నీరు పారితే.. వలసలుండవు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నీరు పారితే.. వలసలుండవు

నీరు పారితే.. వలసలుండవు

Written By news on Friday, November 30, 2012 | 11/30/2012

పాలమూరు జిల్లాలో 4 ప్రాజెక్టులను 75 శాతం వరకు నాన్న పూర్తి చేశారు
మిగతా 25 శాతం పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది
దీంతో నీరు లేక, కూలీ దొరకక పాలమూరు జిల్లా ప్రజలు వలసల బాట పడుతున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ జిల్లాను దత్తత తీసుకొని ప్రయోజనమే లేదు
పైగా ఈ అసమర్థ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టమంటే.. ఆయన డొంకతిరుగుడు వ్యాఖ్యలు చేస్తున్నారు
త్వరలోనే జగనన్న వస్తాడు.. ప్రతి ఇంటినీ సంతోషంగా ఉంచుతాడు
నెట్టెంపాడు ప్రాజెక్టు వద్ద వైఎస్సార్ స్మృతులతో కన్నీరుమున్నీరైన షర్మిల
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ గురువారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 43, కిలోమీటర్లు: 589

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఈ జిల్లాలో(పాలమూరు) పంటలు పండించడానికి నీరు లేక, చేసేందుకు కూలి పనులు లేక ఇక్కడివారంతా బతుకుదెరువు కోసం ఇతర జిల్లాలకు, దేశాలకు వలసపోతున్నారు. అదే ప్రాజెక్టులు ఉండి.. నీళ్లు పారి.. పంటలు పండితే వారు వలస పోవాల్సిన అవసరమే ఉండదు. జిల్లాలో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేస్తే జిల్లా సస్యశ్యామలం అవుతుంది. ఆ ఉద్దేశంతోనే నాన్న రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టుల్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని తపించేవారు. ‘ఆ ప్రాజెక్టులు పూర్తయితే నా అన్నాతమ్ములు వలసలు మానేసి కుటుంబాలతో ఇక్కడే సంతోషంగా ఉంటారు’ అని నాన్న ఎప్పుడూ చెప్తుండేవారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల.. తన తండ్రి మహోన్నత ఆశయాలను గుర్తుచేసుకుంటూ వ్యాఖ్యానించారు. 

పజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 43వ రోజు గురువారం మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల, మఖ్తల్ నియోజకవర్గాల్లో సాగింది. ఈ సందర్భంగా వైఎస్ కలల ప్రాజెక్టుల్లో ఒకటైన నెట్టెంపాడు వద్దకు షర్మిల వెళ్లారు. ఆ ప్రాజెక్టును పరిశీలిస్తున్నప్పుడు.. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తుకురావడంతో ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీటిని ఆపుకోలేకపోయారు. ఆమె కన్నీరు మున్నీరుగా విలపించడం చూసి స్థానిక నాయకులు ఓదార్చడానికి యత్నించారు కానీ.. వైఎస్ స్మృతులతో వారు కూడా కన్నీటిని ఆపుకోలేకపోయారు.

బతకలేం.. ఊరు విడిచి వెళ్లిపోతాం..

షర్మిల నందిమల్ల గ్రామంలో గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్నప్పుడు.. సాగు లేక, కూలీ పనులు లేక వలసలు పోతున్నామని స్థానికులంతా ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఊరు ఒట్టిపోయిందమ్మా.. నాయిన పోయినంకా చేతానం(వ్యవసాయం) లేదు.. చేద్దామంటే కూలీ దొరుకుత లేదు. ఉప్పుగల్లు కూడా పుడతలేదు. ఈ ఏడు కాకుంటే వచ్చే ఏడు కాలం కాకపోతదా! సర్కారు సాయంగాకపోతదా అని ఎదురుజూసినం. మూట ముల్లె సదురుకున్నాం.. ఇగ ఊరిడిచి ఎల్లిపోతాం తల్లీ’’ అని నందిమల్ల గ్రామానికి చెందిన ఎల్లన్న, తిమ్మయ్య అనే కూలీలు తమ గోడు చెప్తూ బాధ పడటంతో షర్మిల ఉద్వేగానికి లోనయ్యారు. ‘‘పాలమూరు జిల్లా వాళ్లు త్యాగమూర్తులు అని నాన్న ఎప్పుడూ చెప్పేవారు. ఎందుకు నాన్నా అని అడిగితే..! ఇది కరువు జిల్లా.. పంటలు సరిగా పండవు. కూలీపని కూడా దొరకదు. ‘నా అన్నదమ్ములు కుటుంబాన్ని వదిలి దేశం కాని దేశాలకు వలస పోతారు. అక్కడ పస్తులు ఉండైనా సరే నాలుగు డబ్బులు సంపాదించి వాళ్ల కుటుంబ సభ్యుల కోసం పంపుతారు. పాలమూరు జిల్లాను చంద్రబాబు నాయుడు దత్తత తీసుకున్నాడు కానీ ప్రయోజనం లేదు. జిల్లా ప్రజల కోసం ఏమీ చేయలేదు. కనీసం వలసలను కూడా ఆపలేకపోయారు’ అని నాన్న బాధపడేవారు’’ అని షర్మిల గుర్తుచేసుకున్నారు.

వైఎస్ 75 శాతం పనులు పూర్తి చేసినా: ‘‘వైఎస్సార్ రూ.7,000 కోట్ల అంచనా వేసి రూ.6,000 కోట్లు ఖర్చు చేసి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులకు 75 శాతం పనులు పూర్తి చేశారు. మరో 25 శాతం పనులు పూర్తి చేస్తే ఈ జిల్లా సస్యశ్యామలం అయ్యేది. కానీ కాంగ్రెస్ పాలకులు మూడేళ్ల నుంచి ఈ ప్రాజెక్టు పనులను పూర్తి చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇందిరమ్మ బాట అని చెప్పి గొప్పలకు పోయిన ముఖ్యమంత్రి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులను ప్రారంభించి పోయారు. అయినప్పటికీ ఇప్పటి వరకు పంట పొలాల్లోకి ఎందుకు నీళ్లు పారడం లేదు?’’ అని షర్మిల ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘‘మహానేత మన మధ్య నుంచి వెళ్లిపోయిన తరువాత ప్రాజెక్టుల పనులు ఆగిపోయాయి. ఈ పాలకులకు చిత్తశుద్ధి లేక మళ్లీ పాలమూరు అన్నదమ్ములు వలసలు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. అన్నా మీరు బాధపడొద్దు. మీ కోసం మేం పోరాటం చేస్తాం’’ అని షర్మిల భరోసా ఇచ్చారు. అయితే ఈ అసమర్థ ప్రభుత్వం పని చేస్తుందన్న నమ్మకం తమకు లేదని, త్వరలోనే జగనన్న అధికారంలోకి వస్తారని, ప్రతి ఇంటినీ సంతోషంగా ఉంచుతారని ధైర్యం చెప్పారు.

నిర్వాసితులకు అండగా నిలబడతాం...

ఉప్పేరు, నెట్టెంపాడు, వామనపల్లి, నర్సందొడ్డి గ్రామాల్లో షర్మిల యాత్ర చేసినప్పుడు.. స్థానికులు ఆమెను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. ‘‘నెట్టెంపాడు ప్రాజెక్టుతో మా గ్రామాలు మునిగిపోతున్నాయి. ట్రయల్ రన్ కోసం నీళ్లు వదలటంతోనే ఇళ్లలోకి చెమ్మ చేరింది.. పూర్తిగా నీళ్లు వదిలితే ఇళ్లలో నీళ్లు ఊరుతాయి. ఇప్పటికే పంట భూములు పోగొట్టుకున్నాం’’ అంటూ అక్కడి వారంతా భయాందోళనలు వ్యక్తంచేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘‘మీ బాధ నాకు అర్థమయిందక్కా.. ప్రాజెక్టులు కట్టడం ఎంత ముఖ్యమో నిర్వాసితులకు అండగా నిలబడటం కూడా అంతే ముఖ్యం. కచ్చితంగా మీకు నష్టపరిహారం చెల్లించి మళ్లీ మీకు పునరావాసం కల్పించాల్సిందే. ఇందులో రాజీపడేదే లేదు. మీకు పునరావాసం కల్పించాలని పార్టీ పోరాడుతుంది. కానీ మానవత్వం లేని ఈ పాలకులు పట్టించుకొని మన సమస్యను తీరుస్తారనే నమ్మకమైతే నాకు లేదు. జగనన్న రాగానే మీకు సంతోషం కలిగించేలా నష్టపరిహారం చెల్లించి పునరావాసం కల్పిస్తారు’’ అని వారికి భరోసా ఇచ్చారు.

కన్నీరు మున్నీరుగా విలపించిన షర్మిల..

బుధవారం రాత్రి నెట్టెంపాడు ప్రాజెక్టు వద్దే బస చేసిన షర్మిల గురువారం ఉదయం ప్రాజెక్టును పరిశీలించారు. మోటారు పంపు సెట్ల పని తీరును పరిశీలించేందుకు ఆరు అంతస్తులు ఉన్న టన్నెల్‌లోకి దిగి చూసి.. తర్వాత కాల్వ వద్దకు చేరుకున్నారు. కాల్వలో పారుతున్న నీళ్లను చూడగానే ఆమె ఉద్వేగానికి లోనయ్యారు. అక్కడే ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహానికి ప్రార్థన చేస్తూ.. కన్నీరుమున్నీరుగా విలపించారు. పక్కనే ఉన్న రైతులు, స్థానిక ప్రజలు కూడా ఉద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. ‘బాధపడొద్దమ్మా.. పారే నీళ్లలో నాన్నను చూసుకుంటాం.. ఈ ప్రాజెక్టు ఉన్నంత కాలం నాన్న మా గుండెలో..మా ప్రాంత ప్రజల గుండెల్లో ఉంటారు’ అని స్థానిక నాయకులు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు.

‘ఫీజుల పథకంతోనే లెక్చరర్‌నయ్యా’

‘‘వైఎస్సార్ నాకు దేవుడు. ఆయన ముఖ్యమంత్రి కాకుంటే నేను ఏ పరిస్థితుల్లో ఉండేదాన్నో నాకు తెలియదు. ఊహించుకుంటేనే భయం వేస్తోంది. మాది నిరుపేద కుటుంబం. ఎమ్మెస్సీలో నాకు సీటు వచ్చినాఫీజు కట్టలేక సీటు వదులుకోవడానికే సిద్ధపడ్డాను. వైఎస్సార్ దేవుడిలా ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం తెచ్చారు. మళ్లీ నేను కాలేజ్‌కు వెళ్లాను. ఇప్పుడు లెక్చరర్‌గా పని చేస్తున్నాను. నా కుటుంబానికి కొంతలో కొంతైనా ఆసరా అవుతున్నాను’’ అని నందిమల్ల గ్రామానికి చెందిన లెక్చరర్ నమిత.. షర్మిలను కలిసి కృతజ్ఞతలు చెప్పుకొన్నారు. షర్మిల స్పందిస్తూ ‘నాన్న బతికి ఉండి నీ మాటలు వింటే ఆనందంతో ఆయన కళ్ల వెంట నీళ్లు తిరిగేవిరా’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.

పరీక్షలు ఎలా రాయాలక్కా..!

‘‘మా ఊళ్లో ఏడో తరగతి వరకే ప్రభుత్వ పాఠశాల ఉంది. మరో గత్యంతరం లేక ప్రైవేటుకు వెళ్తున్నాం.. నాన్న కష్టపడి ఫీజులు కడుతున్నారు. స్కూలు వదిలేసిన తరువాత ఇంటి వద్ద కనీసం గంటసేపైనా చదువుకుందామని అనుకుంటే కరెంటు ఉండదు.. ఈ ప్రభుత్వం మమ్మల్ని ప్రభుత్వ స్కూళ్లలో చదవనివ్వదు. కనీసం ఇంట్లో కూడా చదువుకోకుండా చేస్తే పరీక్ష లు ఎలా రాయాలక్కా’’ అని నందిమల్ల గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని సువర్ణ ఆవేదన వ్యక్తం చేసింది. షర్మిల స్పందిస్తూ... ‘కిరణ్‌కుమార్‌రెడ్డి గారూ.. ఈ విద్యార్థుల గోడు మీకు వినిపిస్తోందా! పల్లెల్లో ప్రజల బాధలు మీరు విని తీరాలి’ అని అన్నారు.
Share this article :

0 comments: