
గురజాల: రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస పాలన సాగుతోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా గురజాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సరస్వతి పవర్స్ అండ్ సిమెంట్స్‌కు సంబంధించి కొనుగోలు చేసిన భూముల విషయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, గురజాల శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు చట్టాన్ని గౌరవించే రీతిలో వ్యవహరించడంలేదని వ్యాఖ్యానించారు. ఉద్దేశపూర్వకంగా రైతులను రెచ్చగొడుతున్నారన్నారు. ఫ్యాక్టరీ కోసం రైతుల ఇష్టపూర్వకంగానే భూములను కొనుగోలు చేశామే కానీ దౌర్జన్యంగా వారినుంచి భూములను తీసుకోలేదన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు లభించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వనందునే నిర్మాణం చేపట్టలేదన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణానికి రెండు వేల ఎకరాలు తీసుకున్నారని,కానీ 200 ఎకరాల్లో మాత్రమే నిర్మాణం చేపట్టారని, మిగిలిన 1800 ఎకరాలు నిరుపయోగంగా ఉన్నాయని గుర్తుచేశారు. చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్ పేర్లతో ఉన్న హెరిటేజ్ సంస్థకు తీసుకున్న వేల ఎకరాల భూములు నిరుపయోగంగా ఉన్నాయన్నారు. ‘మీకూ భూములున్నాయి. ఖాళీ స్థలాలున్నాయి. ఖాళీ ఇళ్లున్నాయి.
వాటిని ఎవరైనా ఆక్రమించుకోవచ్చా’ అని విజయసాయిరెడ్డి వారినుద్దేశించి ప్రశ్నించారు. పల్నాడులో ఫ్యాక్టరీల నిర్మాణానికి చాలా సిమెంట్ కంపెనీల యాజమాన్యాలు భూములు తీసుకున్నారని, వారు టీడీపీ నేతలకు కనిపించలేదా, ఒక్క జగన్ భూములే కనిపించాయా అని దుయ్యబట్టారు. కచ్చితంగా సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీని నిర్మించి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
దేశం నేతల కనుసన్నల్లో పోలీసులు: అంబటి
పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థ తెలుగుదేశం పార్టీ నాయకుల కనుసన్నల్లో నడుస్తోందన్నారు.
హామీలనుంచి తప్పించుకోవడానికే: జంగా
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవెర్చకుండా రైతులను తప్పుదారి పట్టించడానికే సరస్వతి భూముల విషయంలో రాద్ధాంతం చేస్తున్నారన్నారు. సమావేశంలో త్రిసభ్య కమిటీ సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి ప్రసాదరాజు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి గుదిబండ చినవెంకటరెడ్డి, ఎస్సీ సెల్ చైర్మన్ మేరుగ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment