హెచ్‌ఆర్‌సీకి ఆళ్ల రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » హెచ్‌ఆర్‌సీకి ఆళ్ల రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి

హెచ్‌ఆర్‌సీకి ఆళ్ల రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి

Written By news on Tuesday, January 6, 2015 | 1/06/2015


రైతులపై అక్రమ దాడులను ఆపండి: ఆళ్ల
రైతులపై అక్రమ దాడులను ఆపండి
హెచ్‌ఆర్‌సీకి ఆళ్ల రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి
 సాక్షి, హైదరాబాద్: ఏపీలో రాజధాని నిర్మాణానికి అనుకూలంగా ఉండి తమ సారవంతమైన భూములను ఇచ్చేందుకు అంగీకరించని రైతులను పోలీసులు అనేక రకాలుగా వేధింపులకు గురిచేస్తున్నారని మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. రైతుల పొలాలకు నిప్పంటించిన వారిని వదిలేసి విచారణ పేరుతో అమాయక రైతులను కొడుతున్నారని చెప్పారు. ఈ మేరకు పలువురు రాజధాని ప్రాంత రైతులతో కలిసి సోమవారం ఆయన హైదరాబాద్‌లో మానవ హక్కుల సంఘానికి (హెచ్‌ఆర్‌సీ) ఫిర్యాదు చేశారు. రైతులపై అక్రమ దాడులు ఆపేలా చూడాలని కోరారు. అనంతరం రామకృష్ణారెడ్డి విలేకరులతో మాట్లాడారు. గత నెల 29వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలోని తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాలలోని పలు గ్రామాల్లో రైతుల పొలాలకు, షెడ్డులకు కొంతమంది దుండగులు నిప్పంటించారని, దీని వల్ల రైతుల సామాగ్రి పూర్తిగా దగ్ధమైందని తెలిపారు. భూ సమీకరణకు వ్యతిరేకంగా ఉన్న రైతులను, తమ భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేనివారిని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయకుండానే అక్రమంగా అరెస్ట్ చేసి తీవ్రంగా కొడుతున్నారని చెప్పారు.
 
  రైతుల పొలాలకు నిప్పంటించిన నిందను వైఎస్సార్‌సీపీపై వేసేందుకు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నం చేశారన్నారు. హోం మంత్రి మరో అడుగు ముందుకేసి వైఎస్సార్‌సీపీఅధినేత జగన్‌మోహన్‌రెడ్డి పాత్ర ఉన్నట్లుగా చెప్పడం దారుణమని పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లి, పెనుమాక, నవులూరు తదితర గ్రామాలలోని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పోలీసులు విచారణ పేరుతో పోలీస్‌స్టేషన్‌లో అక్రమంగా నిర్బంధించి తీవ్రంగా కొడుతున్నారన్నారు. కేవలం ఇళ్లు, పొలం, మార్కెట్ మాత్రమే ప్రపంచంగా జీవనం సాగిస్తున్న రైతులు వేధింపులు తట్టుకోలేక.. తమను ఆదుకోవాలని, అండగా నిలవాలని వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌ను కోరినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులపై పోలీసులు అక్రమంగా చేస్తున్న దాడులను ఆపేలా ఆదేశించాలని హెచ్‌ఆర్‌సీని కోరినట్లు చెప్పారు. తమ ఫిర్యాదుపై విచారణను సభ్యుడు కె.పెద పేరిరెడ్డి ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు.
Share this article :

0 comments: