వాద్రాపై దర్యాప్తునకు చిదంబరం నో - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వాద్రాపై దర్యాప్తునకు చిదంబరం నో

వాద్రాపై దర్యాప్తునకు చిదంబరం నో

Written By news on Tuesday, October 9, 2012 | 10/09/2012

రేపు మరిన్ని వివరాలు బయటపెడతానన్న కేజ్రీవాల్
వాద్రాను వెనకేసుకొచ్చిన కర్ణాటక గవర్నర్ భరద్వాజ్
ఆరోపణలపై దర్యాప్తునకు కాంగ్రెస్ జంకుతోందన్న బీజేపీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా, రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్‌ఎఫ్ నుంచి పైసా పెట్టుబడి లేకుండా రూ.కోట్లు గడించారంటూ వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరిపించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం నిరాకరించారు. మరోవైపు, వాద్రాపై ఆరోపణలు చేసిన ఇండియా అగెనైస్ట్ కరప్షన్ (ఐఏసీ) నాయకుడు, సామాజిక కార్యకర్త ఈ అంశంపై మంగళవారం మరిన్ని వివరాలు బయటపెడతానని చెప్పారు. అవినీతి జరిగినట్లు నిర్దిష్టమైన ఆరోపణలు, స్పష్టమైన ఆధారాలు ఉంటే తప్ప ప్రైవేటు లావాదేవీలపై ప్రభుత్వం దర్యాప్తు చేపట్టలేదని చిదంబరం అన్నారు. ఢిల్లీలో సోమవారం జరిగిన ఆర్థిక సంపాదకుల సదస్సులో పాల్గొన్న ఆయన, ఈ అంశంపై వచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ అంశంపై తాను ప్రభుత్వం తరఫున ప్రతిస్పందించలేనని చిదంబరం చెప్పారు. ‘క్విడ్ ప్రో కో’ లేదా అవినీతి జరిగినట్లు నిర్దిష్టమైన ఆరోపణలు, వాటికి ఆధారాలు ఉంటే తప్ప. కేవలం నిందారోపణల ఆధారంగా ప్రైవేటు లావాదేవీలను ప్రశ్నించలేమని ఆయన అన్నారు.

డీఎల్‌ఎఫ్ సంస్థ వాద్రాకు ఎలాంటి పూచీకత్తు, వడ్డీ లేకుండానే రూ.65 కోట్ల రుణం ఇచ్చిందని, దానికి తోడు రూ.300 కోట్ల విలువ చేసే ఆస్తులను కారుచౌకగా ఆయనకు కట్టబెట్టిందని కేజ్రీవాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ‘రాబర్ట్ వాద్రాకు డీఎల్‌ఎఫ్ మేళ్లు చేసింది. అందుకు హర్యానా ప్రభుత్వం డీఎల్‌ఎఫ్‌కు ఏ మేళ్లు చేసింది? డీఎల్‌ఎఫ్ వివరణ ఏవిధంగా అబద్ధాల పుట్ట?... వీటిపై రేపు సాయంత్రం 5 గంటలకు మాట్లాడతా’ అని కేజ్రీవాల్ సోమవారం ‘ట్విట్టర్’ ద్వారా ప్రకటించారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీ వాద్రాను వెనకేసుకొచ్చింది. తమ పార్టీని, తమ నాయకత్వాన్ని లక్ష్యంగా ఎంచుకునే కుట్రపూరితంగా కేజ్రీవాల్, ప్రశాంత్‌భూషణ్‌లు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రతినిధి రషీద్ అల్వీ ఆరోపించారు.

‘వాద్రా ఆస్తులపై ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా కేసు నమోదు చేశారా? ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారా?’ అని ఆయన ప్రశ్నించారు. కర్ణాటక గవర్నర్ హెచ్‌ఆర్ భరద్వాజ్ కూడా వాద్రాకు బాసటగా నిలిచారు. గాంధీల కుటుంబంపై ఇదివరకు కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయని, అవన్నీ తేలిపోయాయని అన్నారు. మరోవైపు, వాద్రాపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరిపించేందుకు కాంగ్రెస్ జంకుతోందని బీజేపీ విమర్శించింది. వాద్రాపై ఎలాంటి దర్యాప్తు ఉండదని సాక్షాత్తు మంత్రులే చెబుతున్నారని బీజేపీ అధికార ప్రతి నిధి నిర్మలా సీతారామన్ విమర్శించారు.వాద్రా వ్యాపార లావాదేవీలన్నింటిపైనా దర్యాప్తు జరిపించాలని సీపీఎం డిమాండ్ చేసింది. 

సిమ్లాలోని ఆస్తులపై దర్యాప్తు జరిపించాలి

హిమాచల్‌ప్రదేశ్‌లో సోనియా గాంధీ కుటుంబానికి గల ఆస్తులపై దర్యాప్తు జరిపించాలని బీజేపీ ఎంపీ, హిమాచల్ మాజీ ముఖ్యమంత్రి శాంతాకుమార్ డిమాండ్ చేశారు. సిమ్లాలో ప్రియాంకా గాంధీకి ఉన్న ఆస్తులపై కూడా వాస్తవాలను వెలుగులోకి తేవాలని కోరుతూ కేజ్రీవాల్‌కు ఆయన లేఖ రాశారు. ప్రియాంకా-వాద్రా కుటుంబానికి సిమ్లాలో కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు తనకు తెలుసునని, అయితే పూర్తి వివరాలు తెలియవని, ఈ అంశాన్ని కూడా మీ జాబితాలో చేర్చుకోవాలని కేజ్రీవాల్‌ను తన లేఖలో కోరారు. అయితే వీరి ఆస్తుల వివరాలను హిమాచల్‌లోని బీజేపీ ప్రభుత్వమే బయటపెట్టాలని కేజ్రీవాల్ అన్నారు. శాంతాకుమార్ పూర్తి వివరాలు తెలియవని పేర్కొనడాన్ని కేజ్రీవాల్ తప్పు పట్టారు. 

http://www.sakshi.com/main/FullStory.aspx?CatId=465435&Categoryid=1&subCatId=32
Share this article :

0 comments: