పేదవాని గోడు అరణ్యరోదనా..? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పేదవాని గోడు అరణ్యరోదనా..?

పేదవాని గోడు అరణ్యరోదనా..?

Written By news on Wednesday, November 18, 2015 | 11/18/2015


కేసీఆర్‌ను నిలదీయండి
వరంగల్ ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ పిలుపు

 వరంగల్ నుంచి సాక్షిప్రతినిధి : ‘వరంగల్ ఉప ఎన్నికలు ఎందుకొచ్చాయి..? వెఎస్ హయాంలో క్వింటాల్ రు.6,700 ఉన్న పత్తి మద్దతు ధర ఇపుడు రు. 3,500 మాత్రమే ఎందుకుంది? 18 నెలల పాలనలో దళితులకు కేవలం 1600 ఎకరాలు మాత్రమే ఎందుకు పంచారు? గత ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇప్పటికీ ఎందుకు చెల్లించలేకపోయారు? ఏడాదిన్నర కాలంలో కొత్తగా ఒక్క అంబులెన్సును కూడా ఎందుకు కొనుగోలు చేయలేదు? గత ఏడాది కన్నా ఇపుడు నిత్యావసరాల ధరలు ఎందుకు మండిపోతున్నాయి..’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నిలదీయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ‘ఈ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేసినా...వేయక పోయినా కేసీఆర్ ప్రభుత్వం పడిపోదు.

ఎన్నికల్లో గెలిచినా..ఓడినా తేడా రాదు. కానీ  పొరపాటున గెలిచారంటే కేసీఆర్ తన పరిపాలన బాగుంది అనుకొని ప్రజలను పూర్తిగా మరిచిపోయే ప్రమాదం ఉంది.  రైతుల మీద ఇంకా పెద్దపెద్ద బండలు వేసే రోజులు వస్తాయనే విషయం మర్చిపోకూడదు. అందుకే టీఆర్‌ఎస్‌ను ఓడించాలి’ అని ఆయన అన్నారు.  వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌రావుకు మద్దతుగా తెలంగాణ రాష్ర్ట వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలసి వైఎస్ జగన్ మంగళవారం ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  రెండవరోజైన మంగళవారంనాడు హన్మకొండ నుంచి మొదలైన ఎన్నికల ప్రచార యాత్ర భూపాల్‌పల్లి  మీదుగా సాగి , పరకాల నియోజకవర్గ కేంద్రంలో ముగిసింది. పరకాల  బస్టాండు చౌరస్తాలో భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే....

 ‘ప్రజలకు మేలు చేసే ఒక మంచి పని కోసం ఎంపీ చేత రాజీనామా చేయించి, అందువల్ల ఉప ఎన్నికలు వచ్చి ఉంటే శభాష్ ముఖ్యమంత్రి అని మనందరం సంతోషపడేవాళ్లం. ఇదే వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు దళిత ఎమ్మెల్యేలు ఉన్నా వాళ్లకు మాత్రం మంత్రి పదవులు ఇవ్వరట. ఎంపీ చేత రాజీనామా చేయించి మరీ మంత్రి పదవి ఇవ్వడం వల్లే ఈ ఉప ఎన్నికలు వచ్చాయి. తాను కోరుకున్న వ్యక్తి  తన మంత్రి మండలిలో ఉండాలని కేసీఆర్ గారు మోజు పడ్డారు. అందుకే ఆయన మిమ్మల్ని ఓటు అడగటానికి వస్తే  ఉప ఎన్నికలకు ఇదా కారణం అని గట్టిగా నిలదీయండి..

 పేదవాని గోడు అరణ్యరోదనా..?
 పేదరికం అంటే ఏమిటో తెలుసా? పేదవాడు ఎందుకు అప్పుల పాలు అవుతాడనే ఆలోచన చేశారా అని ముఖ్యమంత్రిని అడగండి.. పేదవాడు అప్పుల పాలు కావడానికి ప్రధానంగా రెండు కారణాలుంటాయి. ఒకటి అనారోగ్యం. రెండోది పెద్ద చదువులు. పేదవానికి హఠాత్తుగా ఏమైనా పెద్ద జబ్బు చేస్తే ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోతుంది. నూటికి రూ 2, నుంచి రూ 5 వడ్డీ అయినా ఫర్వాలేదని చెప్పి లక్షలు అప్పుచేసి వైద్యం చేయించుకుని పేదవాడు అప్పుల పాలైపోతాడు. అందుకే వైఎస్సార్ గొప్పగా ఆలోచన చేసి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా  108 నెంబర్‌కు ఫోన్ కొడితే...20 నిమిషాల్లో పేదవాని ఇంటికి వెళ్లి రోగిని తీసుకొని పోయి పెద్దాసుపత్రిలో వైద్యం చేయించే విధంగా ఆరోగ్య శ్రీ పథకాన్ని అమల్లోకి తెచ్చారు.

ఇవాళ కేసీఆర్ వస్తే అడగండి..! వైఎస్సార్ చనిపోయి ఆరేళ్లు అవుతోంది. ఆయన ఆరోగ్య శ్రీ పథకం పెట్టి  ఎనిమిదేళ్లు దాటుతోంది. మీ ప్రభుత్వం వచ్చి 18 నెలలవుతున్నా ఇవాళ్టికి కూడా ఒక్క కొత్త అంబులెన్స్‌ను కూడా ఎందుకు తేలేకపోయారు కేసీఆర్ గారూ అని ప్రశ్నించండి. ఇప్పటికీ అవే పాతబడ్డ అంబులెన్స్‌లు, వాటికి కనీసం టైర్లు మార్చడానికి కూడా గత్యంతరం లేని పరిస్థితులు ఉన్నాయి. అంబులెన్స్‌ల్లో పని చేసే సిబ్బంది జీతాలు అడిగితే పట్టించుకునే నాథుడు లేడు.  జీతాలు పెంచాలని ఆశా వర్కర్లు 77 రోజులుగా సమ్మెలు చేస్తుంటే వాళ్లను కనీసం పలుకరించే నాధుడు కూడా లేడు. అయ్యా..!  మీ పరిపాలన ఇంత దారుణంగా ఉందని కేసీఆర్‌కు చెప్పండి.

 గత ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల మాటేమిటి?
 పేదవాని బిడ్డ డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్‌లాంటి పెద్ద చదువులు చదివినప్పుడే ఆ పేదరికం పోతుందని,  పేదవాడు అప్పుల పాలు కాకుండానే పెద్ద చదువులు చదవాలనే ఆలోచనతో ఫీజు రీఎంబర్స్‌మెంటు పథకాన్ని వైఎస్సార్ అమల్లోకి తెచ్చారు.  ఈ సంవత్సరం సంగతి దేవుడెరుగు.. గత ఏడాది(2014-15)కి సంబంధించి రూ.2,452 కోట్ల మేర ఫీజు రీఎంబర్స్‌మెంటుకు కావాల్సి ఉంటే  వాటిలో ఇంకా రూ.1,530 కోట్ల మేర బకాయిలుగా ఎందుకున్నాయి అని కేసీఆర్‌ను గట్టిగా నిలదీసి అడగండి. ఈ ఏడాది కాలేజీలు మొదలై  ఐదు నెలలు గడిచిపోయాయి. పాత బకాయిలే ఇంకా మిగిలి ఉన్నాయి.

నాలుగో సంవత్సరం పూర్తయినా కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులకు ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు. ప్రభుత్వం ఫీజులు కట్టలేదు.. మీరు ఫీజు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని విద్యార్థులకు యాజమాన్యం చెప్తోంది. ఇదేనా మీ పరిపాలన అని కేసీఆర్‌ను గట్టిగా నిలదీయండి. డబుల్ బెడ్‌రూం ఇళ్లు ప్రారంబిస్తున్నట్లు పేపర్లో అట్టహాసంగా ఇచ్చిన ప్రకటనలు చూశాం. కేసీఆర్ హైదరాబాద్‌లో ఎన్ని ఇళ్లు ప్రారంభించారో తెలుసా?  కేవలం 396 ఇళ్లు మాత్రమే.  18 నెలల కాలంలో ఇవేనా మీరు కట్టించిన కొత్త ఇళ్లు అని కేసీఆర్‌ను అడగండి. దేశం మొత్తం మీద 48 లక్షల ఇళ్లు కట్టిస్తే.. వైఎస్సార్ ఒక్కడే తెలుగు రాష్ట్రాల్లో 48 లక్షల ఇళ్లు కట్టి చూపించి దేశంతో పోటీ పడ్డారు. ఆ విషయాన్ని కేసీఆర్‌కు గుర్తుచేయండి.

ఇంకా ఈ కార్యక్రమంలో  వైఎస్సాఆర్‌సీపీ శాసనసభా పక్ష నాయకుడు పాయం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ప్రోగాం సమన్వయకర్త తలశిల రఘురాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు  ఎడ్మ కిష్టారెడ్డి, ఎ.రెహ్మాన్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, కె.శివకుమార్, గాదె నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, ఇరుగు సునీల్‌కుమార్, కె.అచ్చిరెడ్డి, రాష్ట్ర నాయకులు భీష్వ రవీందర్, వెల్లాల రామ్మోహన్, శ్రీనివాస్‌రెడ్డి, డి.గోపాల్‌రెడ్డి, ఎం.శ్యాంసుందర్‌రెడ్డి, ఎం.భగవంత్‌రెడ్డి, పీ రాంరెడ్డి, బంగి లక్ష్మణ్, సుమిత్‌గుప్తా, వరంగల్‌జిల్లా నేతలు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, జి.శివ, ఐ.వెంకటేశ్వర్ర్రెడ్డి, వేముల శేఖర్‌రెడ్డి, కమల్‌రాజ్, ఎం.కళ్యాణ్‌రాజ్, కె.నరేందర్‌రెడ్డి  మెదక్‌జిల్లా నాయకులు నర్రాభిక్షపతి, గౌరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, సంజీవ్‌రెడ్డి, సంజీవరావు, జగదీశ్వర్, కరీంనగర్ జిల్లా నేతలు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, శ్రీనివాసరావు, అజయ్‌వర్మ,  నిజామాబాద్ జిల్లా నుంచి సిద్దార్థరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 షాక్ కొడుతున్న నిత్యావసరాలు
 కేసీఆర్ గెలిచి 18 నెలలు అయింది. ఈ 18 నెలల కాలంలో మీరు ఎప్పుడైనా మార్కెట్‌కు వెళ్లారా అని కేసీఆర్‌ను అడగండి. అక్కడ సరుకులు ఎప్పుడైనా కొన్నారా అని  అడగండి. ఇవాళ మార్కెట్‌కు వెళ్లి కంది పప్పు కొనాలంటే కిలో కంది రూ 230 ఉంది. గత ఏడాది ఇదే కందిపప్పు రూ.70లకే వచ్చేది. మినప్పప్పు రూ. 170 నుంచి రూ. 200 ఉంది గత ఏడాది రూ 85 ఉంది. టమోట చూసుకుంటే ఇవాళ కేజీ రూ 50. గత ఏడాది రూ. 14లకే దొరికేది. ఇలా నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే ఎట్లా కొనాలి కేసీఆర్ గారూ ఇదేనా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు నడిపే తీరు అని నిలదీయండి. ఒక వైపేమో రైతుకు కనీస మద్దతు ధర కూడా దొరకటం లేదు, వరి అమ్ముకోవాలంటే కనీస మద్దతు ధరకంటే రూ 200 తక్కువగా ఇస్తున్నారు.  ఇంకో వైపేమో వినియోగదారులకు మార్కెట్‌లో ధరలు షాక్‌కొట్టేటట్టున్నాయి.

 రైతుల బాధలు పట్టవా..?
 కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క వరంగల్‌జిల్లాలోనే 150 మంది రైతులు చనిపోయారు. అంతమంది రైతులు ఎందుకు చనిపోయారని కేసీఆర్‌ను అడగండి. పత్తి పొలాల్లోకి ఒక్కసారి అడుగుపెట్టాలని, రైతులు పడుతున్న బాధలు చూడాలని ముఖ్యమంత్రిని అడగండి.  కల్లాల నుంచి పత్తిని తీసుకొని పోతే కొనే నాథుడే లేడు. కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ 4,100 అని చెప్తారు కానీ ఆ కోత, ఈ కోత పెట్టి  రైతులకు మాత్రం రూ.3,500లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. వైఎస్‌ఆర్ పరిపాలనలో క్వింటాల్ పత్తి రూ 6,700లకు పలికిన విషయాన్ని కేసీఆర్‌కు గుర్తుచేయండి. ఎందుకయ్యా మీరు పట్టించుకోవటం లేదు. ఎందుకయ్యా సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేయించడం లేదని  నిలదీయండి. ప్రతి దళితునికి  3 ఎకరాల భూమి ఇస్తానని ఎన్నికల ముందు కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ 18 నెలల పాలనలో ఎన్ని ఎకరాలు దళితులకు పంచావయ్యా అని గట్టిగా కేసీఆర్‌ను నిలదీయండి. 18నెలల్లో ఆయన పంచింది కేవలం 1,600 ఎకరాలే. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20.60 లక్షల ఎకరాలు పేదలకు పంపిణీ చేసిన విషయం  కేసీఆర్‌కు అర్థం అయ్యేలా చెప్పండి.

 ఓటడిగే హక్కు మాకే ఉంది..
  కాంగ్రెస్‌పార్టీకి ఓటేయకూడదు. ఎందుకంటే... అవసరం ఉంటే వాళ్లు ఒక నేతకు దండలు వేస్తారు, అవసరం తీరాక అదే నేత మీద బండలు వేస్తారు. వైఎస్సార్ బతికి ఉన్నంతకాలం కాంగ్రెస్‌పార్టీ కోసం కష్టపడ్డారు. కాంగ్రెస్‌పార్టీకి ప్రాణం పోశారు. అదే నేత చనిపోయిన తరువాత చెడ్డవాడు అయిపోయాడు. ఆయన కొడుకు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టాడు అనే ఒకే ఒక్క కారణంతో వైఎస్సార్ కుటుంబాన్ని జైలుకు పంపించడానికి కూడా వెనుకాడని పార్టీ అది. వైఎస్ వంటి నాయకుణ్ణే ఇంత దారుణంగా ఇబ్బంది పెట్టిన పార్టీకి ఇక ప్రజలు ఒక లెక్కనా?  చంద్రబాబు నాయుడు బీజేపీకి ఓటు వేయమని అడిగితే ఆయనకూ చెప్పండి, పక్కనే మీ ప్రభుత్వం నడుస్తోంది. 18 నెలలుగా మేం రోజూ చూస్తున్నాం. మీరు మా కేసీఆర్ కంటే ఇంకా దారుణమైన అబ ద్ధ్దాలు చెప్తున్నారని చంద్రబాబును నిల దీయండి.

వెన్నుపోటు, మోసం, అబద్దాలు అనే పునాదుల మీదనే చంద్రబాబు ప్రభుత్వం నడుస్తోంది. బీజేపీ వాళ్లను కూడా మీకు ఎందుకు ఓటెయ్యాలని అడగండి. విభజన సందర్భంగా రెండు రాష్ట్రాలకు సంబంధించి అనేక హామీలు ఇచ్చారు. వాటిలో కనీసం ఒక్కటైనా నెరవేర్చారా? అని గట్టిగా నిలదీయండి. ఒకే ఒకమాట చెప్తున్నా..!  నిజంగా ఓటు అడిగే హక్కు ఏ పార్టీకైనా ఉంది అంటే అది ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి మాత్రమేనని గట్టిగా చెబుతున్నా. కారణం ఆ దివంగత నేత వైఎస్సార్ ప్రతి మనిషికి...ప్రతి కుటుంబానికి..ప్రతి గ్రామానికి..ప్రతిమండలానికి...ప్రతి జిల్లాకు మంచి చేశారు. ప్రతి గుండె చప్పుడు విన్న వ్యక్తి వైఎస్సార్. అందుకే ఆ మహానేత సువర్ణయుగాన్ని మనం మళ్లీ తెచ్చుకుందాం. అందుకే ఆ పాలన రావాలంటే ఫ్యాను గుర్తుకే ఓటు వేయాలి అని మీ అందరినీ కోరుతున్నా’ అని జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Share this article :

0 comments: