రాష్ట్రంలో గుడిసెలే లేకుండా చేస్తానన్నావు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రంలో గుడిసెలే లేకుండా చేస్తానన్నావు

రాష్ట్రంలో గుడిసెలే లేకుండా చేస్తానన్నావు

Written By news on Sunday, May 17, 2015 | 5/17/2015


అందరికీ ఇళ్లు ఎక్కడ?
ఉద్దేహాళ్ సభలో
బాబుపై మండిపడ్డ జగన్
అనంతపురం జిల్లాలో ఆరో
రోజుకు చేరిన రైతు భరోసా యాత్ర


అనంతపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  ‘‘చంద్రబాబూ... లక్షన్నర పెట్టి ప్రతి ఒక్కరికీ ఉచితంగా ఇళ్లు కట్టిస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చావు. రాష్ట్రంలో గుడిసెలే లేకుండా చేస్తానన్నావు. ఆ గుడిసెలో ఉన్న ప్రజలు ఇంకా గుడిసెలోనే నివశిస్తున్నారు. ఇప్పటికే ఇళ్లు కట్టుకునేందుకు గోడలు లేపుకున్న వారికి బిల్లులు రావడం లేదు. వారిని మొండిగోడలు వెక్కిరిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క ఇల్లయినా మంజూరు చేశావా?’’ అని ముఖ్యమంత్రిపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అనంతపురం జిల్లాలో రెండో విడత రైతు భరోసా యాత్ర ఆరో రోజైన శనివారం ఉరవకొండ నుంచి ప్రారంభమై రాయదుర్గం నియోజకవర్గంలోని ఉద్దేహాళ్ వరకూ సాగింది. ఈ సందర్భంగా కణేకల్‌లో ఆత్మహత్య చేసుకున్న గంగవరం శర్మాస్ కుటుంబానికి ఆయన భరోసానిచ్చారు. అనంతరం ఉద్దేహాళ్‌లో రైతులు, డ్వాక్రా మహిళలతో ఏర్పాటు చేసిన మాటామంతీ సభలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు ఎన్నికల ముందు హామీలిచ్చి... తీరా అవసరం తీరిన తర్వాత ప్రజలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. మీరు తిడుతున్న తిట్లతోనైనా, పెడుతున్న గడ్డితోనైనా చంద్రబాబుకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు గుర్తుకు రావాలన్నారు. ముఖ్యమంత్రి మెడలు వంచైనా ఆయన ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు అందరూ కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు.

చంద్రబాబుకు కనువిప్పు కలగాలి...!
ఎన్నికల ముందు పెద్ద పెద్ద హోర్డింగుల్లో రైతుల రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని చంద్రబాబుకు వైఎస్ జగన్ గుర్తుచేశారు. ఆ హోర్డింగులను ప్రజలు ఎక్కడ చూడరేమోనని ఫోకస్ లైట్లు కూడా పెట్టారని ఎద్దేవా చేశారు. పింఛన్ల కోసం ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ అవ్వాతాతలు కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

మీరు తిడుతున్న తిట్టు, పెడుతున్న గడ్డితోనైనా చంద్రబాబుకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గుర్తుకువచ్చి కనువిప్పు కలగాలని సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి జగన్ వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ, రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇంచార్జీ ఉష, ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం తదితరులు పాల్గొన్నారు.

శర్మాస్ కుటుంబానికి పరామర్శ
శనివారం జగన్‌మోహన్‌రెడ్డి భరోసా యాత్రలో భాగంగా ఆత్మహత్య చేసుకున్న కణేకల్ గ్రామానికి చెందిన రైతు గంగవరం శర్మాస్(40), కుటుంబీకులను పరామర్శించారు. ఆమె కష్టాలు తెలుసుకొని ఓదార్చారు.
Share this article :

0 comments: