్న ధీమాతో మమ్మల్ని తప్పుగా చిత్రించి, మా ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలే ఇవన్నీ. కానీ ఇలా చేయడం ద్వారా లబ్ధి పొందజూస్తున్నదెవరో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ బాగా తెలుసు! రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం నాకు హుందాగా జీవించే హక్కుంది. కాబట్టి ఇలాంటి లీకు వార్తల నుంచి నాకు రక్షణ కావాలి.

డిస్‌క్లెయిమరే సాక్ష్యం

నివేదికలోని 28వ పేజీలో డెలాయిట్ ఇచ్చిన డిస్‌క్లెయిమర్‌కు ఇక్కడ అత్యంత ప్రాధాన్యముంది. ‘‘ఈ నివేదికను కేవలం జగతి సంస్థ బయటి ఇన్వెస్టర్లతో తమ సంప్రదింపులకు ప్రాతిపదికను కల్పించేందుకు మాత్రమే ఇస్తున్నాం. బయటి పార్టీలు, లేదా ఔత్సాహిక ఇన్వెస్టర్లు దీనిపై ఆధారపడజాలరు. వారు విధిగా స్వీయ విచారణలు, స్వతంత్ర మదింపులు చేసుకుని మాత్రమే ఇందులో పేర్కొన్న ప్రకటనల కచ్చితత్వం, పరిపూర్ణతల విషయంలో సంతృప్తి చెందాల్సి ఉంటుంది. ఈ విలువ మదింపుపై బయటి పార్టీలకు డెలాయిట్ ఏ విధంగానూ బాధ్యత వహించబోదు’’ అని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ డిస్‌క్లెయిమర్ డెలాయిట్ మదింపు నివేదికలో అంతర్గత భాగమే. నివేదిక కేవలం జగతి బోర్డుకు నిర్దేశికగా ఉపయోగపడేందుకు మాత్రమేనని, ఇన్వెస్టర్లు దీనిపై ఆధారపడేందుకు కాదని అందులో బాహాటంగా పేర్కొన్నారు. అలాంటప్పుడు, హెచ్చు విలువ ఇవ్వాల్సిందిగా డెలాయిట్‌ను నేను ఒత్తిడి చేయాల్సిన అవసరమేముంటుంది? దానివల్ల మాకేం ఒరుగుతుంది? వారి నివేదిక మా అంతర్గత అవసరాలకే తప్ప బయటికి చూపేందుకు కాదన్న మీడియా వార్తలు కూడా సరికావు. ఎందుకంటే అందులోని అంచనాలకు డెలాయిట్‌కు ఏ బాధ్యతా వహించబోదని డిస్‌క్లెయిమర్ స్పష్టంగా చెబుతోంది. అదీగాక మేం మిత్రులు, బంధువులు, సన్నిహితుల నుంచే వాటాలు సమీకరించాం తప్ప పబ్లిక్ ఇష్యూకు వెళ్లలేదు. ఎలా చూసినా ఇది డెలాయిట్ నివేదికను బహిర్గతపరచడం కానే కాదు. పైగా ఎంతటి ప్రతిష్టాత్మక సంస్థ ఇచ్చే మదింపు నివేదిక అయినా మహా అయితే సహేతుక అంచనా అవుతుందే తప్ప దాన్ని పూర్తిగా వాస్తవంగా భావించాలనేమీ లేదు. పైగా అలాంటి మార్కెట్ విలువ నివేదికను మాత్రమే ఏకైక ఆధారంగా చేసుకుని ఏ ఇన్వెస్టర్ కూడా ఏ కంపెనీలోనూ పెట్టుబడులు పెట్టడు. అన్ని రకాలా సాధ్యాసాధ్యాలు, లాభదాయకత, మార్కెట్ అంచనాల వంటివాటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నాకే నిర్ణయానికి వస్తాడు. ల్యాంకో సంస్థకు చెందిన ఒక్కో షేర్ లాభం మూడేళ్లలోనే 100 శాతానికి పైగా పెరిగినా, అదే కాలానికి వాటి మార్కెట్ విలువ మాత్రం ఏకంగా 80 శాతం దాకా పడిపోయిన వైనం మనమంతా చూశాం. అలా 2007-2011 మధ్య ల్యాంకో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.21,000 కోట్ల నుంచి ఏకంగా రూ.4,000 కోట్లకు పడిపోయింది! ఇన్ఫోసిస్ విషయమూ అంతే. 2000-2011 మధ్య సంస్థ వ్యాపారం, లాభాలు పది రెట్లు పెరిగినా, షేర్ విలువ మాత్రం ఇదే కాలానికి రూ.8,000 నుంచి ఏకంగా రూ.2,850కి పడిపోయింది! ఇలా చాలా కంపెనీల్లో జరుగుతుంటుంది. మార్కెట్లో ఉండే ఇంతటి విసృ్తత, దారణమైన హెచ్చుతగ్గులు ఇన్వెస్టర్లందరికీ బాగా తెలుసు. అందుకే ఏ మదింపు నివేదికనైనా మార్కెట్ పరిస్థితులు తదితరాలతో బేరీజు వేసి చూసుకోవాల్సిందే. కావాలనో, మరో కారణంతోనో కొందరు మమ్మల్ని లక్ష్యం చేసుకుంటున్నారు. మా వ్యక్తిత్వాలను దెబ్బతీయజూస్తున్నారు.

ఈ లేఖను నేను మీడియాకు విడుదల చేస్తే మీరు అన్యధా భావించరనే ఆశిస్తున్నాను. అతి తక్కువ కాలంలో మా పత్రిక పాఠకుల సంఖ్య పెరుగుతున్న తీరును చూసి ఓర్చుకోలేని ఒక వర్గం మీడియా కనీవినీ ఎరగని రీతిలో చేస్తున్న దురుద్దేశపూర్వక, తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు అయిష్టంగానే నేనిలా చేయాల్సి వస్తోంది.
Share this article :

0 comments: