రుణం నిజం.. మాఫీ మోసం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రుణం నిజం.. మాఫీ మోసం

రుణం నిజం.. మాఫీ మోసం

Written By news on Wednesday, January 7, 2015 | 1/07/2015


రుణం నిజం.. మాఫీ మోసం
 రుణ మాఫీకి కత్తెర వేయడంలో కొత్త కోణాలు.. అర్హతలన్నీ ఉన్నా ఒక్క పైసా మాఫీ కాని రుణాలు కోకొల్లలు

 ‘‘రైతులను ఆదుకుంటాం, అన్ని రుణాలు మాఫీ చేసేస్తాం అంటే నమ్మి ఓటేస్తే అధికారం వచ్చాక రైతుల అవసరం తీరిపోయినట్టుంది బాబుగారికి.’’
 ‘‘ఓట్ల కోసం ఒకటి సెప్పాడు. ఇప్పుడేమో మరొకటి అంటున్నాడు. ఈ మాయమాటలను మునిగిపోయి వడ్డీలతోసహా బాకీల్లో కూరుకుపోనాం.’’
 ‘‘ఏ నిబంధనల కింద రుణ మాఫీ కాలేదు అని అడిగితే.. ఆ రూల్స్ ఏవో మాకే రాలేదు.. మీకెలా చెబుతామని అంటున్నారు.’’
 ‘‘మీసేవకు వెళితే బ్యాంకులో అంటారు. బ్యాంకుకు వెళితే రెవెన్యూ కార్యాలయంలో ఇవ్వాలంటారు. అక్కడికి వెళితే బ్యాంకుకు వెళ్లాలని చెప్పి తిప్పుతున్నారు...’’
 ‘‘అదేమని అడిగితే మాట దాటేస్తున్నారు. ఇదేం అన్యాయం? పోనీ ఇచ్చిన వారికైనా పూర్తిగా ఇచ్చారా అంటే అదీ లేదు. ప్రభుత్వం మాత్రం అన్ని రుణాలు మాఫీ చేసేశాం. ఇచ్చేశాం అని పేపర్లో వార్తలు రాయిస్తోంది.’’

 ‘‘అక్కడకెళ్తే లోనుకాయితం, పట్టా కాయితం, ఆదార్‌కార్డు, కోటా కార్డు, ఓటు కార్డు నకళ్లు తీసి ఇమ్మన్నారు. తీసి ఇచ్చాను. అయినా బాకీపోనేదు. సరికదా వడ్డీ పెరిగిపోయింది. ఇన్సూరెన్స్ రాలేదు. పెట్టుబడి రాయితీ రాలేదు. మళ్లీ పెట్టుబడికి డబ్బు కావాల. బ్యాంకులో తెద్దామంటే ముందు తీసుకున్న బాకీ కట్టేవరకు మళ్లీ అప్పు ఇవ్వరంట. శెట్టిగారు దగ్గర తెద్దామంటే భూమి పట్టాకాగితాలు బ్యాంకులో ఉండిపోయాయి. ఇపుడేమిటి సేయాలి?’’
 ఇదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతన్నల గోడు! ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేశానంటున్న రైతు రుణ మాఫీ వాస్తవ పరిస్థితి!! ఊర్లో నలుగురైదుగురికి అరకొరగా పైసలు విదిల్చి మాఫీని మమ అనిపిస్తున్నారు. మిగతా వారికి ఆ కాసిన్ని కాసులు కూడా రాల్చకుండా ఏవేవో సాకులు చెప్తూ తిప్పిస్తున్నారు. అర్హతలన్నీ ఉన్నా.. పత్రాలన్నీ ఇచ్చినా.. పైసా కూడా మాఫీ కాలేదు ఎందుకని అన్నదాత దీనంగా అడిగితే.. జవాబు చెప్పే నాథుడే లేడు. కాళ్లరిగేలా తిరుగుతూ కాళ్లావేళ్లా పడుతున్నా.. వాళ్లని అడుగు, వీళ్లని అడుగు.. ఆ కాగితాలు తీసుకురా.. ఈ కాగితాలు మళ్లీ ఇవ్వు.. మాఫీ కాకపోతే మేమేం చెస్తాం?! అని కసిరేస్తున్నారు.  
 చప్ప మహేశ్వరరావు విజయనగరం జిల్లా గంట్యాడ మండలం బుడతనాపల్లి వాసి. నాలుగు ఎకరాల రైతు. అందులో రెండెకరాలు ఆదే గ్రామానికి చెందిన చల్ల రాముకు కౌలుకిచ్చాడు. మిగతా పొలం సొంతంగా సాగు చేస్తున్నాడు. కౌలు రైతుగా చల్ల రాము రెండెకరాల సాగుకు రూ. 12,000 రుణం తీసుకున్నాడు. సొంతంగా సాగు చేసుకుంటున్న మహేశ్వరరావు కూడా విడిగా పంట రుణం తీసుకున్నాడు. మొత్తం నాలుగెకరాలకు ఒకే సర్వే నంబరు, పాస్‌బుక్కు ఉన్నాయి. వాటి జిరాక్సు కాపీలు పెట్టే ఇద్దరూ రుణం తీసుకున్నారు. ఇద్దరిదీ ఒకే పాస్‌బుక్కు ఉందన్న కారణంతో ఇద్దరికీ రుణమాఫీని నిరాకరించింది చంద్రబాబు ప్రభుత్వం. ఈ ఒక్క ఉదాహరణ చాలు.
రాష్ట్రంలో రుణ మాఫీ జాబితా నుంచి చంద్రబాబు రైతులను ఎలా అనర్హులను చేస్తున్నారో చెప్పడానికి. అన్నీ సక్రమంగా ఉన్నా.. పాస్‌బుక్కు నంబరు సరిగా పడలేదనో, ఆధార్ నంబరు తప్పుగా పడిందనో, సర్వే నంబర్ల వివరాలు సరిగా లేవ నో.. ఇవన్నీ ఉంటే ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’కు మిం చి రుణం ఉందనో, బంగారం తాకట్టు రుణాలయితే.. వ్యవసాయ అవసరాలకు అప్పు తీసుకోలేదనో.. ఈ కారణాలేవీ లేకపోయినా.. ఏ కారణం చూపకుండానే.. రుణ మాఫీ లబ్ధిదారుల జాబితా నుంచి అర్హుల తొలగింపే ధ్యేయం గా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ‘సాక్షి నెట్‌వర్క్’ క్షేత్రస్థాయిలో జరిపిన పరిశీలనలో పల్లెపల్లెలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబును నమ్ముకుని నిలువునా మోసపోయాయ మని రైతన్నలు బిక్కమొహం వేస్తున్నారు.
     - సాక్షి నెట్‌వర్క్

 ఇక అప్పు, వడ్డీ, అపరాధ వడ్డీ నేనే కట్టాలి...
 పేరు: షేక్ యూనిస్‌బాష (3.50 ఎకరాలు)
 ఊరు: కర్నూలు జిల్లా బనగానపల్లె
 రుణం: రూ. 40,000, వడ్డీ: రూ. 2,000
 మాఫీ: ఒక్క రూపాయి కూడా కాలేదు
 ‘‘పంట రుణం మాఫీ కోసం రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, పట్టాదారు పాసుపుస్తకం, ఓటరు కార్డుకు చెందిన జిరాక్స్ కాపీలన్నీ నిర్ణీత సమయంలోనే బ్యాంకు అధికారులకు ఇచ్చాను. కానీ ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. ఎవరిని అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదు. ఇప్పుడు అప్పు, వడ్డీయే కాక అదనపు వడ్డీ కూడా నేనే కట్టాల్సి వచ్చేట్టు ఉంది. పంటలు సరిగా రాక... వచ్చిన పంటలకు గిట్టుబాటు ధర లేక చానా ఇబ్బంది అయితాంది. ఏమి చేయాలో అర్థమే కావడం లేదు.’’

 మాఫీ లేదు.. బీమా లేదు.. సబ్సిడీ లేదు...
 పేరు: నరసింహప్ప (6.73 ఎకరాలు)
 ఊరు: అనంతపురం జిల్లా
 రొద్దం మండలం పెద్దముత్తూరు
 అప్పు: రూ. 80,000, వడ్డీ: రూ.5,395, మాఫీ: కాలేదు
 కారణం: అర్హతలన్నీ ఉన్నాయన్నారు కానీ పేరు లేదు
 ‘‘చంద్రబాబు పాదయాత్రలో మా మండలానికి వచ్చాడు. ఇచ్చిన మాట మేరకు రుణ మాఫీ చేస్తాడని నమ్మాము. రుణ మాఫీ కోసం అన్ని పత్రాలను బ్యాంకర్లకు సమర్పించారు. తీరా జాబితా చూస్తే నా పేరు లేదు. అన్ని అర్హతలు ఉన్నా చిల్లి గవ్వకూడా మాఫీ కాలేదు. పైగా నేను తీసుకుంది ఒకే రుణం. జాబితాలో మాత్రం రెండు రుణాలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. మాకు బీమా, ఇన్‌పుట్‌సబ్సిడీ కూడా ఇవ్వలేదు. బయట అప్పు పుట్టడం లేదు. చివరకు భార్యా, పిల్లలను పోషించడం కూడా భారమవుతోంది.’’

 మాఫీ వర్తించదట..
 పేరు:    చల్ల రాము (2 ఎకరాల కౌలు రైతు)
 ఊరు:    విజయనగరం జిల్లా
     గంట్యాడ మండలం బుడతనాపల్లి
 రుణం:    రూ. 12,000, వడ్డీ: రూ. 3,000
 మాఫీ:    ఒక్క రూపాయీ కాలేదు
 కారణం:    భూమి యజమాని కూడా రుణం తీసుకున్నారు కాబట్టి ఎవరికీ మాఫీ కాదన్నారు
 ‘‘నేను రెండు ఎకరాలు కౌలుకు తీసుకున్నాను. కౌలు రైతు కార్డుతో 2013లో రుణం తీసుకున్నాను. నేను సాగు చేస్తున్న భూమితో పాటు ఒకే సర్వే నంబరులో ఉన్న మరో రెండెకరాల భూమిని మా యజమాని స్వయంగా సాగుచేసుకుంటున్నారు. రెండు నంబర్లూ ఒకటేనని ఇద్దరికీ మాఫీ వర్తించదన్నారు.

 మాయమాటలు నమ్మి బాకీల్లో కూరుకుపోనాం
 పేరు: తేటకాయల కృష్ణ (60 సెంట్లు)
 ఊరు: విశాఖ జిల్లా నక్కపల్లి మండలం సీతానగరం
 రుణం: రూ. 7,500, వడ్డీ: రూ. 1,500
 మాఫీ:  కాలేదు,కారణం:    పట్టా పత్రాలు ఇచ్చినా.. నంబరు తప్పు పడిందన్నారు
 ‘‘గొడిచర్ల కోపరేటివ్ బ్యాంకులో (పీఏసీఎస్) భూమి కాగితాలు తాకట్టు పెట్టి రూ. 7,500 అప్పు చేశాను. చంద్రబాబు ఎలచ్చన్‌లప్పుడు బాకీలన్నీ కోటేత్తానని సెప్పేడు. నమ్మకంతో అప్పుకట్టడం మానేసాను. కానీ మాఫీలో నా బాకీ పోనేదు. ఎందుకు పోనేదంటే భూమి పట్టా నంబరు తప్పు పడిందన్నారు. ఈ ఏడాది మళ్లీ తోటలు కాపుకొత్తన్నాయి. పెట్టుబడికి డబ్బు కావాల. బ్యాంకులో తెద్దామంటే   బాకీ కట్టేవరకు మళ్లీ అప్పు ఇవ్వరంట. ఈ మాయమాటలను బాకీల్లో కూరుకుపోనాం.’’

 నమ్మి ఓటేశాం.. కానీ మాఫీ కాలేదు..
 పేరు:    నాగభూషణం (1.60 ఎకరాలు)
 ఊరు:    నెల్లూరు జిల్లా వరికుంటపాడు,   మండలం రామదేవులపాడు
 రుణం:    రూ. 61,000, మాఫీ: కాలేదు
 కారణం:    పాసుపుస్తకం వివరాలు ఉన్నా.. లేవన్నారు
 ‘‘మినుము పంట వేసేందుకు నా భార్య నగలు ఆరు సవర్ల బంగారం, పొలం పాసుపుస్తకం బ్యాంకు లో తాకట్టు పెట్టి 2013 అక్టోబరులో లోను తీసుకున్నాను. బాకీని తోసేస్తానని చంద్రబాబు చెప్తే సంతోషపడ్డాను. మేమంతా నమ్మి చంద్రబాబునాయుడుకి ఓటేశాము. ఇప్పుడు చూస్తే నా లోను మాఫీ కాలేదు. పాస్‌పుస్తకం వివరాలు లేనందున రుణ మాఫీకి అనర్హులుగా వెబ్‌సైట్‌లో ఉంచారు.  బ్యాంకు  పట్టించుకోవడం లేదు.

 అధికారం వచ్చాక రైతుల అవసరం తీరినట్టుంది...
 పేరు: సిద్ధా సూర్యప్రకాశరావు (5 ఎకరాలు)
 ఊరు: తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కష్ణునిపాలెం
 బంగారు రుణం: రూ. 1.80 లక్షలు
 వడ్డీ: రూ. 70,000, మాఫీ: కాలేదు
 కారణం: ఆధార్, రేషన్ కార్డులు ఇచ్చినా..   నమోదు కాలేదన్నారు
 ‘‘నేను 2012లో వరి సాగు చేసేందుకు బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకున్నా. కానీ నష్టాలు చవిచూడటంతో బ్యాంకు రుణం తీర్చలేకపోయాను. ప్రస్తుతం అసలు, వడ్డీ కలిపి సుమారు రూ. 2.50 లక్షలు అప్పు ఉంది. గతేడాది చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణ మాఫీ జరుగుతుందని ఆశపడ్డా. కానీ రుణ మాఫీ లిస్టులో నా పేరు లేదు. రైతుల అవసరం తీరునట్టుంది.
Share this article :

0 comments: