పార్టీని అన్ని స్థాయిల్లో పటిష్టం చేయాలని నిర్ణయం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పార్టీని అన్ని స్థాయిల్లో పటిష్టం చేయాలని నిర్ణయం

పార్టీని అన్ని స్థాయిల్లో పటిష్టం చేయాలని నిర్ణయం

Written By news on Sunday, November 15, 2015 | 11/15/2015


ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండి
♦ కర్నూలు వైఎస్సార్‌సీపీ నేతలతో వైఎస్ జగన్
♦ పార్టీని అన్ని స్థాయిల్లో పటిష్టం చేయాలని నిర్ణయం
♦ చంద్రబాబు సీమ, ఉత్తరాంధ్రను విస్మరిస్తున్నారు: బుడ్డా
♦ అమరావతి చుట్టూనే అభివృద్ధిని కేంద్రీకరిస్తున్నారు: ఎస్వీ

 సాక్షి, హైదరాబాద్ : ఏడాదిన్నర టీడీపీ ప్రభుత్వం పాలనలో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు నిచ్చారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో కర్నూలు జిల్లా నేతలతో సమావేశమై పార్టీ పరిస్థితిని, అక్కడ స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సమీక్షించారు. సమీక్షలో జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీ, అసెంబ్లీ నియోజకవ ర్గాల పార్టీ ఇంచార్జిలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకిచ్చిన వాగ్దానాలు వేటినీ నెరవేర్చలేక పోయారని, అందువల్ల రైతులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారనే విషయం సమావేశంలో చర్చకు వచ్చింది. పార్టీని గ్రామ, మండల స్థాయి నుంచీ జిల్లా వరకూ పటిష్టం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

 సీమకు తీరని అన్యాయం: బుడ్డా రాజశేఖర్‌రెడ్డి
 చంద్రబాబునాయుడు రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తున్నారని కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి విమర్శించారు. సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి పదవి చేపట్టాక చంద్రబాబు కర్నూలుకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. రాయలసీమకు సాగునీటి ప్రయోజనాలను అందించే పోతిరెడ్డిపాడు, ఎస్‌ఆర్‌బీసీ, ఓర్వకల్ రిజర్వాయర్, హంద్రీ-నీవా స్టేజ్ 1 పూర్తి కాలేదని చెప్పారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి మట్టం 854 అడుగుల సామర్థ్యం మేరకు నిల్వ చేసే విషయంలోనూ, కేసీ కెనాల్ అంశంలోనూ తమకు అన్యాయమే జరుగుతోందని తెలిపారు. పట్టిసీమ పేరు చెప్పి ప్రజాధనాన్ని ఇష్టానుసారం దోచుకున్నారే తప్ప కృష్ణా డెల్టాకు చుక్క నీరివ్వకుండా పైర్లను ఎండబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు చంద్రబాబుకు కృష్ణా, గుంటూరు జిల్లాలు తప్ప ఇతర వెనుకబడిన జిల్లాలు కనిపిస్తున్నాయా? అని ప్రశ్నించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలను ఎందుకు విస్మరిస్తున్నారు? అని నిలదీశారు.

 అభివృద్ధిని వికేంద్రీకరించాలి: ఎస్వీ
 అమరావతి చుట్టూనే చంద్రబాబు అభివృద్ధి చేస్తున్నారనే భావన రాష్ట్ర ప్రజల్లో ఉందని, తాము అభివృద్ధి వికేంద్రీకరణను కోరుకుంటున్నామని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి చెప్పారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఏడు జిల్లాలు వెనుకబడి ఉన్నాయని వాటికి ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామని విభజన సమయంలో కేంద్రం ప్రకటించినా చంద్రబాబుకు మాత్రం ఈ జిల్లాలు కనిపించడం లేదని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ అంటే చంద్రబాబుకు భయం పట్టుకుందని అందుకే తిరుపతిలో సమావేశం పెట్టి ప్రతిపక్షాన్ని ఎలా ఎదుర్కోవాలా? అని టీడీపీ నేతలు, పార్టీ శ్రేణులకు శిక్షణ నిస్తున్నారని ఎద్దేవా చేశారు. జిల్లాల వారీగా అభివృద్ధి గురించి చర్చించడానికి టీడీపీ నుంచి చంద్రబాబు వస్తే తమ వైపు నుంచి జగన్ వస్తారని సవాల్ విసిరారు. అంతకు కింది స్థాయి నాయకులొస్తే తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలం వస్తామని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చర్చకు రమ్మని టీడీపీ వారు కోరడమే తప్ప ఎవరు వస్తారు? చర్చా వేదిక ఎక్కడ? అనే విషయాలేమీ చెప్పడం లేదని ఆయన విమర్శించారు.
Share this article :

0 comments: