మూడింట రెండోవంతు.. మెజారిటీ ఉండాల్సిందే! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » మూడింట రెండోవంతు.. మెజారిటీ ఉండాల్సిందే!

మూడింట రెండోవంతు.. మెజారిటీ ఉండాల్సిందే!

Written By news on Saturday, December 14, 2013 | 12/14/2013

మూడింట రెండోవంతు..  మెజారిటీ ఉండాల్సిందే!వీడియోకి క్లిక్ చేయండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై బీహార్, పంజాబ్ సీఎంలు నితీశ్, బాదల్ ఉద్ఘాటన
 అడ్డగోలు విభజనను అడ్డుకోవడానికి కలసి రావాలంటూ వారికి జగన్ వినతి

శాసనసభ తీర్మానమే లేకుండా, ప్రజల అభిప్రాయంతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం చేస్తున్న యత్నాలను బీహార్, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నితీశ్ కుమార్, ప్రకాశ్ సింగ్ బాదల్ తప్పుబట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాలను తమ ఇష్టానుసారం విభజించడానికి అవకాశం కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను సవరించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల విభజనకు లోక్‌సభ, అసెంబ్లీల్లో సాధారణ మెజారిటీ ఆమోదం కాకుండా.. మూడింట రెండొంతుల మెజారిటీ ఆమోదం తప్పనిసరి చేయాలన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వాదన సమంజసమైందని ఇరువురూ అంగీకరించారు. ఈ విషయంలో జగన్ పోరాటానికి అండగా నిలుస్తామని ఉద్ఘాటించారు.

 ఆర్టికల్ 3 సవరణ కోసం జగన్ జాతీయ స్థాయిలో అన్ని పార్టీల మద్దతు కూడగట్టేందుకు కృషి చేస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలోనే ఆయన తాజాగా శుక్రవారం ఢిల్లీలో ప్రకాశ్ సింగ్ బాదల్‌తో, పాట్నాలో నితీశ్‌కుమార్‌తో భేటీ అయ్యారు. జగన్ ఉదయం 9 గంటలకు ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డి, పార్టీ నాయకులు ఎం.వి.మైసూరారెడ్డి, బాలశౌరితో కలిసి ఢిల్లీ సఫ్దర్‌జంగ్ రోడ్‌లోని బాదల్ నివాసానికి చేరుకున్నారు. ప్రకాశ్‌సింగ్ బాదల్, ఆయన తనయుడు, పంజాబ్ ఉప ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడైన సుఖ్‌బీర్‌సింగ్ బాదల్‌తో జగన్ సమావేశమై అరగంటకుపైగా చర్చలు జరిపారు. అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని పార్టీ బృందం.. బీహార్ రాజధాని పాట్నాలో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌తో భేటీ అయింది. సమావేశంలో నితీశ్‌తో పాటు ఎంపీ అలీ అన్వర్, కొంత మంది మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్ర అడ్డగోలు విభజనను అడ్డుకోవడానికి, ఆర్టికల్-3 సవరణకు మద్దతు ఇవ్వాలని జగన్ బృందం నితీశ్‌కుమార్‌ను కోరింది. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. దాదాపు గంటన్నర పాటు సమావేశం సాగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాలను ఏకపక్షంగా విభజించకుండా నివారించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 సవరణ కోసం తాము సాగిస్తున్న పోరాటంలో కలసిరావాల్సిందిగా ఇద్దరు సీఎంలకు జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనికి నితీశ్‌కుమార్, బాదల్ సానుకూలంగా స్పందించారు. జగన్‌కు అండగా నిలుస్తామని చెప్పారు.

 అడ్డగోలు విభజనకు మేం వ్యతిరేకం: నితీశ్‌కుమార్

 రాష్ట్రాల అడ్డగోలు విభజనకు తాను వ్యతిరేకమని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ తెలిపారు. శాసనసభ తీర్మానం లేకుండా విభజన ప్రక్రియ చేపట్టడం అభ్యంతరకరమని పేర్కొన్నారు. సాధారణ మెజారిటీతో, రాష్ట్ర శాసనసభను విశ్వాసంలోకి తీసుకోకుండా విభజన చేయడానికి అవకాశం కల్పిస్తున్న ఆర్టికల్-3ను సవరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. జగన్‌తో భేటీ అనంతరం ముఖ్యమంత్రి అధికాార నివాసం ‘సంకల్ప్’లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇద్దరు నేతలు మాట్లాడారు. ‘‘రాష్ట్ర శాసనసభను విశ్వాసంలోకి తీసుకోకుండా విభజన చేపట్టడాన్ని, ప్రజాస్వామ్యానికి, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాజ్యాంగంలోని ఆర్టికల్-3ను దుర్వినియోగం చేస్తున్న కేంద్రం తీరును జగన్ వివరించారు. రాష్ట్ర విభజన ప్రక్రియ సాగుతున్న తీరును చెప్పారు. సాధారణ మెజారిటీ(లోక్‌సభలో 272 మంది సభ్యుల బలం) ఉన్న ఏ పార్టీ అయినా రాష్ట్రాల ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా ఏరాష్ట్రాన్నైనా తమ ఇష్టానుసారం విభజించడానికి అవకాశం కల్పిస్తున్న ఆర్టికల్-3ను సవరించాల్సిన అవసరం ఉందని గట్టిగా భావిస్తున్నాను. గతంలో చాలా రాష్ట్రాలను విభజించారు. బీహార్‌ను కూడా విభజించారు. రాష్ట్రాల విభజనకు నేను వ్యతిరేకం కాదు. అయితే ప్రజాస్వామ్యంలో ఉన్న సంప్రదాయాలను పక్కనబెట్టి, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించడాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించం. రాష్ట్ర శాసనసభను విశ్వాసంలోకి తీసుకోవడం, మాతృరాష్ట్ర అభిప్రాయాన్ని గౌరవించడం.. విభజన ప్రక్రియలో ఉన్న సంప్రదాయం. రాష్ట్రాల విభజన వేరే అంశం. కానీ విభజనలో సంప్రదాయాలు పాటించకపోవడం ప్రజాస్వామ్యంలో అంగీకారయోగ్యం కాదు. న్యాయమూ, ఔచిత్యమూ అంతకంటే కాదు. జగన్ చేస్తున్న వాదనలో బలం ఉంది. ఈ విషయం మీద మా పార్టీలో కూడా చర్చిస్తాం. ఈ విషయంలో జగన్‌కు అండగా నిలుస్తాం’’ అని నితీశ్‌కుమార్ వెల్లడించారు. మూడో ఫ్రంట్ గురించి తమ మధ్య చర్చ జరగలేదని విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు.
 
 తీర్మానం తీసుకోవాల్సిందే: బాదల్

 విభజనకు ముందు రాష్ట్రం నుంచి తీర్మానాన్ని తీసుకోవాల్సిందేనని పంజాబ్ సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్ అన్నారు. చర్చల అనంతరం జగన్, సుఖ్‌బీర్‌సింగ్‌తో కలిసి బాదల్ మీడియా ముందుకొచ్చారు. బాదల్‌కు కుడి, ఎడమల్లో నిలబడ్డ సుఖ్‌బీర్, జగన్ చేతిలో చెయ్యేసి ఫొటోలకు పోజిచ్చారు. తనకు ఇటు, అటు యువతరం నాయకులున్నారంటూ ప్రకాశ్‌సింగ్ బాదల్ నవ్వులు చిందించి మాట్లాడుతూ.. ‘‘ఒక విషయమైతే చాలా స్పష్టంగా ఉంది. ఆయన(జగన్) కోరుతున్నది సరైనదేనని నేను భావిస్తున్నాను. ఏ రాష్ట్రాన్నయినా విభజించడానికి ముందు ఆ రాష్ట్రం నుంచి తీర్మానం తప్పకుండా తీసుకోవాల్సిందే. రాష్ట్ర శాసనసభ కనీసం మూడింట రెండొంతుల మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించినపుడే విభజన అంశాన్ని వారు పరిశీలించాలి. పంచాయతీల్లో సైతం.. ఏదైనా చేయడానికి సదరు పంచాయతీ మూడింట రెండొంతుల మెజారిటీతో లేక సాధారణ మెజారిటీతో తీర్మానం చేయాల్సి ఉంటుంది. అయితే మూడింట రెండొంతుల మెజారిటీతో చేయడమే ప్రధానం. అందువల్ల, (రాష్ట్ర విభజన విషయంలో) కేంద్ర ప్రభుత్వం, ఇతర పార్టీలు దీనిపై ఆలోచించాలి’’ అని ఆయనన్నారు.

 గొప్ప తండ్రికి గొప్ప పుత్రుడు...

 మీడియా ముందుకు రాగానే ప్రకాశ్‌సింగ్ బాదల్ ముందుగా జగన్‌ను అభినందిస్తూ మాట్లాడారు. ‘‘నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు రెడ్డి సాబ్ నన్ను, సుఖ్‌బీర్ సింగ్‌ను కలవడానికి ఇక్కడికి వచ్చారు. తను ఓ గొప్ప తండ్రికి ఒక గొప్ప పుత్రుడు. నేను తనను మొదటిసారి కలిశాను. తను కూడా సుఖ్‌బీరేనని కలిసిన వెంటనే నాకనిపించింది(నవ్వుతూ). తను చాలా ఆత్మీయత, అనురాగం కలవాడు’’ అని ఆయన అన్నారు. అవిశ్వాస తీర్మానంపై ప్రశ్నకు బదులిస్తూ, అది వేరే అంశమని వ్యాఖ్యానించారు. ప్రకాశ్‌సింగ్ బాదల్ మాట్లాడిన తర్వాత సుఖ్‌బీర్‌సింగ్ బాదల్, జగన్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని అభినందించి వీడ్కోలు పలికారు.
 
 దేశ చరిత్రలో ఇదే తొలిసారి: జగన్

 ‘‘లోక్‌సభలో 272 మంది ఎంపీల బలం ఉంటే, తమ ఇష్టానుసారం రాష్ట్రాలను విభజించే అధికారం ఆర్టికల్-3 ప్రకారం కేంద్రానికి ఉంది. గతంలో ఎన్నడూ ఆర్టికల్-3 దుర్వినియోగం జరగలేదు. కానీ దేశ చరిత్రలోనే తొలిసారిగా, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ, అసెంబ్లీ తీర్మానం లేకుండానే ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతంలో రాష్ట్రాల విభజన జరిగినప్పుడు.. రాష్ట్రాల శాసనసభలను విశ్వాసంలోకి తీసుకున్నారు. ఆయా అసెంబ్లీల తీర్మానాల మేరకు విభజన ప్రక్రియ చేపట్టారు. కానీ గత సంప్రదాయాలకు భిన్నంగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన చేపట్టారు’’ అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. నితీశ్‌కుమార్‌తో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘అడ్డగోలు విభజనకు మిగతా రాష్ట్రాలు కూడా ఎంతో దూరంలో లేవు. ఇప్పుడు అనుసరిస్తున్న విధానమే.. కొత్త సంప్రదాయానికి నాంది అవుతుంది. ఈ నేపథ్యంలో నేను బీహార్‌కు వచ్చి, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు పరిస్థితిని వివరించారు. ఆయన సానుకూలంగా స్పందించి, మద్దతు ఇస్తానని హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతున్నాను’’ అని జగన్ అన్నారు.
 
 విభజనపై తప్ప వేరే అంశంపై చర్చించలేదు..

 మూడో ఫ్రంట్ గురించి చర్చించారా? నితీశ్‌కుమార్‌ను ప్రధానమంత్రి అభ్యర్థిగా చూస్తున్నారా? అంటూ విలేకరులు జగన్ మీద ప్రశ్నల వర్షం కురిపించారు. ‘నితీశ్‌కుమార్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన మీద గౌరవం ఉంది. ప్రస్తుత సమావేశంలో అడ్డగోలు విభజన మీద తప్ప, మరే అంశాన్ని చర్చించలేదు’ అని సమాధానం చెప్పారు.
 
Share this article :

0 comments: