పాలకులపై మండిపడ్డ ప్రజానీకం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పాలకులపై మండిపడ్డ ప్రజానీకం

పాలకులపై మండిపడ్డ ప్రజానీకం

Written By news on Sunday, December 2, 2012 | 12/02/2012


వైఎస్ తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి వస్తేనే తమ బతుకులు బాగుపడతాయన్న జనం
బీటీ పత్తి కంపెనీలు మళ్లీ రెచ్చిపోతున్నా.. ఈ పాలకులకు పట్టడం లేదు: పత్తి రైతులు
మాకు ఉన్న ఒక్క ఆసరానూ తీసేస్తున్నారు: వికలాంగులు
గిట్టుబాటు ధర ఇవ్వాలని అడిగితే నేరస్తులమని జైల్లో పెట్టించారు: ఆముదాల రైతులు
కార్మికుల సమస్యలు ఈ పాలకులకు పట్టడం లేదు: బీడీ కార్మికులు
ఇన్ని సమస్యలు చూస్తూ కూడా ప్రభుత్వంపై చంద్రబాబు అవిశ్వాసం పెట్టనంటున్నారు: షర్మిల
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శనివారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 45, కిలోమీటర్లు: 624.50

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘వైఎస్సార్ బతికున్నప్పుడు తోక ముడిచిన బీటీ విత్తన కంపెనీలు ఇప్పుడు జూలు విదిలించాయి. విత్తనాల ధరలు పెంచి అడ్డంగా దోచుకుంటున్నారు. సర్కారేమో.. పట్టించుకోదు.. జనం పట్టని సర్కారు ఉన్నా ఒకటే పోయినా ఒకటే.’’

‘‘ఎరువులు లేవు.. కరెంటు లేదు.. గిట్టుబాటు ధర లేదు.. గిట్టుబాటు ధర ఇవ్వమని అడిగితే మమ్ములనే నేరస్తులన్నారు.. కేసులు పెట్టారు.. జైలుకు పంపారు.. ఈ పాలన మాకొద్దు.. ’’

‘‘సర్కారోళ్లు పావలా వడ్డీకే రుణాలని చెప్పి తీరా వడ్డీ కట్టబోతే మా నడ్డి విరిచేస్తున్నారు. బ్యాంకు అధికారులు నిలబెట్టి రూ.2.50 వడ్డీలు కట్టించుకున్నారు. ఈ వడ్డీలు మేం కట్టలేం.. ఈ సర్కారు పోవాలి.. జగనన్న రావాలి.’’

ఇడుపులపాయ నుంచి పాలమూరు వరకు కార్మిక లోకమైనా, కర్షక లోకమైనా.. అందరిదీ ఒకటే మాట.. జనం బాధలు పట్టని ప్రభుత్వం తమకు వద్దని, ప్రజలను ప్రాణంగా చూసుకున్న దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు జగన్‌మోహన్‌రెడ్డే కావాలని వారంతా నినదిస్తున్నారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 45వ రోజు శనివారం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో సాగింది. దారి వెంట ప్రజలు ఆమెతో కలిసి కదంతొక్కారు. తమ సమస్యలు, బాధలు ఆమెకు చెప్పుకొన్నారు. జగనన్న రావాలని, తమ కష్టాలు తీరాలని కాంక్షించారు. శనివారం మొత్తం 18.5 కి.మీ. మేర సాగిన షర్మిల పాదయాత్రలో పలు వర్గాల ప్రజలు ఆమెను కలిసి విన్నవించిన కష్టాలు, కన్నీళ్లు అక్షరాల రూపంలో..

దొంగతనంగా అమ్ముకుంటుండ్రు.. 

‘‘చంద్రబాబు ఉన్నప్పుడు అరకిలో బీటీ పత్తి విత్తనాలు సంచికి రూ.1,800 ఉండేది. వైఎస్సారొచ్చి కోర్టుల కలబడి అదే సంచిని రూ.600కే ఇప్పించిండు. ఎన్ని కావాలనుకుంటే అన్ని సంచులు దొరికినయి. ఆ దేవుడు పోయినంకా వచ్చినోళ్లు రూ.950 ఎక్కించిండ్రు. ఊరికి ఐదు, పది సంచులు ఇచ్చి మిగతా సంచులకు దొంగతనంగా రూ.2,000కు అమ్ముకుంటుండ్రు. అంత ధర పెట్టి ఇత్తనాలు కొనలేక దొరికిన ఇత్తనాలు తెచ్చి పెట్టినా.. వైఎస్సార్ బతికి ఉన్నప్పుడు రూ.250 ఉన్న యూరియా ఈ రోజు రూ.850, రూ.300 ఉన్న డీఏపీ ఇయ్యాల రూ.1,250.. అప్పో, సప్పో చేసి సాగు చేసినా కరెంటు లేక పంట పండలేదు. ఎకరాకు 10 క్వింటాళ్లు.. వచ్చే పత్తి ఈ ఏడు 3 క్వింటాళ్లు ఎల్లింది(దిగుబడి వచ్చింది). ఈ పంటతో అప్పులెట్టా కట్టాలి? నేను నా పిల్లలు ఏం తినాలక్కా? నాయిన ఉన్నట్టు లేదక్కా.. అన్న రావాలక్కా.. జగనన్న వస్తేనే అప్పుల నుంచి బయటపడి మా రైతులు బతుకుతారక్కా’’ అని సీసీకుంటకు చెందిన రైతు కుర్మన్న షర్మిలతో అన్నారు. పత్తి తీస్తున్న ఈ రైతును షర్మిల పలకరించినప్పుడు కుర్మన్న పై విధంగా చెప్పుకొని బాధపడ్డారు.

రైతుల మీద కేసులు పెట్టారు.. 

‘‘ఆముదాలు దేవరకద్ర మార్కెట్‌కు తీసుకొనిపోతే క్వింటాల్ ధర రూ.2,500 కూడా పలకలేదక్కా. వైఎస్సార్ ఉన్నప్పుడు ఇవే ఆముదాలు క్వింటాల్‌కు రూ.4,500 పలికింది. గిట్టుబాటు లేకుండా ధాన్యం ఇచ్చేది లేదని అధికారులకు తెగేసి చెప్పినా.. నాకు గిట్టుబాటు కావాలని పట్టుబట్టినా.. ధర్నాకు కూచున్నా.. నాకు మద్దతుగా మిగిలిన రైతులు నిలబడ్డారు. మమ్మల్ని క్రిమినల్స్ అని 40 మంది రైతుల మీద కేసులు పెట్టారు. రెక్కల కష్టానికి గిట్టుబాటు కావాలంటే మమ్ములను ఈ సర్కారు దొంగలని అన్నది.. చంద్రబాబు జమానాల కరెంటు బిల్లులు కట్టలేదని ఆయనొకసారి మమ్ములను జైల్లో పెట్టించాడు. ఈ పాలన ఇంకా ఉంటే మళ్లీ చంద్రబాబు జమానా ఒత్తదక్కా..’’ అని పెదవడ్డెమాన్‌కు చెందిన రైతు ఇంద్రసేనారెడ్డి షర్మిల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

బీడీ ఉత్తర్వు అమలు చేయట్లేదు..

‘‘మా సేతికి తొమ్మిది ఆకుల కట్టలిస్తరు. 1,000 బీడీలు సుట్టాలే.. వెయ్యి బీడీలకు రూ.100 ఇత్తన్నారు. ఆకుల తరుగుబోయి తక్కువ బీడీలు వస్తే మాకు జురుమాన (జరిమానా) ఏస్తరు. నూరు రూపాయలలో రూ.30.. రూ.40 వరకు జురుమాన తీసుకుంటరు. వైఎస్సార్ ఉన్నప్పుడు నిండా నూరు ఇప్పించిండు. కట్టకు రూ.149 కట్టియ్యాలని ఆ దేవుడు సర్కారు ఆర్డరు(జీవో) కూడా ఇప్పించాడు. ఇప్పుడున్న సర్కారు దమ్ము లేక దాన్ని అమలు కానిత్తలేదు. అక్కా... మా మండలంలో 20 వేల కుటుంబాలు బీడీలు సుట్టే బతుకుతం. అందరం జగనన్నకు ఓటేసి గెలిపించుకుంటామక్కా.. అన్న రావాలే.. మా బతుకులు మారాలే’’ అని సీసీ కుంటకు చెందిన గుర్రం లలితమ్మ, గుర్రం భారతమ్మ, కర్నూలు లింగమ్మ, గుర్రం సుజాత, కర్నూలు రోజమ్మ.. షర్మిల వద్ద తమ గోడు చెప్పుకున్నారు.

తప్పు మాట్లాడితే ఇక్కడే సంపండి.. 

‘‘మీ అందరికీ దండం పెట్టి ముసలోణ్ణి చెప్తున్నా.. రాజన్నంత మంచి మనిషి ఎవ్వడూ లేడు. ఈ సర్కారు ఉంటే మనం బతకలేం. నాకు 85 ఏళ్లు. నా తరం అయిపోయింది. ఈ సర్కారు సోర పిల్లగాండ్లను(యువకులను) బతకనీయదు. మన సర్కారు రావాలే.. అందరం కలిసి రాజయ్య కొడుకును నిలబెట్టుకుందాం.. నేను తప్పు మాట్లాడితే నన్ను ఇక్కడే సంపండి’’ అని పెదవడ్డెమాన్‌కు చెందిన 85 ఏళ్ల వృద్ధుడు మమ్మద్ సయ్యద్.. గ్రామస్తుల వద్ద ఉద్వేగంతో చెప్పాడు. కర్ర సహాయంతో మాత్రమే నడవగలిగే ఈయన వైఎస్సార్ కూతురు షర్మిలను చూసేందుకు ఒంట్లో ఉన్న జవసత్వాలను కూడదీసుకొని జనం మధ్యకు వచ్చాడు.

కిరణ్.. నా పింఛను ఊడపీకిండు.. 

‘‘నేను వికలాంగురాలిని.. రాజశేఖరరెడ్డి ఫస్టు సీఎం అయినప్పుడు రూ. 200 పింఛన్ ఇచ్చిండు. మళ్లా వచ్చినప్పుడు రూ. 500 జేసిండు. కిరణ్‌కుమార్‌రెడ్డి సారు వచ్చి నా పింఛన్ ఊడ పీకిండు. నన్ను చూడక్కా.. నాకు 25 ఏళ్లు.. ఐదేళ్ల పిల్లలా లేనా? నేను ఏం పని చేసుకుంటానక్కా.. బుద్ధి లేనోళ్లు సర్కారులో ఉండొద్దక్కా..’’ అని నెల్లికొండి గ్రామంలో వెంకటేశ్వరమ్మ అనే వికలాంగురాలు.. షర్మిల వద్ద కన్నీరు పెట్టింది.

ఈ బియ్యమెట్టా సరిపోతాయి..? 

‘‘కుటుంబానికి 16 కిలోల బియ్యం ఇత్తున్నారు. ఐదుగురం ఉన్న కుటుంబానికి నెలకు 16 కిలోలు సరిపోతాయా? కిరణ్‌కుమార్‌రెడ్డి నెలకు 16 కిలోల బియ్యమే తిని బతుకుతున్నాడా? బయట కిలో బియ్యం రూ.25 ఉన్నయి. ఆయన రూ. 16 రూపాయలు తగ్గించి రూ.100 భారం పెంచిండు. పావలా వడ్డీ అని చెప్తాడు కానీ బ్యాంకుకు పోతే రూ. రెండున్నర వడ్డీ పడుతోంది. ఇదేం సర్కారక్కా.. దీన్ని కూలగొట్టాలక్కా.. జగనన్న వత్తేనే మా బతుకులు బాగుపడ్తాయి’’ అని అల్లీపురం గ్రామానికి చెందిన శ్రీ పాయి ఆంజనేయ మహిళా గ్రూపునకు చెందిన మహిళలు వడ్ల లక్మి, వాకిట మణెమ్మ, సత్తెమ్మ, వెంకటేశ్వరమ్మ అనే మహిళలు షర్మిలతో తమ బాధలు పంచుకున్నారు.


జగనన్న వస్తారు.. రాజన్న రాజ్యం తెస్తారు

ప్రజల బాధలు విన్నాక షర్మిల స్పందిస్తూ.. ‘‘ప్రజలు ఇన్ని సమస్యలతో సతమతమవుతుంటే.. చూస్తూ కూడా చంద్రబాబు.. ఆ ప్రభుత్వంతోనే కుమ్మక్కై దానిపై అవిశ్వాసం పెట్టనంటున్నారు. ప్రాణాలు.. చెలకలు చాలా విలువైనవి. దయచేసి వాటిని పోగొట్టుకోవద్దు.. నిలబడి సాధించుకుందాం. ఒక్క ఏడాది ఓపిక పడితే మీరు కోరినట్టే జగనన్న అధికారంలోకి వస్తారు. మనలను రాజన్న రాజ్యం దిశగా తీసుకొని పోతారు. రాజన్న రాజ్యంలో రైతును రాజులాగా చూసుకుంటారు. గుడిసెలు లేని రాష్ట్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతారు. ప్రతి ఇంటినీ జగనన్న సంతోషంగా ఉంచుతారు’’ అని భరోసా ఇచ్చారు.

పశువుల కోసం 103
‘‘జగనన్న అధికారంలోకి రాగానే గొర్రెలు, పశువులకు వైద్య సేవలు అందించడం కోసం 103 అంబులెన్స్ ఏర్పాటు చేస్తారు’’ అని షర్మిల శనివారం యాత్రలో ప్రకటించారు. మహబూబ్‌నగర్ జిల్లా పెద్ద వడ్డెమాన్ గ్రామానికి చెందిన కురుమూర్తి.. షర్మిలకు గొర్రె పిల్లను బహూకరించిన సందర్భంగా ఆమె ఈ ప్రకటన చేశారు.

sakshi news
Share this article :

0 comments: