'ప్రాణహిత, పోలవరం వెంటనే చేపట్టాలి' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'ప్రాణహిత, పోలవరం వెంటనే చేపట్టాలి'

'ప్రాణహిత, పోలవరం వెంటనే చేపట్టాలి'

Written By news on Friday, July 6, 2012 | 7/06/2012

రాష్ట్రంలో రైతుల కష్టాలను శాశ్వతంగా తీర్చే ప్రాణహిత-చేవెళ్ల, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణాన్ని తక్షణం చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ అధ్యక్షతన జరిగిన కేంద్ర పాలక మండలి, కార్య నిర్వాహక మండలి, ప్రజా ప్రతినిధుల, అనుబంధ సంఘాల విస్తత సమావేశంలో ఈ మేరకు ఒక తీర్మానం ఆమోదించారు. రైతాంగం సమస్యలను పరిష్కరించడంలో కిరణ్ సర్కారు ఘోరంగా విఫలమైందని మరో తీర్మానంలో పేర్కొన్నారు. విత్తనాలు, ఎరువుల ధరలు పెరిగి పోతున్నాయనీ కనీస మద్దతు ధర మాత్రం పెరగడం లేదనీ సమావేశం అభిప్రాయపడింది. ఇబ్బందుల వల్ల గత ఏడాది మాదిరిగానే రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితులు నెలకొన్నాయనీ తక్షణం ప్రభుత్వం జోక్యం చేసుకుని నివారించాలని సమావేశం డిమాండ్ చేసింది. పోలవరం ప్రాజెక్టుకు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో టెండర్లు వేస్తే ఆ తరువాత రోశయ్య వచ్చి రద్దు చేశారనీ ఇపుడు నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం రెండుసార్లు టెండర్లు పిలిచి ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉంచిదని విమర్శించింది. సమావేశం ముగిసిన అనంతరం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకష్ణ, సభ్యులు డి.ఏ.సోమయాజులు విలేకరుల సమావేశంలో తీర్మానాల వివరాలను వెల్లడించారు.

వై.ఎస్ 63వ జయంతి అయిన ఈ నెల 8వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు నివాళులర్పించి ఆ తరువాత రైతులు, రైతు కూలీల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వినతి పత్రాలను ఆయన విగ్రహాలకు అంద జేస్తారని అన్నారు. వై.ఎస్ ప్రభుత్వం గతంలో రైతుల పాలిట ఆపద్బంధువుగా ఉండేదనీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేకుండా పోయాయని వివరించారు. వై.ఎస్ విగ్రహాలకు సమర్పించే వినతి పత్రంలో రైతు సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వానికి జ్ఞానోదయాన్ని కలిగించాల్సింది ప్రార్థిస్తామని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయమై నిర్ణయం తీసుకునే అధికారాన్ని అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డికి అప్పగిస్తూ ఒక తీర్మానం చేశామని వారు వివరించారు. అధికార, ప్రతిపక్షాలు, సీబీఐ ద్వారా కుట్ర పన్ని జగన్‌ను జైలుకు పంపిన దరిమిలా ప్రచార బాధ్యతలు చేపట్టి ఒంటి చేత్తో ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలపించినందుకు సమావేశం విజయమ్మను అభినందించిందని వివరించారు. అంతే కాదు, వైఎస్సార్ కాంగ్రెస్‌పై అంచంచల విశ్వాసంతో ఓట్లేసి జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు పొందిన శక్తిగా ఎదిగేందుకు దోహదం చేసిన రాష్ట్ర ప్రజలకు ఒక తీర్మానంలో హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపామని తెలిపారు. 

త్వరలో జరుగ గలవని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వచ్చే మూడు నెలల్లో పోలింగ్ బూత్, గ్రామ, మండల స్థాయి కమిటీలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని కూడా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలి పరిణామాల్లో పార్టీ నిర్మాణ కార్యక్రమం కొంత మందకొడిగా సాగిన మాట వాస్తవమేననీ అయితే ఇకపై విజయమ్మ నాయకత్వంలో పార్టీని ముందుకు తీసుకెళతామని వారన్నారు. ఓదార్పుయాత్రను జగన్ జైలు నుంచి వచ్చాకే పూర్తి చేస్తారని విజయమ్మ స్వయంగా వెల్లడించారనీ అయితే పార్టీకి సంబంధించిన బాధ్యతలు మాత్రం పూర్తి స్థాయిలో ఆమే చూసుకుంటారని పేర్కొన్నారు. ఎక్కడ ప్రజలకు ఆపద వచ్చినా విజయమ్మ పరామర్శించి వారికి అండగా నిలిచే యత్నం చేస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేట, విశాఖపట్టణం ఉక్కు ఫ్యాక్టరీ ప్రమాదం, ఎన్టీపీసీ థర్మల్ నిర్వాసితుల భాధితులను ఆమె పరామర్శించారని అన్నారు. వై.ఎస్ మరణం వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు అనేక అనుమానాలున్నాయనీ అందువల్ల సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సమావేశం కోరింది.

చేనేత కార్మికుల ఇక్కట్లు పరిష్కరించడంలోనూ వారి ఆత్మహత్యలు నివారించడంలోనూ, మత్స్యకారుల సమస్యల పరిష్కారంలోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సమావేశం విమర్శించింది. అంతే కాదు, గిరిజనులను పట్టించుకున్న పాపాన పోవడం లేదనీ ఇది వరకటి టీడీపీ పాలనలో మాదిరిగానే పదిరికుప్పం, కారంచేడు, చుండూరు సంఘటనలు పునరావతం అవుతూ ఉండటం పట్ల సమావేశం తీవ్రంగా ఖండించింది. రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షం మ్యాచ్ ఫిక్సింగ్‌తో పనిచేయడమే కాదు, కిరణ్ పరిపాలనా తీరు కూడా టీడీపీ మాదిరిగానే ఉందని కొణతాల, సోమయాజులు వ్యంగంగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర రెవెన్యూ అభివృద్ధి (రాబడి)గతంలో ఎన్నడూ లేని విధంగా 25 శాతం పెరిగినా సంక్షేమ పథకాలను మాత్రం పూర్తి నిర్లక్ష్యం చేసిందని వారు విమర్శించారు.
Share this article :

0 comments: