కాంగ్రెస్‌ను కాదన్నందుకే అరెస్టు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్‌ను కాదన్నందుకే అరెస్టు

కాంగ్రెస్‌ను కాదన్నందుకే అరెస్టు

Written By news on Thursday, December 20, 2012 | 12/20/2012

- కాంగ్రెస్, టీడీపీ కుట్ర పన్ని జగన్‌ను జైల్లో పెట్టడం సీఎంకు తెలియదా: అంబటి 
- సోనియా చెబితేనే జగన్‌పై కోర్టులో పిల్ వేశానన్న శంకర్రావు మాటలు మరిచారా?
- కిరణ్‌గారూ.. పాత చింతకాయ పచ్చడి కథలెందుకు?
- కాంగ్రెస్‌ను దిగజార్చడంలో చరిత్ర సృష్టించబోతున్నావ్ 

సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినందుకే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేయించిన విషయం వాస్తవం కాదా? అని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. జగన్ అరెస్టు విషయంలో కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెబుతున్న మాటలు పాత చింతకాయ పచ్చడి కథలాగా ఉన్నాయని దుయ్యబట్టారు. అంబటి బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 

‘‘ఎఫ్‌డీఐలపై పోరాడినందుకు జగన్ జైలుకెళ్లాడా... ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై పోరాడి జైలుకెళ్లాడా అని నంగనాచి కబుర్లు చెబుతున్న కిరణ్‌కు దేనికోసం ఆయన్ను జైల్లో పెట్టారో తెలియదా? సోనియాగాంధీ చెబితేనే జగన్‌పై కోర్టులో పిల్ వేశానని మాజీమంత్రి పి.శంకర్రావు చెప్పిన విషయం మరిచారా?’’ అని ధ్వజమెత్తారు. ‘‘కాంగ్రెస్‌ను కాదని బయటికొచ్చినందుకు జగన్‌ను అరెస్టు చేయించారు.. ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలను చిత్తుచిత్తుగా ఓడిస్తున్నాడని జైల్లో పెట్టారు. 

కడప లోక్‌సభాస్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 1.92 లక్షల మెజారిటీ సాధిస్తే కాంగ్రెస్ నుంచి బయటకొచ్చాక వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసి 5 లక్షల 45 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందినందుకు ఆయన్ను జైలుకు పంపించారు. అంతెందుకు జగన్ బయటుంటే తమకు రాజకీయంగా బతుకుండదని కాంగ్రెస్, టీడీపీ కుట్ర పన్ని జైల్లో పెట్టారు. ఇదంతా కిరణ్‌కు తెలియదనుకోవాలా!’’ అని ఆయన అన్నారు. జగన్ జైలుకెళ్లాడని కన్నీరు కార్చి ఓట్లేస్తే రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసిన వారవుతారని కిరణ్ చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. కిరణ్ పాలనలో రాష్ట్రం ఇపుడున్నది అంధకారంలోకాక, దేదీప్యమానంగా వెలుగుతోందా? అని వ్యంగ్యంగా అన్నారు. 

రోజుకు 12 గంటల విద్యుత్‌కోతలతో రాష్ట్రం అంధకార బంధురంగా తయారైనమాట వాస్తవంకాదా? అని ప్రశ్నించారు. ఒకవైపు నాగార్జునసాగర్ కాలువలకు నీళ్లు వదలక, మరోవైపు పండిన పత్తిని కొనుగోలు చేసేవారు లేక రైతులు, ఇంకొకవైపు సమస్యలు పరిష్కరించేవారు లేక విద్యార్థులు, ఉద్యోగులు అధ్వాన స్థితిలో ఉన్నది కిరణ్ పాలనలో కాదా? అని నిలదీశారు. సీఎం వద్దకొచ్చే ఫైళ్లు కదలని దౌర్భాగ్య పరిస్థితిలో రాష్ట్రం ఉందన్నారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి సీఎంగా ఉన్నపుడు 1994లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 26 స్థానాలు గెల్చుకుని అథమస్థానానికి దిగజారిందని, ఇపుడు కిరణ్ నేతృత్వంలో 16 స్థానాలు కూడా వచ్చే పరిస్థితి ఉండబోదని, ఈ విధంగా ఆయన ఒక చరిత్రను సృష్టించబోతున్నారని జోస్యంచెప్పారు. 

హెరిటేజ్‌లో పెట్టుబడులకోసమే బాబు లాలూచీ
నష్టాల్లో ఉన్న హెరిటేజ్ సంస్థలో విదేశీ పెట్టుబడులను(ఎఫ్‌డీఐలు) ఆశించే టీడీపీ అధినేత చంద్రబాబు రాజ్యసభలో ముగ్గురు ఎంపీలను గైర్హాజరు చేయించారని రాంబాబు చెప్పారు. ఎంపీ సుజనా చౌదరి రాజీనామాను తిరస్కరించడంతోనే ఆయన కాంగ్రెస్‌తో లాలూచీ పడ్డారనే విషయం స్పష్టమైందన్నారు. నిజంగా బాబు ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తుంటే తన హెరిటేజ్‌లోకి ఆహ్వానించబోమని చెప్పగలరా? అని తమ పార్టీనేత సోమయాజులు సవాలు విసిరి వారం దాటినా చంద్రబాబు మాట్లాడకపోవడాన్ని గమనించాలన్నారు.

రెచ్చగొట్టే చర్యలొద్దు..
తెలంగాణ ప్రాంతంలో టీఆర్‌ఎస్ శ్రేణులు రెచ్చగొట్టే చర్యలకు దిగొద్దని అంబటి సూచించారు. వైఎస్సార్‌సీపీకి హింసపై విశ్వాసం లేదని, దాడులు చేయడం తమ సంస్కృతి కాదని చెప్పారు. మూడు నెలల్లో తెలంగాణ వస్తుందని కేసీఆర్ పరకాల ఎన్నికలప్పుడు వ్యాఖ్యలు చేయడం, కొండా సురేఖ దానిని ప్రశ్నించడం.. ఇలా ఈ సంఘటనలకు నేపథ్యం ఉందని ఆయన వివరణ ఇచ్చారు. షర్మిల మోకాలికి శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగిందని, ఆరువారాల విరామానంతరం.. ఎక్కడైతే పాదయాత్రను ఆపారో, అక్కడినుంచే మళ్లీ ప్రారంభిస్తారని అంబటి చెప్పారు. 

వైఎస్సార్‌ది అవినీతి పాలనని మంత్రి సి.రామచంద్రయ్య చేసిన వ్యాఖ్యలపై అంబటి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ వ్యాఖ్యలు చేయడానికి మంత్రికున్న నైతికత ఏమిటని ప్రశ్నించారు. రామచంద్రయ్య ముందు తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఇలా మాట్లాడాలన్నారు. ఇవాళ రామచంద్రయ్య మంత్రిగా ఉన్నారంటే వైఎస్ అధికారంలోకి తెచ్చిన ప్రభుత్వంలోనేఅన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రామచంద్రయ్య తక్షణం తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని లేదా రాజీనామా చేయాలని ఆయన కోరారు.
Share this article :

0 comments: