వైఎస్సార్‌సీపీలో చేరుతున్నా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌సీపీలో చేరుతున్నా

వైఎస్సార్‌సీపీలో చేరుతున్నా

Written By news on Sunday, September 2, 2012 | 9/02/2012

పూర్తిగా భ్రష్టుపట్టిన కాంగ్రెస్ ప్రక్షాళన అసాధ్యం.. అందుకే ఆ పార్టీని వీడుతున్నా
9న రాయగిరిలో నా అభిమానులతో సమావేశం

భువనగిరి టౌన్(నల్లగొండ), న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని, అందులో ప్రక్షాళన జరగడం అసాధ్యమని, అందువల్ల తాను ఆ పార్టీని మనోపూర్వకంగా వదిలి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని మాజీ మంత్రి, సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి తెలిపారు. శనివారం భువనగిరి రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను ఎలాంటి పదవులు, ప్రలోభాలను ఆశించి వైఎస్‌ఆర్ సీపీలోకి రావడం లేదన్నారు. మహాత్మా గాంధీ, వల్లభాయి పటేల్, సంజీవరెడ్డిలాంటి నాయకుల స్ఫూర్తితో ప్రజాసేవ చేయడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నానని తెలిపారు. తాను ఎలాంటి పదవులకూ పోటీ చేయనని, పార్టీలో సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడించారు. ఈ నెల 9న భువనగిరి మండలం రాయగిరిలో జిల్లాస్థాయి వైఎస్సార్ అభిమానులతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

సీఎంకు అవగాహన లేకనే అనిశ్చితి..

ఏ మంత్రి పదవినీ నిర్వహించని కిరణ్‌కుమార్‌రెడ్డి అవగాహన లోపం వల్ల పరిపాలన చేయలేకపోతున్నారని, అందుకే కచ్చితమైన నిర్ణయాలు తీసుకోకుండా చీటికీ మాటికీ భయపడి ఢిల్లీకి వెళుతున్నారని, దీనివల్ల రాజకీయ అనిశ్చితి ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఉప్పునూతల విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రితోపాటు కేబినేట్‌లోని పలువురు మంత్రులకు తాను టికె ట్‌లు ఇప్పించడం వల్లే పోటీ చేసి ఈ స్థాయికి వచ్చారన్నారు. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ముందు చేతులు కట్టుకొని నిలబడిన నేటి ముఖ్యమంత్రి, మంత్రులే ఇప్పుడు ఆయన పేరు, ఫొటోలు తొలగించాలని చూడడం సిగ్గుచేటన్నారు. వైఎస్‌ఆర్ నిర్ణయాలు ప్రతి కుటుంబానికీ మేలు చేశాయన్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లే నేడు విద్యార్థులు, యువకులు ఉత్సాహంతో ఆయన కుమారుడు స్థాపించిన పార్టీలో చేరుతున్నారని చెప్పారు.

రాజీవ్‌నెలా ప్రధానిని చేశారు?: వైఎస్ మరణానంతరం జగన్ సీఎం కావాలని 154 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసినా, ఆయనకు పరిపాలన అనుభవం లేదని కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుందని ఉప్పునూతల విమర్శించారు. అదే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మరణించినప్పుడు పరిపాలన అనుభవం లేని రాజీవ్‌గాంధీని ప్రధానమంత్రిని ఎందుకు చేశారని ఆయన ప్రశ్నించారు. జగన్ 5.40 లక్షల ఓట్ల మెజార్టీతో గెలవడం అంటే అతడు సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పడానికి నిదర్శనమన్నారు. సోనియాగాంధీ రాష్ట్రంలో పర్యటించినప్పుడు వైఎస్ పరిపాలన సమర్థవంతంగా ఉందని, ఆయనను ఆదర్శంగా తీసుకొని మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరిపాలన చేయాలని కొనియాడారన్నారు. అలాంటి వారే నేడు జగన్‌ను రాజకీయంగా ఎదగకుండా జైల్లో పెట్టారని, అతడిపై ఒత్తిడి తీసుకువస్తున్నారని అన్నారు. అయినా, ప్రజల నుంచి ఆయనకు ఉప్పెనలా ఆదరణ లభిస్తోందన్నారు. ప్రస్తుత తరుణంలో ప్రజలు జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారని, సర్వేలు కూడా జగన్ గెలుపునే సూచిస్తున్నాయని అన్నారు.
Share this article :

0 comments: