ఎమ్మెల్యేల ఫిర్యాదు బుట్టదాఖలా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎమ్మెల్యేల ఫిర్యాదు బుట్టదాఖలా?

ఎమ్మెల్యేల ఫిర్యాదు బుట్టదాఖలా?

Written By news on Thursday, June 28, 2012 | 6/28/2012

హైదరాబాద్, న్యూస్‌లైన్: సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ, చంద్రబాల ఫిర్యాదులపై ఆగమేఘాలపై స్పందించి కేసు నమోదు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. జేడీ ఫోన్ కాల్స్‌పై విచారణ కోరుతూ తమ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదును మాత్రం పక్కన పెట్టిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘జేడీ కాల్స్‌పై విచారణ జరిపించాలంటూ మా పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు డీజీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. జేడీ, ఆయన మిత్రులు ఫిర్యాదు చేసిందే తడవుగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు’’ అంటూ దుయ్యబట్టారు. ఇదంతా చూస్తుంటే కుట్రపై మరో కుట్ర పన్నుతున్నారని ప్రజలు కూడా గ్రహిస్తున్నారన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జేడీకి నిజాయతీ ఉంటే ఆయన కాల్స్ జాబితాతో పాటు సాక్షిలో వచ్చిన కథనాలపై విచారణకు సిద్ధపడాలని డిమాండ్ చేశారు. 

‘‘దేశమంతటా వందల కొద్దీ కేసులను దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఏ రాష్ట్రంలోనైనా ఇలా దర్యాప్తుపై పత్రికలకు లీకులిస్తోందా? లక్ష్మీనారాయణ మాదిరిగా తింగరి చేష్టలు చేస్తోందా? ఆయన తీరు ‘ఉల్టా చోర్ కొత్వాల్‌కు డాంటే...’ అన్నట్టుగా ఉంది. అసలు లక్ష్మీనారాయణ ఓ దుర్మార్గుడు. జగన్ కేసును వ్యక్తిగతంగా తీసుకుని, ఏదో శత్రువును ఎంక్వైరీ చేస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం మీదో, జగన్ మీదో తనకేదో శత్రుత్వముందనే విధంగా వ్యవహరిస్తున్నారు. వ్యతిరేక మీడియాతో ఆయన ఫోన్ సం భాషణలు, జగన్ శత్రువులతో చేతులు కలపడం వం టివి చూస్తూంటే.. ఆయన పదవిలో ఉండటం కన్నా రాజీనామా చేస్తేనే మంచిది. దర్యాప్తు అధికారిగా కొనసాగే నైతిక హక్కు ఆయనకు ఎంతమాత్రమూ లేదు. సీబీఐ ముసుగులో, సీబీఐని అడ్డం పెట్టుకుని మా పార్టీపైనా, మా నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపైనా కుట్రలు చేస్తున్న ఆయన.. జేడీ పదవికి రాజీనామా చేసి, మా శత్రువులైన కాంగ్రెస్ లేదా టీడీపీలో చేరి నేరుగా పోరాడటం మంచిది. లేదంటే ఓ పత్రిక పెట్టుకోవాలి’’ అంటూ తూర్పారబట్టారు.


జేడీ దురాగతాల్ని క్షమించబోరు
తన వ్యక్తిగత స్వేచ్ఛకు వైఎస్సార్‌సీపీ నేతలు, సాక్షి మీడియా భంగం కలిగిస్తున్నారంటూ జేడీ, ఆయన మిత్రులు చేసిన ఫిర్యాదుపై నమోదైన కేసు కొందరిని లక్ష్యంగా చేసుకుని నడుస్తోందని బాజిరెడ్డి ఆరోపించారు. లక్ష్మీనారాయణ అతితెలివి చూపుతున్నారంటూ మండిపడ్డారు. ‘‘ఆయనపై వచ్చిన ఆరోపణలకు బదులివ్వకుండా, విషయాన్ని పక్కదారి పట్టించేలా మా పార్టీపైనా, నాయకులపైనా ఉల్టా కేసులు పెడుతున్నారు. ఆయన ఫిర్యాదు చేయడమే గాక, తాను వందలసార్లు ఫోన్లు మాట్లాడిన వ్యక్తులతో కూడా కేసులు పెట్టిస్తున్నారు. జగన్ కేసు దర్యాప్తులో ముందే కొన్ని పత్రికలకు జేడీ లీకులిస్తూ వార్తలు రాయిస్తున్నారు. అందుకు రుజువులుగా ఆయన కాల్స్ జాబితాను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు విడుదల చేశారు. సీబీఐ ముసుగులో జేడీ చేస్తున్న దురాగతాలను ప్రజలు ఎంత మాత్రం క్షమించబోరు. 


దీన్ని మేం కూడా న్యాయపరంగా, ప్రజాపరంగా ఎదుర్కొంటాం. జేడీని, ఆయనకు సహకరిస్తున్న వారిని ఎండగట్టడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకాడబోం. ఈ వ్యవహారంలో లక్ష్మీనారాయణ వంటి విలన్లు చాలామంది వస్తారని కూడా మాకు అంచనా ఉంది. కానీ మా నాయకుడు జగన్ ఒక హీరో. ఇలాంటి వారిని తప్పకుండా మట్టికరిపిస్తారు’’ అని చెప్పారు. కాల్స్ జాబితాను వెల్లడించే నాటికి చంద్రబాల స్త్రీయో, పురుషుడో కూడా తమ ఎమ్మెల్యేలకు తెలియదని బాజిరెడ్డి చెప్పారు. ఓ చానల్‌లో వచ్చాకే తెలిసిందన్నారు. ‘‘మా ఎమ్మెల్యేలు చేసిందంతా.. జేడీ తన ఫోన్ నుంచి బయటి వారికి చేసిన ఫోన్ నంబర్లను వెల్లడించడమే! అయితే విచారణ వివరాలను పత్రికలకు చెప్పేందుకు జేడీ తన క్లాస్‌మేట్‌ను మధ్యవర్తిగా మార్చుకున్నట్టు తరవాత తేలింది. ముగ్గురూ ఈ కుట్రలో భాగస్వాములేనని లోకమంతా గ్రహించింది’’ అన్నారు. అసలు జేడీ తీరు తొలి నుంచీ అనుమానాస్పదంగానే ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ ఆక్షేపిస్తూనే ఉందని గుర్తు చేశారు.
Share this article :

0 comments: