జగన్‌ను అరెస్ట్ చేసి ఆర్నెల్లు.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌ను అరెస్ట్ చేసి ఆర్నెల్లు..

జగన్‌ను అరెస్ట్ చేసి ఆర్నెల్లు..

Written By news on Tuesday, November 27, 2012 | 11/27/2012


జన సంక్షేమమే జెండాగా, ఎజెండాగా పనిచేసిన వైఎస్సార్ కన్నుమూసిన దురదృష్టకరఘటన రాష్ట్రాన్ని ఎలా కుదిపేసిందో మనకు తెలుసు. ఆ పిడుగుపాటులాంటి వార్తను తట్టుకోలేక ఎన్నివందలమంది గుండె పగిలి చనిపోయారో కూడా మనం చూశాం. కొండంత తండ్రి హఠాన్మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ యువకుడిని ఈ మరణాలు మరింత కుంగదీశాయి. ఆ సమయంలోనే వైఎస్సార్ చనిపోయిన పావురాలగుట్ట చెంత, నల్లకాలువ సాక్షిగా జరిగిన సభలో మాట్లాడుతూ ఈ మరణాలను గుర్తుకు చేసుకుని ఉద్వేగానికి లోనయ్యాడు. ఇలా గుండె పగిలి చనిపోయినవారంతా తనకు ఆత్మబంధువులేననీ, వారి కుటుంబ సభ్యులందరినీ వారి ఇళ్లలోనే కలుసుకుని ఓదార్చడం తన ధర్మమనీ, ఆ ధర్మాన్ని వెంటనే నెరవేరుస్తానని ప్రకటించాడు. కానీ, ఓదార్పు యాత్ర చేయరాదని అత్యున్నత అధికార పీఠం శాసించడం...ఆజ్ఞ జవదాటితే కష్టాలు తప్పవని సంకేతాలివ్వడం... ఇచ్చిన మాట కోసం జగన్ ముందుకే నడవడం... ఇదంతా జనం మదిలో తాజా జ్ఞాపకమే.

’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’

జగన్‌ను జైల్లో పెట్టి ఆరు నెలలయింది. 
ఈ ఆరు నెలల్లో ఏం జరిగింది.. ‘మాటే’ మంత్రమైంది. 
జగన్ మాట మీద నిలబడ్డ తీరుకు యావత్తు రాష్ట్ర ప్రజానీకం మంత్రముగ్ధమైంది. విశ్వసనీయతే ఇప్పుడు రాజకీయాల్లో గీటురాయిగా మిగిలింది. మిన్ను విరిగి మీదపడినా ఇచ్చిన మాటకోసం నిలబడినవాడే ఇక నిజమైన లీడర్. ఇవాళ వైఎస్ కారణంగానే కేంద్రంలో వరుసగా రెండోసారి పదవీ వైభోగాలను అనుభవిస్తున్నామన్న ఇంగిత జ్ఞానం ఢిల్లీ పెద్దలకు లేకపోయినా...ఆయనవల్లే తమకు పదవులొచ్చాయని ఇక్కడి నాయకులు మరిచిపోయినా అశేష ప్రజానీకం మాత్రం మరిచిపోలేదు. అయిదేళ్ల వైఎస్ పాలనలో మాట ఇచ్చి నిలుపుకున్న తీరును గుర్తుంచుకున్నారు. తమకు ఇచ్చిన మాట కోసం జగన్ ఎదుర్కొంటున్న వేధింపులను చూసి వారు చలించిపోయారు. పార్టీలు వేరైనా, ప్రాంతాలు ఏవైనా ఒక్కడిని లక్ష్యంగా చేసుకుని ఇప్పుడు తూటాలు పేలుతున్నాయి. అది తెలుగుదేశమా... 

కాంగ్రెస్సా...టీఆర్‌ఎస్సా అనే భేదం లేదు. అందరి గురీ జగన్‌పైనే. అందరి లక్ష్యమూ ఆయనను ఇబ్బందులపాలు చేయడమే...ఆయనకున్న ప్రజాభిమానాన్ని తగ్గించడమే. కానీ, అలాంటివారి ఆశలు నెరవేరేలా లేవు. వారి కలలు ఫలించేలా లేవు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ ప్రాంతాన్ని పలకరించినా జగన్నామనాదమే జనన్నినాదం. ఏ సంస్థ సర్వే నిర్వహించినా జగన్ పార్టీ విజయజోస్యాలే! జగన్‌ను జైల్లో పెట్టడం ద్వారా పాలకులు ఆశించిన ఫలితం తలకిందులైంది. రాష్ట్రంలో జగన్‌పై మూకుమ్మడిగా సాగుతున్న కుట్రలను జనం గ్రహించారు. ఎవరేమిటో గుర్తించారు. జగన్‌కు తమ హృదయాల్లో చోటిచ్చిన ఈ ప్రజానీకం పెద్ద చదువులు చదివినవారు కాదు. డబ్బున్న మారాజులు అసలే కాదు. వారంతా జగన్‌ను తమ కుటుంబంలో ఒకడిగా చూశారు. అన్నగా, తమ్ముడిగా, బిడ్డగా ఆయనకు సమున్నత స్థానం కల్పించారు. ఇచ్చిన మాటకు కట్టుబడితే, ఆ మాట కోసం దేన్నయినా ఎదిరించే సాహసాన్ని ప్రదర్శిస్తే, ఎంత పెద్ద పదవినైనా తృణప్రాయంగా తిరస్కరిస్తే...ప్రజలు తమవాడిగా గుర్తిస్తారని, ఆరాధిస్తారని, ప్రేమిస్తారని జగన్ రుజువుచేశారు.

’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’’

అసలెందుకు ఇలా జరిగింది? జగన్ చేసిన తప్పేమిటి? ఇచ్చిన మాట కోసం ప్రలోభాలనూ, బెదిరింపులనూ బేఖాతరుచేసి ఆయన ఓదార్పు యాత్ర చేపట్టాడు. మాట తప్పనందుకు...మడమ తిప్పనందుకు ప్రజలు ఆయనను అక్కున చేర్చుకున్నారు. తమది మురికివాడ అయినా...తామున్న ఇరుకిరుకు గుడిసెలోనికొచ్చి సాంత్వన వాక్యాలు పలికిన ఆ యువకుడికి తమ హృదయ కవాటాలు తెరిచి ఆహ్వానం పలికారు. ఆయనకు దాహం వేస్తున్నదని గొంతు తడిపారు. ఆయనకు ఆకలిగా ఉన్నదని తమ చేతులతో అన్నం ముద్దలు తినిపించారు. తన తండ్రి కనుమరుగవడంతో కలిగిన దుఃఖాన్ని మునిపంట అదుముకొని... తమకు దూరమైన ఆప్తుల గురించి వివరాలు అడిగాడని మురిసిపోయారు. తామెలా ఉంటున్నదీ, ఏం చేస్తున్నదీ తెలుసుకున్నాడని అబ్బురపడ్డారు. అండగా ఉంటానని బాస చేసినందుకు సంబరపడ్డారు. ఆయన ఎక్కడ అడుగుబెడితే అక్కడికి జనం జనమే వెల్లువెత్తారు. ఎండా, వానా లేదు. కొండా, కోనా లేదు. గజగజ వణికించే చలి అయినా, తీవ్రవాదులు సంచరిస్తున్న ప్రాంతం అయినా లెక్కేలేదు. ఒక ఊరు తర్వాత మరో ఊరిని పలకరిస్తూ...అరక్షణం తీరిక లేకుండా, అలుపెరగకుండా మునుముందుకు సాగుతూనే ఉన్నా ఆయన ముఖంపై చిరునవ్వు చెదరకపోవడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. తనను తాకుతున్న జనసాగర కెరటాలతో ప్రతి ఊరూ పులకరించిపోయింది. వ్యక్తికి బహువచనం శక్తి అయినట్టుగానే...జగన్‌కు పర్యాయపదం జనం అయింది.

ఆంధ్రదేశమంతటా దాదాపు మూడేళ్లపాటు పదేపదే నిత్యమూ పునరావృతమైన ఈ ఉజ్వల దృశ్యమే కొందరికి కడుపుమంట అయింది. కష్టంలో ఉన్న కుటుంబాలను పలకరించడమే వారికి కంటగింపయింది. వేలాదిమందిని పరామర్శించి ధైర్యవచనాలు పలకడం ‘ఆ కొందరి’ వెన్నులో వణుకుపుట్టించింది. ఇలాగైతే ఇక తమ పని ఖాళీ అనుకున్నారు. ఓట్ల జాతరనాడు తప్ప పల్లెల ముఖం చూడని, ప్రజలను పలకరించని తమ పద్ధతికి విరుద్ధంగా ఉన్నాడని కంగారుపడ్డారు. కదలబారుతున్న పల్లెల్ని చూసి ఢిల్లీ కళవళపడింది. 

’’’’’’’’’’’’ ’’’’’’’’’’’’ ’’’’’’’’’’’’’’’

వైఎస్సార్ కాంగ్రెస్‌నూ, జగన్ ప్రతిష్టను దెబ్బతీయడం ఎలా...? ప్రజల్లో ఆయనకున్న అభిమానాన్ని చెరిపేయడం ఎలా? ఇవే ఢిల్లీ పెద్దలను దొలుస్తున్న ప్రశ్నలు. పర్యవసానంగా పెద్ద కుట్రకు తెరలేచింది. తొలుత ఇన్‌కమ్ టాక్స్ నోటీసుల రూపంలో బెదిరింపులు మొదలయ్యాయి. అటుపై కాంగ్రెస్‌నుంచి ఎమ్మెల్యే శంకర్రావు రాష్ట్ర హైకోర్టుకు లేఖ రాశారు. ఆ లేఖను న్యాయస్థానం ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. అటు తెలుగుదేశంనుంచి మరో ముగ్గురు నాయకులు జత కలిశారు. రెండుపక్షాలవారూ దాఖలుచేసిన డాక్యుమెంట్లూ ఒకటే! అందులోని ఆరోపణలన్నీ యెల్లో మీడియా అంతకు మూడేళ్లనుంచీ పదే పదే రాస్తున్న కథనాల్లోనివే. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన 26 జీవోలు ఈ కేసుకు మూలమని, ఇందులో క్విడ్ ప్రో కో జరిగిందని ప్రధాన ఆరోపణ. ఈ కేసు గురించి మీరేం చెబుతారని హైకోర్టు ప్రశ్నించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మౌనం పాటించింది. కౌంటర్ దాఖలు చేయాల్సివున్నా మిన్నకుండిపోయింది. హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించాక కేంద్రం పావులు కదిపింది. ఇక సీబీఐ దర్యాప్తు అంతా దాని కనుసన్నల్లోనే నడుస్తోంది. క్విడ్ ప్రో కో జరిగిందని రుజువు చేయడానికి అనుసరించవలసిన మార్గాన్ని వదిలిపెట్టారు. జీవోల జారీ ప్రక్రియలో ఎక్కడెక్కడ అవకతవకలు జరిగాయో ఆరా తీసి వాటికి బాధ్యులైన అధికారులెవరో, మంత్రులెవరో మొదట గుర్తించవలసి ఉండగా...దాన్ని విడిచిపెట్టి జగన్‌మోహన్ రెడ్డి సంస్థల్లో పెట్టుబడులు పెట్టినవారిని వేధించడం మొదలుపెట్టారు. దాడులకు దిగారు. అరెస్టులు చేశారు. సంప్రదాయానికి విరుద్ధంగా చార్జిషీట్ల సంఖ్యను పెంచుకుంటూ పోయారు. వేలాదిమంది పనిచేస్తున్న ‘సాక్షి’ గొంతు నొక్కాలని చూశారు. దాని ఆర్ధిక వనరుల్ని స్తంభింపజేసే చర్యలకు పూనుకున్నారు. అటాచ్‌మెంట్లకూ తెరతీశారు. ఆఖరికి 18 స్థానాలకు రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో... జగన్‌మోహన్ రెడ్డి మరో మూడు రోజుల్లో కోర్టు ముందు హాజరుకాబోతున్న తరుణంలో ఆయనను ప్రశ్నించే నెపంతో పిలిచి అరెస్టుచేశారు. ప్రజలు ఆ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు అఖండ విజయం చేకూర్చి కుట్రదారులకు బుద్ధిచెప్పారు. అయినా ఢిల్లీ పెద్దల్లో ఆశ చావలేదు. జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ రావలసి ఉన్న ప్రతి సందర్భంలోనూ న్యాయస్థానాలను ప్రభావితం చేసేలా అటు సీబీఐ ద్వారాగానీ, ఇటు ఈడీ ద్వారాగానీ ఏదో ఒకటి చేయించడం, ఇక్కడ ఏదో జరుగుతున్నదనే భావన కలిగించడం వారికి అలవాటైపోయింది. ఆఖరికి మొన్నటికి మొన్న సుప్రీంకోర్టులో జగన్‌కు బెయిల్ రావడం ఖాయమని ఈ రాష్ట్ర ప్రజలంతా భావిస్తున్న తరుణంలో తెలుగుదేశం ఎంపీలు ఆగమేఘాలపై ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఆర్ధికమంత్రి చిదంబరంను కలవడం, వెనువెంటనే ఆయన ఈడీని ఉసిగొల్పడం రాష్ట్ర ప్రజలంతా గమనించారు. ఈ ఉమ్మడి కుట్రలకు కారణం...జగన్‌ను జైలు గోడలకే పరిమితం చేస్తే కొంతకాలానికైనా జనం ఆయనను మర్చిపోతారన్న భ్రమ ఉండటంవల్లే. కానీ, ఈ భ్రమలు పటాపంచలవుతాయి. ఈ కుట్రలు భగ్నమవుతాయి. అందుకు నడుస్తున్న చరిత్రే ప్రత్యక్ష సాక్ష్యం. ఇది పదే పదే నిరూపణ అవుతున్న సత్యం.

source:sakshi
Share this article :

0 comments: