అది ఉత్తుత్తి కమిటీయే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అది ఉత్తుత్తి కమిటీయే

అది ఉత్తుత్తి కమిటీయే

Written By news on Saturday, August 17, 2013 | 8/17/2013

అది ఉత్తుత్తి కమిటీయే
కాంగ్రెస్ ప్రకటనకు, కేంద్రం కదలికకు పొంతనే లేదు
కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు వినడానికే ఆంటోనీ కమిటీ
ప్రత్యేక రాష్ట్రంపై కేంద్ర హోంశాఖ రాజ్యాంగ ప్రక్రియ కొనసాగింపు
దేని పని దానిదే అన్నట్లుగా సాగిపోతున్నా నోరెత్తని కాంగ్రెస్ ముఖ్యులు
కమిటీతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రక్రియ ముందుకు సాగుతుందని స్పష్టంచేసిన బొత్స
సమైక్య ఉద్యమమూ మీడియాతోనే ఉధృతమవుతోందని అభిప్రాయం
19, 20 తేదీల్లో ఢిల్లీలో తెలంగాణ, సీమాంధ్ర నేతలతో కమిటీ భేటీ

 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై సీడబ్ల్యూసీ తీర్మానంతో ఏర్పడ్డ పరిణామాల నేపథ్యంలో ఏఐసీసీ ఏర్పాటు చేసిన ఏకే ఆంటోనీ కమిటీకి ఎలాంటి ప్రాధాన్యమూ లేదని, అది ఉత్తుత్తి కమిటీయేనని స్పష్టమవుతోంది. కమిటీ ఏర్పాటుపై కాంగ్రెస్ ప్రకటనకు, తెలంగాణ ప్రక్రియపై కేంద్రం కదలికలకు పొంతనే కనిపించడం లేదు. తెలంగాణ తీర్మానంతో సీమాంధ్రలో తలెత్తిన ఉద్యమ వేడిని తాత్కాలికంగా చల్లార్చడానికి ఆంటోనీ కమిటీని కాంగ్రెస్ కంటితుడుపుగా తెరపైకి తెచ్చినట్లు స్పష్టమవుతోంది. కమిటీ ద్వారా అభిప్రాయాలు సేకరిస్తున్నామనే పేరుతో ఉద్యమ ఉధృతిని తగ్గించి ఆపై తన పనిని సాఫీగా కొనసాగించేందుకే కాంగ్రెస్ పెద్దలు కమిటీ నాటకానికి తెరతీసినట్లు తాజా పరిస్థితి స్పష్టం చేస్తోంది. తెలంగాణపై రాజ్యాంగ ప్రక్రియ కొనసాగింపునకు, ఆంటోనీ కమిటీ అభిప్రాయాల సేకరణకు సంబంధం లేదని, దేని దారి దానిదేనని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సైతం చెబుతున్నారు.
 
 ఆంటోనీ కమిటీ తెలంగాణ అంశంపై రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న అభ్యంతరాలు, అభిప్రాయాలు మాత్రమే వింటుంది తప్ప ప్రత్యేక రాష్ట్రంపై కేంద్రం చేపట్టే ప్రక్రియతో ఈ కమిటీకి ఎలాంటి సంబంధం లేదని బొత్స పేర్కొంటుండడం గమనార్హం. ‘‘కమిటీ కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు, అభ్యంతరాలు వింటుంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై రాజ్యాంగపరమైన ప్రక్రియను కేంద్ర హోంశాఖ కొనసాగిస్తూ పోతుంది. ఆంటోనీ కమిటీతో తెలంగాణ ప్రక్రియ ఆగబోదు. దేని పని దానిదే’’ అని బొత్స సత్యనారాయణ శుక్రవారం తనను కలసిన మీడియాతో అన్నారు. పైగా కమిటీ నివేదిక ఇవ్వడానికి గడువు లేదని ఆయన అంటున్నారు. కమిటీ  స్వీకరించే అభిప్రాయాలతో కానీ, అది ఇచ్చే నివేదికలతో కానీ కేంద్రానికి సంబంధం లేకుండా ప్రత్యేక రాష్ట్రంపై కేంద్రం తన పని తాను చేసుకుపోతుంది. ఇప్పుడు జరుగుతున్నదీ అదే. కమిటీకి సీమాంధ్ర  ప్రాంత నేతలు చెప్పే అభ్యంతరాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోకుండానే రాజ్యాంగపరమైన చర్యలను కేంద్రం కొనసాగించుకుపోతున్నా కాంగ్రెస్ పార్టీ నేతలు గొంతెత్తడం లేదు. సీడబ్ల్యూసీ తీర్మానంపై  కాంగ్రెస్ పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వచ్చినందున వారందరినీ ఏకాభిప్రాయంలోకి తెచ్చేందుకు కమిటీ ప్రయత్నిస్తుందని బొత్స పేర్కొంటున్నారు. తెలంగాణపై సీడబ్ల్యూసీ తీర్మానానికి అనుగుణంగానే అందరినీ నడిపించేందుకు తప్ప సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలను వినడం ఈ కమిటీ లక్ష్యం కాదన్న అంశం బొత్స మాటల్లోనే తేటతెల్లమవుతోంది.
 
 అభిప్రాయాల స్వీకరణ తూతూమంత్రంగానే..
 ఆంటోనీ కమిటీ అభిప్రాయాల స్వీకరణ తీరు కూడా ఏదో తూతూమంత్రంగానే అన్నట్లు సాగుతోంది. ఇలా అభ్యంతరాలు, అభిప్రాయాలు స్వీకరించి ఆ తర్వాత ఉద్యమవేడి చల్లారగానే కేంద్రం తన ప్రక్రియను ముందుకు తీసుకుపోతుందని అంటున్నారు. ప్రస్తుతం ఆ కమిటీ ఢిల్లీ నుంచి కదిలే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం పార్లమెంటు జరగని రోజుల్లో హైదరాబాద్‌కు వచ్చే ప్రయత్నం కూడా కమిటీలో కనిపించడం లేదు. పార్లమెంటు సమావేశాలున్నందున ఈనెల 30 వరకు కమిటీ ఎక్కడికీ వెళ్లదని, ఎవరైనా అక్కడికే వెళ్లి అభిప్రాయాలు చెప్పుకోవాలని, అది కాంగ్రెస్ అంతర్గతవ్యవహార కమిటీ కనుక ఆ పార్టీ నేతల కే అభిప్రాయాలు వ్యక్తపరిచే అవకాశం ఉంటుందని పార్టీ నేతలకు స్పష్టమైన సంకేతాలొచ్చాయి. పార్టీ నేతలు కూడా స్వేచ్ఛగా కమిటీ ముందు హాజరయ్యే పరిస్థితి అసలే లేదు.
 
 కమిటీని ఎవరు కలవాలన్నా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి చెప్పాలి. కమిటీని కలుస్తామనే వారి వివరాలను వారిద్దరూ ఏఐసీసీకి పంపిస్తారు. ఆ తర్వాత కమిటీ అనుమతిని అనుసరించి ఎంపికచేసిన నేతలకు మాత్రమే అవకాశం కల్పిస్తారు. బయటి వ్యక్తులకు అసలు అవకాశమే ఇవ్వకుండా కమిటీతో చర్చల తతంగాన్ని పైపైనే ముగించాలన్నది పార్టీ పెద్దల అభిప్రాయం. ఇదిలా ఉంటే అందుకు విరుద్ధంగా బయటి వ్యక్తులకు, సంస్థలకు అవకాశమిస్తామని పీసీసీ అధ్యక్షుడు బొత్స కొద్దిరోజులక్రితం చేసిన ప్రకటన పార్టీలో వివాదాస్పదమైంది. ఆ ప్రకటనలో ఒక ఫోన్ నంబర్‌ను కూడా ఆయన ఇచ్చారు.
 
 ఈ ప్రకటనపై ఏఐసీసీ అగ్ర నేతలు బొత్సపై ఆగ్రహించినట్లు తెలుస్తోంది. దీంతో కంగుతిన్న బొత్స శుక్రవారం మాటమార్చారు. ఇది పార్టీ అంతర్గత కమిటీయేనని, పార్టీ నేతల్లోని అపోహలను తొలగించడానికే దీన్ని ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు. పీసీసీ చీఫ్ ఇచ్చిన ఫోన్ నంబర్‌కు దాదాపుగా 200కు పైగా కాల్స్, 60కి పైగా ఎస్సెమ్మెస్‌లు వచ్చాయని తెలుస్తోంది. ‘‘మాకు వచ్చిన ఎస్సెమ్మెస్‌లలో చెప్పుకోదగ్గవి ఏమీ లేవు. 13 గ్రూపులు మాత్రం అపాయింట్‌మెంటు కోరాయి. వాటిలోనూ స్పష్టత లేదు. చాలా మంది కమిటీ ముందు చెప్పాల్సిన అభిప్రాయాలను మెసేజ్ రూపంలో ఇచ్చారు’’ అని బొత్స పేర్కొన్నారు. పార్టీని సంప్రదించిన సంస్థలకు అవకాశం ఇవ్వడం ఇష్టం లేకపోవడం కారణంగానే అవేవీ ప్రతిష్టాత్మకమైనవి కావని పార్టీ నేతలు పక్కన పెట్టేస్తున్నారు.

http://www.sakshi.com/news/top-news/no-sanctity-to-antony-committee-57720
Share this article :

0 comments: