విలీనం అవసరమేముంది? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విలీనం అవసరమేముంది?

విలీనం అవసరమేముంది?

Written By news on Monday, September 17, 2012 | 9/17/2012

ఇష్టానుసారం వార్తలు రాస్తే మేమెలా జవాబుదారీ?
ఏ పార్టీతోనూ మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు.
ప్రజలు మా పక్షాన ఉన్నారు

హైదరాబాద్, న్యూస్‌లైన్: కాంగ్రెస్‌లో తమ పార్టీ విలీనం కావాల్సిన అవసరం ఏముందని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సూటిగా ప్రశ్నించారు. ఆదివారం బీఏసీ సమావేశంలో పాల్గొన్న అనంతరం పార్టీ శాసనసభా పక్ష ఉప నేత శోభా నాగిరెడ్డితో కలిసి విజయమ్మ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌లో విలీనంపై వస్తున్న వార్తలు, టీడీపీ ఆరోపణలపై విలేకరుల ప్రశ్నలకు విజయమ్మ తీవ్రంగా స్పందించారు. ‘‘కాంగ్రెస్‌లో వైఎస్సార్‌సీపీ కలవాల్సిన అవసరమేముంది? మీలో ఏ ఒక్కరైనా చెప్పగలరా? ఉప ఎన్నికల్లో ప్రజలు మా పార్టీనే గెలిపించారు. ఇంకా కలవాల్సిన అవసరముందా?’’ అని ప్రశ్నించారు. మీడియా ఇష్టమొచ్చినట్లు వార్తలు రాస్తే తాము జవాబుదారీ కాలేమన్నారు. 

సీబీఐ కేసులను తప్పించుకునేందుకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ వచ్చేందుకు కాంగ్రెస్‌తో మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయిగా అని అడిగితే, ‘‘13 నెలల నుంచి సీబీఐ విచారణ జరుపుతోంది. 10 నెలలపాటు జగన్ బాబు బయటే ఉన్నాడు. ఏ ఒక్క తప్పయినా చేశాడని సీబీఐ చెప్పగలిగిందా? విచారణ కోసమంటూ 110 రోజుల నుంచి జైల్లో పెట్టింది. తప్పు చేశాడని రుజువు చేయగలిగిందా? అయినా 90 రోజుల తరువాత ఆటోమేటిక్‌గా బెయిలివ్వాలి. ఎందుకివ్వరు? ఇస్తారు. కాబట్టి ఏ పార్టీతోనూ మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. ప్రజలు మా పక్షాన ఉన్నారు’’ అని పేర్కొన్నారు. టీడీపీ కార్యకర్తలు పార్టీని వీడి పోతుండటంతో, దాన్ని నివారించేందుకే ఆ పార్టీ నేతలు ఈ దుష్ర్పచారం చేస్తున్నారని శోభానాగిరెడ్డి విమర్శించారు.

సీఎం కిరణ్, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు బీఏసీ భేటీకి వస్తే బాగుండేదని విజయమ్మ అన్నారు. ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నందున కనీసం 15 రోజులైనా సమావేశాలను నిర్వహించాలని కోరినట్టు చెప్పారు. ‘‘మొదట నాలుగు రోజులేనన్న మంత్రులు, తర్వాత మరో రోజు పెంచుతామన్నారు. కాంగ్రెస్, టీడీపీలకు అసలు సభ జరపాలని ఆసక్తి ఉందో లేదో అర్థమవడం లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్, కరెంటు కోతలు, తాగునీరు, పరిశ్రమల మూత, డీజిల్ ధరల పెంపు, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల కోత, చేనేత కార్మికుల ఇబ్బందులు, ఆరోగ్యం, ఎస్సీ-ఎస్టీ ఉప ప్రణాళిక, జలయజ్ఞం తదితరాలపై సభలో చర్చించాలని కోరాం’’ అని తెలిపారు. విపక్షాలతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించగా,సభ ద్వారా ప్రజలకు న్యాయం జరుగుతుందనుకుంటే ఏ పార్టీతోనైనా కలిసి పని చేస్తామని బదులిచ్చారు.
Share this article :

0 comments: