ప్రజలకు పంగనామాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజలకు పంగనామాలు

ప్రజలకు పంగనామాలు

Written By news on Tuesday, May 19, 2015 | 5/19/2015


ప్రజలకు పంగనామాలు
మతిమరుపు వ్యాధితో చంద్రబాబు హామీలన్నీ మరిచారు
నిరుద్యోగ భృతి మాటే విస్మరించారు
సీఎం తీరుపై మండిపడ్డ వైఎస్ జగన్
కాదలూరులో రైతు ఆంజనేయులు కుటుంబానికి పరామర్శ
హోసగుడ్డం, సోమలాపురంలో జగన్‌కు ఘన స్వాగతం
(అనంతపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): 
‘అసలే కరువు జిల్లా. వానల్లేవ్. పంటలూ లేవు. రైతుల పరిస్థితేం బాగోలేదు.

వ్యవసాయ, చేనేత, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని ఓట్లేయించుకుని ముఖ్యమంత్రి పీఠమెక్కిన చంద్రబాబు రాష్ట్ర ప్రజానీకానికి పంగనామాలు పెట్టారు. బాబు మాటలు నమ్మిన బడుగులు నిలువునా మోసపోయార’ని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  అన్నారు.  ‘అయ్యా చంద్రబాబూ.. ప్రజలను వంచించిన నీవు సెక్యూరిటీ లేకుండా గ్రామాల్లో తిరగ్గలవా? ఒకవేళ అదే జరిగితే జనం రాళ్లతో కొట్టినా ఆశ్చర్యం లేద’న్నారు.

రెండో విడత రైతు భరోసా యాత్ర ముగింపు రోజైన సోమవారం వైఎస్ జగన్ రాయదుర్గం నియోజకవర్గంలోని డి.హీరేహాళ్ మండలం కాదలూరు గ్రామంలో  అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు బోయ ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే గ్రామ కూడలిలో రైతులు, డ్వాక్రా మహిళలతో ముఖాముఖి మాట్లాడారు. ‘జిల్లా రైతుల్లో కడుపు నిండా బాధ ఉంది. అప్పులు, ఆగిపోయిన పింఛన్లు, మంజూరు కాని ఇళ్లు, చేతికందని నిరుద్యోగభృతి వంటి సమస్యలు వెంటాడుతున్నాయి.

జనాన్ని అన్ని విధాలా ఆదుకోవాల్సిన సీఎం చంద్రబాబు మునిశాపంతో పాటు మతిమరుపు వ్యాధితో సతమతమవుతున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ మరిచిపోయారు. వాటిని గుర్తుచేస్తూ జూన్ 4, 5 తేదీల్లో గుంటూరులో మరోసారి నిరాహార దీక్షలు చేయబోతున్నా’నని జగన్ ప్రకటించారు.
 
యాత్ర సాగిందిలా...
డి. హీరేహాళ్‌లో సోమవారం ఉదయం 10 గంటలకు 8వ రోజు రైతు భరోసా యాత్ర ప్రారంభమైంది. రెండో విడత యాత్రకు చివరి రోజు కావడంతో జిల్లాలోని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నేతలు డి.హీరేహళ్ చేరుకుని జగన్‌ను కలిశారు. జిల్లా పార్టీ ముఖ్య నేతలతో కొద్దిసేపు ముచ్చటించిన ఆయన.. ముందుగా హోసగుడ్డం గ్రామం మీదుగా సోమలాపురం చేరుకున్నారు. గ్రామసర్పంచ్ సుదర్శన్‌రెడ్డి, పార్టీ మండల నేత గోపాల్‌రెడ్డితో పాటు  ఊరంతా కదిలొచ్చి ఘన స్వాగతం పలికారు.

యువకులు బాణాసంచా కాలుస్తూ సందడి చేశారు.  జగన్ సర్పంచ్ సుదర్శన్‌రెడ్డి ఇంటికెళ్లి.. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అక్కడున్న మహిళలతోనూ సంభాషించారు. స్థానిక ఎస్సీ కాలనీలో వీధిలైట్లు వెలగడం లేదని, కొన్ని వీధుల్లో కరెంటు స్తంభాలు లేవని స్థానిక మహిళ వీరభద్రపు లక్ష్మక్క వివరించింది. హైదరాబాద్‌లోని కిమ్స్‌లో ఆరోగ్యశ్రీ పథకం కింద గుండె ఆపరేషన్ చేయించుకున్న తనకు ప్రభుత్వం మందులు ఇవ్వలేదని, వాటిని కొనుగోలు చేసే స్తోమత లేని తనను ఆదుకోవాలని అదే గ్రామానికి చెందిన చెక్కిరపు లక్ష్మి వేడుకుంది. ఈ ఇద్దరి మహిళల సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డికి జగన్ సూచించారు. అనంతరం కాదలూరు చేరుకున్నారు. రైతులు, డ్వాక్రా మహిళలతో సమావేశమయ్యారు.
 
బ్యాంకులోళ్లు ఇళలమీదకొస్తున్నారు...
‘అప్పులన్నీ మాఫీ చేస్తానన్న చంద్రబాబు నిండా మోసం చేశాడు. ఇప్పుడేమో బ్యాంకులోళ్లు ఇళ్ల మీదకొస్తున్నారు. ఇళ్లు అమ్ముతారో, ఆస్తులమ్ముతారో మాకు తెలీదు.. అప్పులు మాత్రం తీర్చాల్సిందేనని కరాఖండీగా చెబుతున్నార’ని  పలువురు డ్వాక్రా మహిళలు వైఎస్ జగన్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. చీఫ్ ట్రిక్స్ ప్లే చేసిన చంద్రబాబు డ్వాక్రా సంఘాలను ఘోరంగా మోసగించారని రాయదుర్గం మహిళ పద్మజ మండిపడింది. చేతనైతేనే చెప్పాలి గానీ.. ఈ తరహా మోసం దారుణమని రాయదుర్గం రైతు అశోక్ ఆవేదన వెలిబుచ్చారు. ఈ సందర్భంగా పలువురు రైతులు, డ్వాక్రా మహిళలు చంద్రబాబు హామీలపైనా, ఆయన ఏడాది పాలనా తీరుపైనా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
జగన్ ప్రసంగానికి విశేష ఆదరణ
ఎన్నికల సందర్భంగా చంద్రబాబు రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీలు, ఇప్పుడు వాటిని విస్మరించిన తీరును ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పదేపదే ఎండగట్టారు. కాదలూరులో జగన్ ప్రసంగానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. వైఎస్ పేరెత్తిన ప్రతిసారీ కరతాళ ధ్వనులు చేశారు. ‘ప్రజలకు చంద్రబాబు పంగనామాలు పెట్టారా’ అని ప్రశ్నించినప్పుడల్లా అవునంటూ చేతులెత్తారు. ఎనిమిదో రోజు యాత్రలో వైఎస్ జగన్ వెంట రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, ఉరవకొండ, కదిరి ఎమ్మెల్యేలు వై. విశ్వేశ్వరరెడ్డి, చాంద్‌బాషా, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు మాలగుంట్ల శంకర నారాయణ, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం తదితరులు ఉన్నారు.
 
ముగిసిన రెండో విడత భరోసా యాత్ర
జిల్లాలో ఈ నెల 11న మొదలైన రెండో విడత రైతు భరోసా యాత్ర సోమవారంతో ముగిసింది. ఏడు నియోజకవర్గాల్లో యాత్ర నిర్వహించిన వైఎస్ జగన్ 14 మంది రైతు కుటుంబాలను పరామర్శించారు. ఆయా కుటుంబ సభ్యుల్లో ధైర్యం నింపారు.
 
యా పైసా ఇవ్వలేదు
డీ.హీరేహాళ్ : ‘నా భర్త చనిపోయినప్పుడు ఐదు వేల రూపాయల తక్షణ సాయం వస్తుందని చెబితే దరఖాస్తు చేసుకున్నా. అధికారులు పట్టించుకోలేదు. ఇంతవరకు పైసా సాయమందించలేదు. కనీసం ఎవరూ పలకరించిన పాపానపోలేదు. ఇక పరిహారం ఊసే లేద’ని మండలంలోని కాదలూరు గ్రామానికి చెందిన రైతు ఆంజనేయులు భార్య గంగమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుభరోసా యాత్రలో భాగంగా సోమవారం వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్శించారు.వారి మధ్య సంభాషణ ఇలా సాగింది.

జగన్ : ప్రభుత్వం నుంచి ఏమైనా సాయమందిందా తల్లీ?

గంగమ్మ : లేదు సార్. భర్త చనిపోయినప్పుడు ఐదు వేల రూపాయలు వస్తాయని జన్మభూమిలో కూడా దరఖాస్తు చేసుకున్నాను. ఇంత వరకు రాలేదు.
 
జగన్ : ఎన్ని ఎకరాల భూమి ఉంది తల్లీ?
గంగమ్మ : 4.5 ఎకరాలు ఉంది సార్. పత్తి పంట వేశాం.
 
జగన్ : ఎన్ని క్వింటాళ్ల పత్తి వచ్చిందమ్మా?
గంగమ్మ : రెండు క్వింటాళ్లు సార్
 
జగన్ : నాలుగున్నర ఎకరాలకు అంతేనా తల్లీ?!
గంగమ్మ : నీళ్లు లేక పంట ఎండిపోయింది. సార్.
 
జగన్ : పిల్లలు లేరా?
గంగమ్మ : లేరు. అక్క నాగమ్మ కొడుకు దేవేంద్రను దత్తత తీసుకున్నాం.
 
జగన్ : బయట ఎంత అప్పు చేశారమ్మా?
గంగమ్మ : లక్షా 30 వేలు సార్.
 
జగన్ : బంగారు లోను ఏమైనా తీసుకున్నావా తల్లీ?
గంగమ్మ : బంగారమే లేదు సార్. కొడుకు దేవేంద్ర కూడా బళ్లారిలో ఉంటున్నాడు. ఇక్కడ ఉంటే నా పిల్లలు ఎలా బతకాలంటూ అక్కడికి వెళ్లాడు.
 
జగన్ : (దేవేంద్రనుద్దేశించి..) ఏం పని చేస్తున్నావు?
దేవేంద్ర : డ్రైవర్ సార్.

జగన్ : నీకేమైనా సాయం కావాలంటే రామచంద్రారెడ్డన్నను కలువు.  
సార్.. నాకు ఆధార్‌కార్డు కర్ణాటక నుంచి బదిలీ కాకపోవడంతో అప్పు మాఫీ కాలేదు.

జగన్ : నీలాంటి వారికి చంద్రబాబు పంగనామాలు పెట్టారు.
Share this article :

0 comments: