నరనరానా అబద్ధాలేనా...? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నరనరానా అబద్ధాలేనా...?

నరనరానా అబద్ధాలేనా...?

Written By news on Thursday, December 6, 2012 | 12/06/2012

ఎమ్మార్‌కు భూములు ఇచ్చిన మీరు, ఓఎంసికి లీజులు ఇచ్చిన మీరు, ఐఎంజికి భూములు ఇచ్చిన మీరు బయట వున్నారు. ఏనాడూ, ఏ పదవిలో లేని, ఏ ఫైలుమీదా సంతకం చేయని, ఎవరికీ భూములూ, లీజులూ ఇవ్వని జగన్ జైలులో ఉన్నాడంటే ఇట్టే తెలిసిపోతోంది... ఎవరు ఎవరితో ఒప్పందంలో వున్నారో, ఎవరు విశ్వసనీయత లేకుండా రాజకీయాలు చేస్తున్నారో! 

అయ్యా చంద్రబాబుగారూ, మీ నోట నిజాలు రావా? మా మామగారు అన్నట్టు మీ మీద నిజంగా మునీశ్వరుని శాపం వుందా? మీరు నిజం మాట్లాడితే మీ తల వెయ్యి చెక్కలవుతుందా? మీ వయసుకు, మీ హోదాకు, మీ రాజకీయ అనుభవానికి అబద్ధాలు సమంజసం కాదు. నేను ఇంతకుముందు కూడా మీతో విన్నవించుకున్నాను - ఎదుటలేని వ్యక్తి గురించి చెడు మాట్లాడడం సంస్కారం కాదు, సమంజసం కాదు - అని! అటువంటిది ఏకంగా మీరు నోటికి వచ్చినన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు. భర్త మీద అబద్ధాలు మాట్లాడితే ఏ భారత స్త్రీ కూడా సహించదు. జగన్ భార్యగా ఈ అబద్ధాలను ఖండించడం నా బాధ్యత, నా ధర్మం. మీరు కూడా మీ బాధ్యత ఎరిగి, మీ ధర్మం తెలుసుకుని అబద్ధాలు మాట్లాడడం మానండి. ఎదుటలేని వ్యక్తిని నిందించే చెడు సంస్కారానికి స్వస్తి పలకండి.

మీకు నిజంగా, నీతిగా, న్యాయంగా జగన్ మీద గెలవాలని ఉంటే ధైర్యంగా ఎదురుగా ఉన్నప్పుడు పోరాడండి. అంతేకాని బెయిల్ పిటిషన్ విచారణకు ముందు మీ ఎంపీలను పంపి, బెయిల్ రాకుండా అడ్డుకుని, జైలులో పెట్టి ఇలా అబద్ధాల ప్రచారం ద్వారా గెలవాలనుకోవడం పిరికిపందల చర్య అవుతుంది. ప్రజలు దాన్ని హర్షించరు సరికదా, అసహ్యించుకుంటారు.

నీతి, నిజాయితీ, నిబద్ధత, సంస్కారం - ఇవి మా ఆయనకు ఉన్నవి, మీకు లేనివి. అందుకే ప్రజలు ఈరోజు జగన్ జైలులో ఉన్నా ఆయన వెంబడే ఉన్నారు. మీరు 1000 కిలోమీటర్లు నడిచినా ప్రజలు మిమ్మల్ని నమ్మడం లేదు. మీరు మారండి, అబద్ధాలు మానండి. దొడ్డిదారిన కాకుండా ఎదురుగా నిలబడి వీరోచితంగా పోరాడండి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు, మీ వెంట ఉంటారు. నేను మారాను అని మీరు అంటున్నారు. మనం మారినట్టు మనం అంటే సరిపోదు... మనలోని మార్పును మన చుట్టూ ఉన్న ప్రజలు గమనించినప్పుడే అది నిజమైన మార్పు. అబద్ధాలు మానండి, దొడ్డిదారులు వదలండి. మీ మాటల్లో, మీ ఆలోచనల్లో, మీ పనుల్లో మీ మార్పు అప్పుడు తప్పక కనబడుతుంది. అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్మే అవకాశం వుంది. 

నా భర్త మీలాగ కాంగ్రెస్‌పార్టీతో రాజీపడి వుంటే మాకు ఈరోజు ఈ కష్టాలు ఉండేవి కాదు. మీతో, కాంగ్రెస్ పార్టీతో ఈ వేధింపులు ఉండేవి కాదు. ఇప్పటికి ఆరు నెలలకు పైగా జగన్ జైలులో ఉన్నాడంటే, 90 రోజులకు రావలసిన బెయిల్ రాలేదంటే కారణం, ఆయన నమ్మినదారి వదలలేదు కాబట్టి. మీ మాదిరి కాంగ్రెస్‌తో చీకటి ఒప్పందం ఉంటే మీలాగ బయట ఉండేవాడు. మీ మాదిరి చీకటి ఒప్పందం ఉంటే కోర్టులు చెప్పినా విచారణకు రాకుండా మేనేజ్ చేసుకునేవాడు. ఆరు నెలలు కాదుకదా ఒక్క గంట కూడా జైలులో ఉండవలసిన పని ఉండేది కాదు.

ఎమ్మార్‌కు భూములు ఇచ్చిన మీరు, ఓఎంసికి లీజులు ఇచ్చిన మీరు, ఐఎంజికి భూములు ఇచ్చిన మీరు బయట వున్నారు. ఏనాడూ, ఏ పదవిలో లేని, ఏ ఫైలుమీదా సంతకం చేయని, ఎవరికీ భూములూ, లీజులూ ఇవ్వని జగన్ జైలులో ఉన్నాడంటే ఇట్టే తెలిసిపోతోంది... ఎవరు ఎవరితో ఒప్పందంలో వున్నారో, ఎవరు విశ్వసనీయత లేకుండా రాజకీయాలు చేస్తున్నారో! అన్నిరోజులూ ఒకేలా వుండవు. దేవుని దయ వలన, ప్రజల అభీష్టం మేరకు జగన్ బయటకు వచ్చేరోజు త్వరలోనే వుంది. ఈలోపలనైనా మీరు మీ అబద్ధాల మార్గం విడిచి, ప్రజలు నమ్మేవిధంగా, ప్రజలు మెచ్చేవిధంగా మారతారని ఆశిస్తున్నాను. మీకంటే చిన్నదాన్ని, మీకు ఈ విధంగా రాసినందుకు క్షమించండి. మళ్లీ చెబుతున్నాను - భర్త మీద అబద్ధాలు మాట్లాడితే ఏ భారత స్త్రీ కూడా సహించదు. నేనూ అంతే. జగన్ బయట లేడు, సమాధానం చెప్పలేడు కాబట్టి, జగన్ బయటకు వచ్చేంతవరకు మీరు పెద్దమనిషిలా సంయమనం పాటిస్తారని, అబద్ధాలు మానేస్తారని, ఎదుటలేని వ్యక్తి గురించి చెడు మాట్లాడే చెడు సంస్కారాన్ని విడిచిపెడతారని ఆశిస్తున్నాను.

- వైఎస్ భారతి
w/oవైఎస్ జగన్









source:sakshi
Share this article :

0 comments: