జగన్‌బాబు నాయకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌బాబు నాయకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు

జగన్‌బాబు నాయకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు

Written By news on Friday, December 21, 2012 | 12/21/2012

ఇందిర: ఇన్ని కష్టాల్లో కూడా జగన్‌గారు ఎప్పుడూ కూల్‌గా నవ్వుతూ ఉంటారు... అది మొదటినుంచి ఉన్నదా, అలవర్చుకున్నదా?

విజయమ్మ: ఇంత పేషన్స్ జగన్‌కు ముందునుంచి ఉందా అని చూసే అవకాశం అంతకుముందు ఎప్పుడూ కలగలేదు. ఏ కష్టం తెలీకుండా పెంచాం. అయితే కొన్ని క్వాలిటీస్ జన్మతః వచ్చినవి అయితే, వాళ్ల నాన్నను చూసి నేర్చుకున్నవి కొన్ని. రాజకీయాల్లో ఉన్నప్పుడు కొంచెం పేషన్స్ ఉండాలి, స్థితప్రజ్ఞత ఉండాలి అని మొదట్లోనే చెప్పేవారు వాళ్ల నాన్న.

ఇందిర: రాజశేఖరరెడ్డి గారి అన్నేళ్ల రాజకీయ జీవితాన్ని,జగన్ గారి మూడేళ్ల రాజకీయ జీవితాన్ని...ఎలా చూస్తారు?

విజయమ్మ: ఒక అడుగు ముందుకు వేస్తే, 10 అడుగులు వెనక్కి లాగే కాంగ్రెస్ పార్టీలాంటి పార్టీలో 26 ఏళ్లపాటు పోరాటం చేస్తూ, ప్రజల మన్ననలు పొంది, ఆ స్థాయికి రావడం చూశాను. తనకు పదవి వచ్చేసరికి పూర్తిగా స్థితప్రజ్ఞత వచ్చింది. ఆయన పడిన కష్టం స్లోగా ఉంటే, ఈయన తక్కువ టైంలో ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. వాళ్ల నాన్న 30 సంవత్సరాలపాటు పోరాటం చేస్తే ఈయన 3 సంవత్సరాల్లోనే అంత పోరాటం చేశాడు. అందులోనూ ఆయన పెరిగిన తీరు వేరు, జగన్ పెరిగిన తీరు వేరు.

ఏ కష్టం తెలీకుండా అపురూపంగా పెంచుకున్న జగన్, తను పడుతున్న కష్టాల్ని చాలా బాగా అధిగమించుకుంటూ వస్తున్నాడని అనిపిస్తుంది. జగన్‌ను చూడడానికి వెళ్లినప్పుడు మాతో అంటాడు -‘మనం మన చేతుల్లో లేము... 8 కోట్లమంది ప్రజలు మనవైపే చూస్తున్నారు. వాళ్ల ఆశలకు అనుగుణంగా మనమూ, మన నిర్ణయాలు ఉండాలి... వాళ్ల సమస్యలకోసం దీక్షలు, కార్యక్రమాలు చేయండి కానీ, నాకోసం వద్దు’ అన్నప్పుడు, నాకు వాళ్ల నాయన గుర్తొచ్చారు. ఈ మూడేళ్లు జరిగిన పరిస్థితులు తనని ఆవిధంగా మార్చాయనుకుంటా. తక్కువ టైంలో ఎక్కువ కష్టం రావడంతో పెద్దరికం, స్థితప్రజ్ఞత ఈయనకన్నా ముందే జగన్‌కు వచ్చిందని అనిపించింది.

ఇందిర: ఇదంతా రాజశేఖరరెడ్డి గారు పైనుంచి చూస్తున్నారు అనుకుంటే... కొడుకును చూసి ఏమనుకుంటూ ఉండుంటారు?
విజయమ్మ: ఆయనలాగే జగన్ కూడా కష్టాన్ని కష్టంగా తీసుకోకుండా, దాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని నడుస్తున్నాడు కాబట్టి ఆయన గర్వంగా ఫీలవుతారని నాకనిపిస్తుంది. ...
ఇందిర: మీరు మూడు యాత్రలకు సాక్షి... (వైయస్సార్ పాదయాత్ర, జగన్ ఓదార్పు, షర్మిల మరో ప్రజాప్రస్థానం)!

ముగ్గురిలోనూ గమనించిన మార్పులు...
విజయమ్మ: పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశాక రాజశేఖరరెడ్డిగారి హృదయం మెత్తబడింది! కోపమనేది చాలావరకు తగ్గిపోయింది! ఆయన మరింత ఓర్పుగా, సమతుల్యంగా తయారయ్యారనిపించింది! ఆ విషయాన్ని ఆయనే బహిరంగంగా చాలాసార్లు చెప్పుకున్నారు. అంతేకాక, ప్రజల కష్టాల పట్ల పూర్తి అవగాహనను, మునుముందు ఏమేం సాధించాలనే దానిపట్ల పూర్తి స్పష్టతను, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నిర్దిష్ట దిశను కల్పించి, భవిష్యత్ ప్రణాళికకు బాట వేసింది పాదయాత్ర!
ఉన్నత స్థానానికి కావలసిన లక్షణాలు జగన్‌లో మొదటినుంచీ ఉన్నా, ఆ స్థానంలో నిలబడటానికి కావలసిన వ్యక్తిత్వ వికాసాన్ని కల్పించడానికి మాత్రం ఓదార్పుయాత్ర తనకెంతో తోడ్పడింది. ఈ యాత్ర నుంచి తను ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు. వెల్లువెత్తిన ప్రజాభిమానం జగన్‌లో ఎంతో పరివర్తన తీసుకొచ్చింది. తనను ఇంకా హంబుల్‌గా చేసింది. బీదవారి జీవన శైలి చూశాక తన ఆలోచనా సరళిలో మార్పు వచ్చింది. వాళ్లకోసం అంకితభావంతో పనిచేయాలనే ఆలోచన ఇంకా దృఢపడింది.

ఇక షర్మిల గురించి చెప్పాలంటే... ఇంతకుముందు వాళ్ల నాయన చెప్పేది వినడమో, అన్న చెప్పేది వినడమో, పేపర్లలో చదవడమో ఉండేది. ఇప్పుడు రియల్‌గా తిరిగి చూస్తుంది కాబట్టి, ఇంత కష్టపడుతున్నారా అని తెలుసుకుంటోంది. తనూ కష్టపడుతోంది. అయితే, తను మొదటినుంచి ముసలివాళ్లను చూసినా, చిన్నపిల్లలను చూసినా ఎక్కువ స్పందించేది. వాళ్ల బాధలు, కష్టాలు తెలుసుకునేది. అందువల్ల ఇప్పుడు ప్రజల్లో ఈజీగా మూవ్ అవ్వగలుగుతోంది.

ఇందిర: కొంతమంది అంటున్నారు - అవసరం కోసం జగన్‌గారు తల్లిని, ఇప్పుడు చెల్లెల్ని రాజకీయాల్లోకి దించారని...
విజయమ్మ: అలా ఎలా అనుకుంటారు? పెద్దాయన 30 ఏళ్లు కష్టపడి, ఐదేళ్లు ప్రజల హృదయాలను హత్తుకునేంతగా పరిపాలన చేశారు. తర్వాత జగన్‌బాబు రెండున్నర సంవత్సరాలు కష్టపడి దాన్ని నిలబెట్టుకున్నాడు.

ఒక నాయకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. దాన్ని తను బయటికొచ్చేంతవరకు నిలబెట్టాలి అనే ఉద్దేశంతోనే మేం ప్రజల మధ్య తిరుగుతున్నాం తప్ప తనేదో మమ్మల్ని బలవంతంగా దీనిలోకి దించినట్టు మాట్లాడడం సబబు కాదు. ప్రజలు ఇప్పుడు జగన్‌బాబును నమ్ముతున్నారు. కాబట్టి తను జైలుకు పోయినప్పుడు, బయట కొంతమంది ఇక తను రాడు అని రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు, ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది.

రాజశేఖరరెడ్డిగారు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ‘ధైర్యంగా ఉండండి. మంచికాలం వస్తుంది’ అని చెప్తూ ఏ విధంగా పాదయాత్ర చేశారో, ఈరోజు పరిస్థితి అంతకంటే దారుణంగా ఉండడంతో, వాళ్లకు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. నాకు ఆరోగ్యం సరిగా ఉండి, నడవగలిగితే నేనే పాదయాత్ర చేసేదాన్ని. అలా చేయలేకనే ఇంట్లో ఉండే పాపను బయటికి తీసుకురావాల్సి వచ్చింది తప్ప, జగన్ మమ్మల్నేదో బలవంతంగా దీనిలోకి దించినట్టు చెప్పడం సరికాదు. నిజానికి, మేమిలా కష్టపడుతున్నామని జగన్ తరచూ బాధపడుతూ ఉంటాడు.

ఇందిర: ఆయన ఒకటి రెండుసార్లు కోర్టుకు వచ్చారు కదా. బయటికి వచ్చి కాస్తంత స్వేచ్ఛావాయువులు పీల్చి మళ్లీ లోపలికి వెళ్లేటప్పుడు ఆయన ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ఎప్పుడైనా చెప్పారా?

విజయమ్మ: ఆ ఒక్కసందర్భమనే కాదు...జగన్‌కు ఎప్పుడూ మమ్మల్ని ధైర్యపరచడంతోనే సరిపోతుంది. తన ఫీలింగ్స్ ఏంటో చెప్పుకోవడానికి పాపం, అవకాశం ఉండదు. తన సంగతి చెప్పలేను కానీ... రాష్ట్రపతి ఎన్నికలప్పుడు ఓటు వేయడానికని తను పోలీస్ సెక్యూరిటీతో అసెంబ్లీకి వచ్చినప్పుడు... ప్రెస్‌వాళ్లు ఏదో అడిగారని జగన్ వాళ్ల వైపు తిరిగి, ఓ అడుగు వేద్దామనుకున్న టైంలో... పక్కనున్న పోలీసు కుదరదని చెప్పి, తీసుకెళ్లిపోతున్నప్పుడు నాకెంత బాధనిపించిందో చెప్పలేను.

కూర్చున్నప్పుడు కూడా తను ఏదో ఖైదీ అన్నట్లు, క్రిమినల్ అన్నట్లు ఇద్దరు పోలీసుల మధ్య తనను కూర్చోబెడితే నాకు కన్నీళ్లాగలేదు. అక్కడే కాదు, ములాఖత్‌లో కూడా పోలీసులు ఎప్పుడూ అటూ ఇటూ తిరుగుతూనే ఉంటారు. స్వేచ్ఛగా మాట్లాడేదే ఉండదు. ఇంతవరకూ ఎప్పుడూ లేదట... ఇప్పుడు సిసి కెమెరాలు కూడా పెట్టారు. అంతేకాదు, ఓసారి అసెంబ్లీలో వాళ్ల నాన్న మాట్లాడిన స్పీచ్‌ల రికార్డులను విని, తనూ కొంత నేర్చుకుంటాడని పంపిద్దామని అనుకున్నప్పుడు జగన్ - జైల్ రూల్స్ ప్రకారం అలా చేయకూడదమ్మా - అని వద్దనేశాడు. అలాంటిది తను సెల్‌ఫోన్లు అవీ వాడతాడా!

వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే... ప్రత్యర్థులు ఏవేవో మాట్లాడతారు... ఏం చెప్పాలి?
అయినా, ప్రజలకు నిజానిజాలు తెలుసు. టైం వచ్చినప్పుడు వాళ్లే దానికి సమాధానం చెప్తారు.:

ఇందిర: మీ పట్ల, మీ పిల్లల పట్ల ఇంత ఎఫెక్షన్ చూపిస్తున్న ప్రజలను చూస్తే మీకేమనిపిస్తుంది?
విజయమ్మ: 200 రూపాయల పెన్షన్ పొందినవారికి ఉన్నంత గ్రాటిట్యూడ్ నాయకులకుగానీ, పదవులు పొందినవారికి గానీ లేదు. ప్రజలకు ఏమన్నా చేస్తే తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు. అందుకే రాజశేఖరరెడ్డిగారిని ఇప్పటికీ ఇంతలా తలచుకుంటున్నారు. సరే, ఆయనంటే చేశారు... కానీ జగన్, షర్మిలలు ఇంకా ఏమీ చేయలేదు... అయినా వాళ్ల నాయన మీద ఉండే కృతజ్ఞత ప్రజలు ఈరోజు పిల్లల మీద చూపిస్తున్నారంటే... ఈ ప్రజలకు మేమేం చేస్తే రుణం తీరుతుంది... వాళ్లు అవకాశం ఇస్తే వాళ్ల జీవితాలను మెరుగుపరచడం తప్ప!
Share this article :

0 comments: