వైఎస్ దయ వల్లే ఈ స్థాయి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ దయ వల్లే ఈ స్థాయి

వైఎస్ దయ వల్లే ఈ స్థాయి

Written By news on Saturday, December 1, 2012 | 12/01/2012



 ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు ముఖ్య నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప శుక్రవారం చంచల్‌గూడ జైలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ములాఖత్‌లో కలుసుకున్నారు. అనంతరం ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను ఆమె నివాసంలో కలుసుకుని పార్టీలో చేరాలన్న తమ అభీష్టాన్ని వెల్లడించారు. త్వరలో నిర్మల్, సిర్పూర్ శాసనసభా నియోజకవర్గాల్లో బహిరంగ సభలు ఏర్పాటుచేసి ప్రజల సమక్షంలో పార్టీలో చేరాలనుకుంటున్నట్లు వారు విజయమ్మకు తెలిపారు. అలాగే ఆ సభలకు రావాల్సిందిగా ఆమెను ఆహ్వానించారు. మూడు దశాబ్దాలకుపైగా రాజకీయాల్లో కొనసాగుతూ లోక్‌సభ సభ్యుడిగా, శాసనసభ్యునిగా ఇంద్రకరణ్ పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితుడైన కోనప్ప ఒకసారి సిర్పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణపై అధిష్టానం నాన్చుడు ధోరణి అనుసరిస్తున్నందుకు నిరసనగా వారిద్దరూ ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.

జగన్‌తోనే వైఎస్ పథకాల అమలు: ఇంద్రకరణ్

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు జగన్‌మోహన్‌రెడ్డి వల్లే సాధ్యమవుతుందని ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. జగన్‌ను కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లాలో వైఎస్ ఎన్నో అభివృద్ధి పనులు చేశారని కొనియాడారు. ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజలను పూర్తిగా మర్చిపోయారని, తన కుర్చీని కాపాడుకోవడానికే ఆయనకు సమయం సరిపోతోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ వామపక్షాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయని.. అన్ని పార్టీల్లోనూ తెలంగాణవాదులున్నట్లే తాము వైఎస్సార్ కాంగ్రెస్‌లో తెలంగాణవాదులుగా కొనసాగుతామని తెలిపారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమని, ప్రత్యేక రాష్ట్రం ఇస్తే తాను అడ్డుపడబోనని జగన్ స్పష్టత ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాల వల్లే జగన్‌ను అన్యాయంగా జైల్లో పెట్టారని విమర్శించారు. 

వైఎస్ దయ వల్లే ఈ స్థాయి: కోనప్ప

వైఎస్ రాజశేఖరరెడ్డి దయ వల్లే తాను రాజకీయంగా ఈ స్థాయిలో ఉన్నానని, ఆయన తనను రాజకీయాల్లో ఎంతగానో ప్రోత్సహించారని కోనేరు కోనప్ప తెలిపారు. ఆదిలాబాద్ అభివృద్ధికి, తన నియోజకవర్గమైన సిర్పూర్ అభివృద్ధికి వైఎస్ ఎంతగానో కృషి చేశారన్నారు. కాగా, బోథ్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ తుల శ్రీనివాస్, సిర్పూర్ నియోజకవర్గానికి చెందిన కొముర గౌడ్ (మాజీ జెడ్పీటీసీ), డోకె వెంకన్న (సింగిల్ విండో చైర్మన్-బెజ్జూర్), సంతోష్‌గౌడ్, బుచ్చి పంతులు, బ్రహయ్య (సర్పంచ్‌లు), ఇతర నేతలు విశ్వనాథ్ బసార్కర్, కొమురం మహంతయ్య, దుబ్బుల వెంకన్న కూడా విజయమ్మను ఆమె నివాసంలో కలిశారు.

source:sakshi
Share this article :

0 comments: