బాబు మోసాలు ఎండగట్టేందుకే.. జగన్ సమరదీక్ష - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు మోసాలు ఎండగట్టేందుకే.. జగన్ సమరదీక్ష

బాబు మోసాలు ఎండగట్టేందుకే.. జగన్ సమరదీక్ష

Written By news on Thursday, May 21, 2015 | 5/21/2015


బాబు మోసాలు ఎండగట్టేందుకే.. జగన్ సమరదీక్ష
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలకు చంద్రబాబు నాయుడు చేసిన మోసాలను ఎండగట్టేందుకే ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమరదీక్ష చేపట్టినట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. చంద్రబాబు ఏడాది పాలన రాష్ట్ర ప్రజల పాలిట మోసాల పుట్టగా, వంచనల చిట్టాగా మారిందని ఆయన దుయ్యబట్టారు. బాబు మోసాలను ప్రజల్లో ఎండగట్టేందుకు హామీలను నెరవేర్చనందుకు నిరసనగా జూన్ 3, 4 తేదీల్లో రెండు రోజుల పాటు తలపెట్టిన సమర దీక్ష (నిరాహార దీక్ష) ను మంగళగిరిని వేదికగా ఎంపిక చేశామని ఆయన చెప్పారు. గురువారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికలపుడు చంద్రబాబు చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటీ అమలు చేయని మోసపూరిత వైఖరి వల్ల ఏడాదిలోనే ఆయన ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతోందన్నారు.

టీడీపీ తన మేనిఫెస్టోలో చేసిన వందలాది హామీల మాట అటుంచితే ప్రధానమైన రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ వంటి వాటి విషయంలో ఆ వర్గాలను నిలువునా దగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబొస్తే జాబొస్తుందని ప్రచారం చేసుకున్న చంద్రబాబు గద్దె నెక్కాక ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదన్నారు. ఉద్యోగం ఇవ్వక పోతే రు 2000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మొండి చేయి చూపారన్నారు. విభజన హామీల్లో ఒకటైన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు మోసపూరిత వైఖరిని అవలంభిస్తున్నారని దుయ్యబట్టారు. రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవడాన్ని తమ పార్టీ తీవ్రంగా నిరసిస్తోందని ఉమ్మారెడ్డి అన్నారు. ఈ అయిదు అంశాలపైనే జగన్ ప్రధానంగా తన దీక్ష సందర్భంగా ప్రశ్నిస్తారన్నారు.

 పచ్చటి పొలాలను తీసుకోవద్దని తమ పార్టీ చెబుతూంటే టీడీపీ కావాలని ఓ పథకం ప్రకారం రాజధాని నిర్మాణానికి వైఎస్సార్ కాంగ్రెస్ వ్యతిరేకమని ప్రచారం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి తమ పార్టీ ఎంత మాత్రం వ్యతిరేకం కాదనీ, గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని నిర్మాణం చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన రోజే తమ నేత జగన్‌మోహన్‌రెడ్డి స్వాగతించారని గుర్తుచేశారు. టీడీపీలో ఉన్న చెవిటి వారు తమ వైఖరిని స్పష్టంగా వినాలన్నారు. అయితే రాజధాని పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవడాన్నే తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.

పచ్చని పొలాలకు బదులుగా బీడు భూములను తీసుకుని రాజధాని నిర్మాణం చేయాలని తామంతా చెబుతున్నామన్నారు. రాజధాని పేరుమీద టీడీపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని కేంద్ర ప్రభుత్వం భూసేకరణ విషయంలో 2013లో ఇచ్చిన జీవోను కూడా ఖాతరు చేయలేదని ఆయన దుయ్యబట్టారు. భూసేకరణ చట్టానికి కేంద్రం చేయదల్చుకున్న సవరణలు ఇంకా రాజ్యసభలో ఆమోదం పొందకపోయినా అదింకా ఆర్డినెన్స్ స్థాయిలోనే ఉన్నా 166 నెంబరు జీవోలో రాష్ట్ర ప్రభుత్వం చట్టంలోని 2,3 అనుబంధాలను తొలగిస్తూ జారీ చేయడం దారుణమని పేర్కొన్నారు. భూసేకరణ వల్ల ఆయా సామాజిక వర్గాలపై పడే ప్రభావం అధ్యయనం చేయడం, ఆహారధాన్యాల కొరత ఏర్పడే అవకాశముందా అని అంచనా వేసే అంశాలను తొలగించారని ఆయన మండిపడ్డారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చనందుకు టీడీపీ ప్రభుత్వం సిగ్గు పడాల్సింది పోయి తగుదునమ్మా అని విజయయాత్రలు చేయాలనుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
Share this article :

0 comments: