కుట్రదారుల కీళ్లు విరిచిన తీర్పు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కుట్రదారుల కీళ్లు విరిచిన తీర్పు!

కుట్రదారుల కీళ్లు విరిచిన తీర్పు!

Written By news on Thursday, June 21, 2012 | 6/21/2012

సోనియాగాంధీ నాయకత్వంలో అణగిమణగి కొనసాగటం ఇష్టం లేక అనివార్య పరిస్థితుల్లో జగన్ పార్టీ పెట్టడం నేరంగా మారింది. నచ్చని నేతలపైకి సీబీఐని ఉసిగొల్పడం కాంగ్రెస్‌కు కొత్తేమీకాదు.జగన్ పార్టీ పెట్టకపోతే కేంద్రంలో మంత్రి పదవి, తర్వాత ముఖ్యమంత్రి పదవి ఇచ్చేవారమని ఆజాద్ ఉప ఎన్నికల ప్రచారంలో నోరు జారడం అసలు రహస్యాన్ని బట్టబయలు చేసింది. కుట్రదారులను మట్టి కరిపించిన ఈ తీర్పు చరిత్రాత్మకం! 
ఉప ఎన్నికల హోరులో కుళ్లుబోతులు, కుట్రదారులు మట్టికరిచారు. తిరుపతి వంటి చోట్ల కోట్ల కొలది రూపాయలతో గెలుపును చెరపట్టాలని చూసిన వారికి ఓటర్లు గట్టి గుణపాఠం చెప్పారు. నెల్లూరు కౌంటింగ్ పూర్తికాకముందే ముఖం చిట్లించుకుని టి.సుబ్బిరామిరెడ్డి పలాయనం చిత్తగించాడు. డబ్బు మీద మమకారం పెంచుకున్న సోనియమ్మకు నెల్లూరు షాకిచ్చింది. టీడీపీ అభ్యర్థి కౌంటింగ్ కేంద్రానికి రాకుండా ముఖం చాటేశాడు. జగన్ ఫోబియాతో చిర్రెత్తిన చంద్రబాబు, ఇది సానుభూతి వెల్లువ అంటూ ఆత్మను జోకొట్టుకుంటున్నాడు. అయితే జగన్‌ను అరెస్టు చేసేంత వరకు నిద్రపట్టని చంద్రబాబుకు, ఇది ఆత్మవంచనే. టీడీపీతో కుమ్మక్కై గెలిచిన ఆ రెండు స్థానాలు కాంగ్రెస్ వర్గాలను తృప్తిపరచలేదు. 

చిరంజీవిని ప్రసన్నం చేసుకున్నా ఉప ఎన్నికల్లో ఫలితం పూజ్యం. జగన్ లేని లోటును విజయమ్మ, షర్మిల దిగ్విజయంగా పూరించారు. జగన్‌ను ముఖ్యమంత్రిని చేసి రాజన్న రాజ్యం వచ్చేంత వరకు మీ వెంటే ఉంటామని మహిళలు ప్రతిజ్ఞ చేశారు. జనంలోకి వెళ్లి వారి సమస్యలు, బాధలు అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి నడుం బిగించమని జగన్ తనను కలవడానికి వచ్చిన కొత్త ఎమ్మెల్యేలకు హితవు చెప్పడం ఆయన రాజకీయ పరిపక్వతకు అద్దం పడుతోంది. ఇది 2014లో వైఎస్సార్‌పార్టీ విజయానికి పాస్ పోర్టులాంటిది.

ఫలితాలు చెప్పిన నిజాలు!
వైఎస్సార్ పార్టీకి తియ్యదనాన్ని అందించిన ఫలితాలు కాంగ్రెస్, టీడీపీలకు చేదు నిజాలుగా మారాయి. అన్నింటికంటే ఆసక్తికరమైనది... 18 శాసనసభ ఉప ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో కాంగ్రెస్-టీడీపీలు కలిసి సాధించిన దానికంటే జగన్ పార్టీకి ఎక్కువ ఓట్లు రావడం. జగన్ పార్టీకి 48.88 శాతం వస్తే, ఆ రెండు పార్టీలకు కలిపి 44.62 శాతం రావడం గమనార్హం. జగన్ పార్టీకి 18,23,422 ఓట్లు వస్తే, ఆ రెంటికీ కలిపి 16,64,387 వచ్చాయి. ఈ శాతం, ఈ ఓట్లు భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్, టీడీపీ నుంచి జగన్ పార్టీలోకి మారే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.

ఈ ఉప ఎన్నికల్లో చిరంజీవి ఓట్లతో గట్టునపడదామనుకున్న కాంగ్రెస్ కలలు కల్లలయ్యాయి. ఉదాహరణకు ఆళ్లగడ్డలో 2009లో కాంగ్రెస్, పీఆర్పీకి కలిపి 1,21,152 ఓట్లు పోలైతే, కాంగ్రెస్‌కు దక్కింది కేవలం 51,902 మాత్రమే. వైఎస్సార్‌పార్టీ అభ్యర్థి శోభానాగిరెడ్డి 88,697 ఓట్లతో, 36 వేలకు పైగా మెజారిటీ సాధించింది. 2009లో పీఆర్పీ అభ్యర్థిగా శోభానాగిరెడ్డి సాధించిన ఓట్లకంటే ఈసారి జగన్ అభ్యర్థిగా సాధించింది చాలా ఎక్కువ.

ఇంకో నమ్మలేని నిజం ఏమంటే, ప్రత్తిపాడులో 2009లో కాంగ్రెస్, టీడీపీలకు కలిపి 1,00,213 ఓట్లు వస్తే, ఇప్పుడు కాంగ్రెస్‌కు కేవలం 15,908 ఓట్లు రావడంతో డిపాజిట్టు గల్లంతైంది. నర్సాపురం, రామచంద్రపురం స్థానాల్లో చిరంజీవి ఓట్లు కాంగ్రెస్‌కు పడి ఉంటే, కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడాల్సిన పని ఉండేది కాదు. ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్, టీడీపీలకు పరువుపోయినా, కాంగ్రెస్ అభ్యర్థులకు పదవులు దక్కాయి.

పీఆర్పీ 2009లో తిరుపతి స్థానంలో కరుణాకర్‌రెడ్డి మీద విజయం సాధిస్తే, ఈ సారి కాంగ్రెస్, చిరంజీవి ఏకమైనా కరుణాకర్‌రెడ్డి 18 వేల పైచి లుకు మెజారిటీతో నెగ్గడం ఆశ్చర్యకరం! ఓటుకు రెండు, మూడు వేలు పంచినా పదవి, పరువు దక్కలేదు. కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణ భోరున విలపిం చాడు. కుమ్మక్కు రాజకీయం ఫలించనందుకు కిరణ్, బొత్స, బాబు, ‘చిరు’ తలలు పట్టుకున్నారు. ఓటమికి సాకులు వెతుక్కుంటున్నారు.

2009లో కాంగ్రెస్‌కు పోలైన ఓట్లను కిరణ్, జగన్ చీల్చుకుంటారని, తమ ఓట్లు పదిలంగా ఉంటాయని, అది తమగెలుపునకు దోహదం చేస్తుందని బాబు వేసిన లెక్కలను ప్రజలు చిత్తుచేశారు. కాంగ్రెస్, టీడీపీలు వైఎస్‌ను అప్రతిష్ట పాలుచేసేందుకు పాల్పడ్డ దుర్మార్గాలన్నిటినీ ప్రజలు పసికట్టారు. అందుకే ఇద్దర్నీ కట్టకట్టి ఓడించారు. రాజకీయాల్లో 1+1=2 కాదని కాంగ్రెస్, పీఆర్‌పీ విలీనీకరణ పర్యవసానం తేల్చింది. టీడీపీతో కుమ్మక్కు కూడా పనిచేయలేదు. మరోవైపు, 2009లో టీడీపీకి వచ్చిన ఓట్లలో భారీగా గండిపడింది. 

ఉదాహరణకు ఎమ్మిగనూరులో 2009లో 40 శాతం ఓట్లు టీడీపీకి వస్తే, ఉప ఎన్నికల్లో అది 28.9 శాతానికి పడిపోయింది. అలాగే రాయదుర్గం, రాయచోటి, రాజం పేట, రైల్వేకోడూరు, ఉదయగిరిలో టీడీపీ ఓట్లు బాగా దెబ్బతిన్నాయి. నెల్లూరు లోక్‌సభ సహా టీడీపీకి ఆరు స్థానాల్లో డిపాజిట్టు గల్లంతైంది. తొమ్మిది సీట్లలో 3వ స్థానానికి దిగజారారు. కాంగ్రెస్ పరిస్థితి ఇంతకంటే మెరుగేం కాదు. ఏడు స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు కాగా, తొమ్మిది సీట్లలో మూడో స్థానానికి పడిపో యారు. ఆ రెండు స్థానాల్లో గెలిపించినందుకు బొత్స ప్రజలకు కృతజ్ఞతలు తెలి పాడు. న్యాయంగా కృతజ్ఞతలు తెలపాల్సింది ప్రజలకు కాదు, చంద్రబాబుకు!

ఇంకో నిజం ఏమిటంటే, 2009 ఎన్నికల్లో వైఎస్ కాంగ్రెస్‌కు నాయకత్వం వహించిన ప్పుడు పోలైన ఓట్లకన్నా, జగన్ నాయకత్వం వహించిన వైఎస్సార్‌పార్టీ నాటికంటే నేడు దాదాపు అన్ని స్థానాల్లోనూ ఎక్కువ ఓట్లు సాధించింది. చిరంజీవి కాంగ్రెస్‌లో కలిసినా, ఈ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ స్థానాలైన పాయకరావుపేట, పోలవరం, పత్తిపాడు, రైల్వే కోడూరు స్థానాల్లో జగన్ విజయదుందుభి మోగించాడు. 

పజలు జగన్ వెంటే ఉన్నారన్న సత్యాన్ని ఇది రుజువు చేసింది. ఇక తెలంగాణలో ఎన్నికలు జరిగిన ఏకైక స్థానం పరకాలలో కౌంటింగ్ సరళి ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఆఖరి రౌండ్లలో సురేఖ పైచేయి సాధించడం చూసి జనం ఎంత ఆనందించారో చెప్పలేం. సురేఖకు డిపాజిట్టు పోతుందని టీఆర్‌ఎస్ నేతలు విర్రవీగుతూ డంబాలు పలికారు. తీరా చూస్తే, చావుతప్పి కన్ను లొట్టపోయినట్టు టీఆర్‌ఎస్ బొటాబొటి ఓట్లతో బయటపడింది. 

ఉపపోరు కావటంవల్ల టీఆర్‌ఎస్ తన శక్తినంతటినీ పరకాలలో కేంద్రీకరించడంవల్ల, సీపీఐ మద్దతు ఇచ్చినందువల్ల, కాంగ్రెస్ కుమ్మక్కు కావడంవల్ల టీఆర్‌ఎస్‌కు ఆ మాత్రమైనా ‘ఫలం’ దక్కింది. సురేఖ వీరోచితంగా పోరాడి ఓడింది. డిపాజిట్టు కోల్పోయిన కాంగ్రెస్ ఐదో స్థానంలో నిలవటం విశేషం. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తామని జగన్ పార్టీ తరపున విజయమ్మ స్పష్టం చేసినా, సురేఖ తెలంగాణకు వ్యతిరేకమని హోరెత్తేటట్లు దుష్ర్పచారం చేశారు. అందుకే, ఇది సురేఖ నైతిక విజయంగా నమోదైంది!

‘కుమ్మక్కు’పై కన్నెర్ర!
వైఎస్ మరణవార్త విని గుండె ఆగిపోయిన 660 మంది కుటుంబాలను వ్యక్తిగతంగా కలుసుకుంటానని నల్లకాలువ వద్ద జగన్ వాగ్దానం చేశాడు. ఆ మాట ప్రకారం జగన్ ఓదార్పుయాత్ర ప్రారంభిస్తే, జనం అనూహ్యంగా తన వెంట నడిచారు. 154 మంది సంతకం చేసి జగన్ మా నాయకుడన్నప్పుడే సోనియాకు కన్నుకుట్టింది. 

ఓదార్పులో జగన్‌కు వచ్చిన ప్రజాదరణ చూసి సోనియా బిత్తరపోయింది. జగన్ ఓదార్పుయాత్రకు సహకరించిన వారి మీద సోనియా వేటు వేసింది. ఢిల్లీలో తనను కలిసి కుటుంబమంతా చేసిన విజ్ఞప్తిని తిరస్కరించడమే కాక, దారుణంగా అవమానించింది. ఓదార్పు కొనసాగించినందుకు వైఎస్ కుటుంబంలోనే చీలిక తెచ్చింది. రాజకీయాల్లో కొనసాగాలంటే ప్రత్యేక పార్టీ పెట్టక తప్పని పరిస్థితిని సోనియా కల్పించింది. శంకర్రావు చేత హైకోర్టులో పిల్ వేయించింది. 

శంకర్రావుతోపాటు టీడీపీ నాయకులు కూడా అదే కేసులో ఇంప్లీడ్ కావడం కుట్రలో దాగిన మరో కోణం. సీబీఐ తయారు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో దివంగత వైఎస్ పేరు కూడా చేర్చారు. వైఎస్‌ను ముద్దాయిని చేయడంతో కాంగ్రెస్‌లోనే తిరుగుబాటు తలెత్తింది. జగన్, విజయమ్మ తమ పదవులకు, పార్టీకి రాజీనామా చేసి పోటీకి నిలబడ్డారు. దేశంలోనే ఎవరికీ రానంత మెజారిటీ సాధించారు.

కోవూరులో కూడా జగన్ అభ్యర్థి 23 వేల మెజారిటీతో నెగ్గాడు. హోరాహోరీగా సాగుతున్న ఉప ఎన్నిల ప్రచారం మధ్య, తొమ్మిది మాసాలు అరెస్టు చేయని జగన్‌ను సీబీఐ అరెస్టు చేయడం నీచమైన కుట్రగా ప్రజలు అర్థం చేసుకున్నారు. వైఎస్ మీద, జగన్ మీద కాంగ్రెస్, టీడీపీ నాయకులు కలిసి సాగించిన దుష్ర్పచారంలోని అసలు వాస్తవాలను ప్రజలు పసి గట్టారు. రెండేళ్లుగా ఇంత కథ నడిపిన కుట్రదారులు, తమ అకృత్యాలను దాచి పెట్టి, జగన్ అరెస్టు వలన వెల్లువెత్తిన సానుభూతి ఫలితంగా ఈ విజయాన్ని చిత్రించడం వారికే చెల్లింది.

చరిత్రాత్మక తీర్పు
జగన్ ఓదార్పు యాత్రలో దాగిన మానవత్వాన్ని ప్రజలు ఉప ఎన్నికల ద్వారా ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. ఆత్మాభిమానాన్ని చంపుకుని సోనియాగాంధీ నాయకత్వంలో అణగిమణగి కొనసాగటం ఇష్టం లేక అనివార్య పరిస్థితుల్లో జగన్ పార్టీ పెట్టడం నేరంగా మారింది. నచ్చని నేతలపైకి సీబీఐని ఉసిగొల్పడం కాంగ్రెస్‌కు కొత్తేమీకాదు. జగన్ పార్టీ పెట్టకపోతే కేంద్రంలో మంత్రి పదవి, తర్వాత ముఖ్యమంత్రి పదవి ఇచ్చేవారమని ఆజాద్ ఉప ఎన్నికల ప్రచారంలో నోరు జారడం అసలు రహస్యాన్ని బట్టబయలు చేసింది. కుట్రదారులను మట్టి కరిపించిన ఈ తీర్పు చరిత్రాత్మకం!
Share this article :

0 comments: