విత్తనాలపై సర్కార్ నిర్లక్ష్యం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విత్తనాలపై సర్కార్ నిర్లక్ష్యం

విత్తనాలపై సర్కార్ నిర్లక్ష్యం

Written By news on Friday, July 6, 2012 | 7/06/2012


- సాగుపై నీలినీడలు
- విత్తనాలపై సర్కార్ నిర్లక్ష్యం
- రైతన్నల పడిగాపులే
- మార్కెట్‌లో నకిలీ విత్తనాల జోరు
- మరోవైపు తీవ్ర వర్షభావం

కరీంనగర్, న్యూస్‌లైన్: తెల్లబంగారాన్ని (పత్తి) నమ్ముకున్న రైతన్నకు తిప్పలు తప్ప డం లేదు. బీటీ విత్తనాల కోసం వారు తల్లడిల్లుతున్నారు. విత్తులు విత్తే అదను మరో పక్షం రోజులే మిగిలి ఉండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఒకవైపు కురవని వర్షాలు, మరోవైపు విత్తనాలు దొరకని పరిస్థితి నెలకొనడం పత్తిసాగుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఖరీఫ్ సీజన్‌కు సాగుకు సరిపడా విత్తనాలు తెప్పించడంలో, రైతులు కోరుకుంటున్న బీటీ విత్తనాలు అందించడంలో ప్రభుత్వం చేతులెత్తేసింది.

రాష్ట్రంలో మొత్తం మీద పత్తి సాగు సాధారణ విస్తీర్ణం 30 లక్షల హెక్టార్లు కాగా, అందులో తెలంగాణలోని ఐదు జిల్లాలోకలిపి 40 శాతం వరకు ఉంటుంది. అయితే, మూడేళ్ల నుంచి సాధారణ సాగు విస్తీర్ణం కంటే ప్రతి సీజన్‌లో 25 శాతం అధికంగా సాగవుతూ వస్తోంది. ఈ సీజన్‌లో కేవలం కరీంనగర్, ఆదిలాబాద్,వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కలిపి మొత్తం 13.90 లక్షల హెక్టార్లకు పైగా పత్తి సాగు కావచ్చని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు.

ఇందుకోసం సుమారు 68.32 లక్షల వరకు పత్తి ప్యాకెట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. కానీ, అందులో ఇప్పటివరకు 43.51 లక్షల ప్యాకెట్లు సరఫరా జరి గినా ఫలితం లేకుండా పోయింది. వివిధ రకాల కంపెనీలకు చెందిన విత్తనాలు కావడంతో వాటిపై రైతులు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. అత్యధికంగా మక్కువ చూపే మహికో కంపెనీ విత్తనాల ప్యాకెట్లు సుమారు ఆరు లక్షల వరకు అవసరమవుతాయని అధికారులు ప్రతిపాదనలు చేసినప్పటికి ఆ మేరకు సరఫరా కాలేదు. మొత్తం మీద మహికో కంపెనీకి చెందిన విత్తనాల ప్యాకెట్లు కనీసం 30 శాతం కూడా సరఫరా కాలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

మహికోపై మక్కువ

బీటీ పత్తి విత్తనాల విషయానికి వస్తే కొన్ని కంపెనీల విత్తనాలనే రైతులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం మహికో, మల్లిక కంపెనీ విత్తనాలపై అధికంగా మక్కువ చూపుతున్నారు. దీంతో ఈ విత్తనాలకు మార్కెట్‌లో బాగా డిమాండ్ పెరుగడంతో కంపెనీ డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. మహికో, మల్లిక విత్తనాలపై అధిక మక్కువచూపడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి పెట్టుబడి తక్కువగా ఉండడం, దిగుబడి దండిగా రావడం, పత్తి ఎరే సమయంలో సైతం తక్కువ కూలీతో పంట చేతికి వస్తుందన్న భావన రైతుల్లో బలంగా నాటుకుంది. దీంతో రైతులు ఈ విత్తనాలనే అధికంగా కోరుకుంటున్నారు. కరీంనగర్ జిల్లాకు రెండు లక్షల ప్యాకెట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపించగా అందులో 72 వేల ప్యాకెట్లు కేటాయించి కేవలం 50 వేల ప్యాకెట్లు మాత్రమే సరఫరా చేశారు. మరో 22 వేల ప్యాకెట్లు రావాల్సి ఉంది.

అదేవిధంగా వరంగల్ జిల్లాలో ఆరు లక్షల ప్యాకెట్లు అవసరమని ప్రతిపాదనలు పంపించగా, ప్రభుత్వం 2.86 లక్షల ప్యాకెట్లను కేటాయించింది. కంపెనీ నుంచి మాత్రం కేవలం 1.35 లక్షల ప్యాకెట్లు మాత్రమే సరఫరా అయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాకు 73 లక్షల ప్యాకెట్లు కేటారయించి అందులో 34వేల ప్యాకెట్లు మాత్రమే సరఫరా చేసింది. నల్లగొండ జిల్లా విషయానికస్తే మాత్రం 72 వేల మహికో ప్యాకెట్ల కేటాయించి 50వేలతో సరిపుచ్చారు. ఖమ్మం జిల్లాలో రైతులకు అవసరమైన నీరజ, బ్రెంట్ విత్తనాలు కేవలం 87వేల ప్యాకెట్లు మాత్రమే సరఫరా చేశారు.

బ్లాక్‌లో బీటీ...

బీటీ విత్తనాలు బ్లాక్ మార్కెట్‌లో రాజ్యమేలుతున్నాయి. ప్రభుత్వ అసమర్థత కారణంగా రైతన్న గత్యంతరం లేక నిలువు దోపీడీకి గురవుతున్నారు. ప్రైవేటు కంపెనీల డీలర్లు, వ్యాపారస్తులు కుమ్మక్కై ఇష్టారాజ్యంగా డిమాండ్ ఉన్న విత్తనాలను అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో రూ.930ల ధరల గల 450 గ్రాముల బీటీ విత్తనాల ప్యాకెట్ రెండు వేల నుంచి రూ.2,500 వరకు పలుకుతుంది. నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం విత్తనాలు తెప్పించడంలో వ్యవసాయశాఖ విఫలమైన కారణంగా వ్యాపారుల కృత్రిమ కొరత అనివార్యమైంది.

దీంతో వచ్చిన అరకొర ప్యాకెట్లను లాటరీ లేదా పర్మిట్‌ల పద్ధతి ద్వారా పోలీసు పహరాలో రైతులకు అందించే దుస్థితి నెలకొంది. వాస్తవంగా మహికో, మల్లిక కంపెనీకి చెందిన నీరజ, కనక్, డాక్టర్ బ్రాంట్ రకాల విత్తనాలకు సరిహద్దు రాష్ట్రాల్లో పెద్దగా కొరత లేదు. అక్కడ ప్రైవేట్ కంపెనీల నుంచి రైతులను కాపాడేందుకు ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేట్టింది. గరిష్ట ధర నిర్ణయించి అమలు చేస్తోంది. దీంతో మహారాష్ట్రలో మహికో కంపెనీ పత్తి విత్తనాలను అక్కడి రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే లభిస్తున్నాయి.

మాడుతున్న పత్తి విత్తులు

ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ సాధారణ వర్షాలు కురవకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అడుగంటిన భూగర్భజలాలు, వర్షాల లేమి ఆందోళన కలిగిస్తోంది. సీజన్ ప్రారంభమైన ఐదురోజుల తర్వాత ఆలస్యంగా ప్రవేశించిన రుతుపవనాల ప్రభావంతో పక్షం రోజుల తర్వాత వరసగా మూడురోజుల పాటు వర్షాలు కురిసి ముఖం చాటేశాయి. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో తొలకరి వర్షాలకు తడిసిన భూమిని నమ్ముకుని విత్తిన విత్తులు మొలకెత్తక మాడిపోతున్నాయి. దీంతో పెట్టిన పెట్టుబడి వృథా కాకుండా రైతులు ట్యాంకర్లు తెప్పించుకుని పొలాన్ని తడిపే ప్రయత్నం చేస్తున్నారు.

రెండురోజుల క్రితం విత్తనాలు మొలకెత్తక ఏకంగా ఆదిలాబాద్ జిల్లా బేల మండలం జూనోని గ్రామానికి చెందిన పత్తిరైతు కోటరంగే బాబుషా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీజన్ ప్రారంభమైన నాటినుంచి ఇప్పటి వరకు కరీంనగర్‌లో 46 శాతం, ఆదిలాబాద్‌లో 51 శాతం వర్షపాతం నమోదు కాగా, నల్లగొండలో 18 శాతం, వరంగల్‌లో మూడు శాతం, ఖమ్మంలో తొమ్మిది శాతం మాత్రమే నమోదైంది. పత్తి పంటకు మరో పక్షం రోజులే అదను ఉండడంతో వర్షాల కోసం రైతన్నలు శతకోటి దేవుళ్లకు పూజలు, పునస్కారాలు చేస్తున్నారు.

విత్తు మొలకెత్తలేదని..

మంథని : వరుణుడు ముఖం చాటేయడంతో విత్తిన పత్తి విత్తనాలు మొలకెత్తడం లేదు. అప్పో సప్పో చేసి పెట్టిన పెట్టుబడులు కళ్లెదుటే ఆవిరైపోతుండడంతో ఆ అన్నదాతకు ఓ ఆలోచన తట్టింది. మంథని మండలం నాగారం గ్రామానికి చెందిన రైతు చిప్ప రాజబాబు ఐదెకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తి విత్తాడు. విత్తనాలు వేసి పదమూడు రోజులు గడుస్తున్నా వర్షాలు కురువకపోవడంతో మొలక బయటకు రాలేదు.

దీంతో ఆ రైతు రెండు రోజులుగా తన కుటుంబసభ్యులతో కలసి విత్తనాలను ఏరుతున్నాడు. నాలుగు ప్యాకెట్లు చేలో వేయగా ఒక్క ప్యాకెట్ మేర విత్తనాలు లభించాయి. కొన్ని మందగించి అక్కరకు రాకుండా పోయాయని రాజబాబు తెలిపాడు. కేవలం ఒకే ఒక విత్తనప్యాకెట్ లాటరీలో దక్కిం దని, మిగిలినవి రూ. 8 వేలు వెచ్చించి కొనుగోలు చేశానని ఆయన వివరించాడు. కాసిన్ని డబ్బులైనా మిగులుతాయని ఇలా చేశానని ఆయన ‘న్యూస్‌లైన్’తో అన్నాడు.

Share this article :

0 comments: