విభజనను అడ్డుకోవాలని అన్ని పార్టీల మద్దతు కోరుతున్న జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విభజనను అడ్డుకోవాలని అన్ని పార్టీల మద్దతు కోరుతున్న జగన్

విభజనను అడ్డుకోవాలని అన్ని పార్టీల మద్దతు కోరుతున్న జగన్

Written By news on Thursday, November 21, 2013 | 11/21/2013

ఏకగ్రీవ తీర్మానం చేయకుంటే అడ్డుకుంటాంవిస్తరించు & ప్లే క్లిక్ చేయండి
  •   తృణమూల్ అధినేత్రితో వైఎస్సార్ కాంగ్రెస్ బృందం భేటీ
  •   ఓట్లు, సీట్ల కోసం కేంద్రం రాష్ట్రాన్నే చీలుస్తోందని వివరించిన జగన్
  •   రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 దుర్వినియోగమవుతోందని ఆవేదన
  •   విభజనను అడ్డుకునేందుకు, ఆర్టికల్ 3 సవరణకు కృషి చేయాలని వినతి
  •   జగన్ వాదనతో ఏకీభవించిన మమత
  •   విభజనను లోక్‌సభలోనూ, రాజ్యసభలోనూ అడ్డుకుంటామని హామీ
  •   ఈ విషయంలో జగన్‌కు సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటన
  •   విభజనను అడ్డుకోవాలని అన్ని పార్టీల మద్దతు కోరుతున్న జగన్
 
 కోల్‌కతా నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేయకుండా రాష్ట్రాన్ని విభజించాలన్న ప్రయత్నాలను పార్లమెంట్‌లో అడ్డుకుంటామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి హామీ ఇచ్చారు. విభజన విషయంలో ఒక విధానం పాటించకుండా రానున్న ఎన్నికల్లో ప్రయోజనాలను ఆశించి ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్‌ను విడదీయాలని చూస్తే ఇటు లోక్‌సభలోనూ అటు రాజ్యసభలోనూ అడ్డుకుంటామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడానికి జరుగుతున్న వ్యవహారాలన్నింటినీ వరుస క్రమంలో జగన్‌మోహన్‌రెడ్డి వివరించినప్పుడు మమతా బెనర్జీ పైవిధంగా స్పందించారు. 
 
 రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను దుర్వినియోగం చేస్తున్న విధానాన్ని నిరసిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా రాష్ట్రాన్ని విడదీయడానికి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి దేశవ్యాప్తంగా అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతును కూడగడుతోన్న జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం అందులో భాగంగా బుధవారం కోల్‌కతాలో మమతా బెనర్జీని కలిసింది. రాష్ట్ర సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో గంటకుపైగా చర్చలు జరిపారు. జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పార్టీ ప్రతినిధులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కొణతాల రామకృష్ణ, ఎంవీ మైసూరారెడ్డి, వి.బాలశౌరి, గట్టు రామచంద్రరావు చర్చల్లో పాల్గొన్నారు. ఈ ప్రతినిధి బృందం రావడంతోనే ఆత్మీయంగా పలకరించిన మమతా బెనర్జీ విభజన అంశంపై జగన్ చెప్పిన విషయాలన్నింటినీ జాగ్రత్తగా విన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జగన్ చేస్తున్న ప్రయత్నాన్ని ఆమె ఈ సందర్భంగా అభినందించారు. ఈ విషయంలో మిగిలిన అన్ని రాజకీయ పార్టీల నేతలనూ కలిసి వివరించాల్సిందిగా సూచించారు.
 
 కేంద్రం వైఖరిని ఎండగట్టిన జగన్..
 కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం విషయంలో ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నదీ, నిరంకుశ వైఖరితో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటోందన్న విషయాలన్నింటినీ సోదాహరణంగా జగన్ తృణమూల్ అధినేత్రికి వివరించారు. ఏకాభిప్రాయం లేకుండా కేంద్రం రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుందని తెలిపారు. మూడింట రెండు వంతుల మెజారిటీతో తీర్మానం ఆమోదం పొందితేనే రాష్ట్రాన్ని విలీనం చేయాలన్న ఫజల్ అలీ కమిషన్ సిఫారసులను వివరిస్తూనే, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్(ఎస్‌ఆర్‌సీ) సిఫారసు ఆధారంగా తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని వివరించారు. ‘అయితే ఇప్పుడు రాష్ట్ర విభజన విషయంలో ఎలాంటి ప్రాతిపదిక లేకుండా నిరంకుశంగా నిర్ణయం తీసుకున్నారు. జార్ఖండ్, చత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు సంబంధిత రాష్ట్రాల అసెంబ్లీలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించాయి. ఆ తర్వాతే వాటిని విభజించారు. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం అలాంటి సంప్రదాయం పాటించలేదు’ అని జగన్ వివరించారు. ‘కేంద్రం రాజ్యాంగంలోని 3వ అధికరణ ఉంది కదా అని ఇష్టానుసారం విభజన చేయాలనుకుంటోంది. ఈ అధికరణ దుర్వినియోగం కావడాన్ని అడ్డుకోవడంలో మీరు అండగా నిలవాలి’ అని జగన్ కోరారు. దీనిపై మమతా బెనర్జీ స్పందిస్తూ తాము కచ్చితంగా మద్దతునిస్తామని ప్రకటించారు. ‘అభివృద్ధి చేయాలంటే.. డార్జిలింగ్ మాదిరిగా ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వొచ్చు, ప్యాకేజీలు, నిధులు కేటాయిస్తే అభివృద్ధి సాధ్యమవుతుంది కాని, విభజిస్తే అభివృద్ధి జరుగుతుందా!’ అని కూడా ఆమె చర్చల సందర్భంగా అన్నారు.
 
 దీదీ సాయం కోరాం: జగన్
 సమావేశానంతరం జగన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో అడ్డుకునేందుకు సాయం చేయాల్సిందిగా మమతా బెనర్జీని కోరామన్నారు. అదే విధంగా 3వ అధికరణను సవరించాలని కూడా తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఏ రాష్ట్రాన్నైనా విభజించాలంటే అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి చేస్తూ దీన్ని సవరించాలని, విభజనకు మూడింటరెండొంతుల మెజారిటీ ఉండాల్సిందేనని పట్టుపడుతున్నామన్నారు. అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంటు రెండింటిలోనూ మూడింట రెండు వంతుల మెజారిటీతో తీర్మానం ఆమోదించినపుడే రాష్ట్రాన్ని విభజించాలని, లేదంటే ఓట్ల కోసం, సీట్ల కోసం.. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా అడ్డగోలుగా ఏ రాష్ట్రాన్నైనా ఇట్టే విభజిస్తుందని జగన్ అన్నారు. భవిష్యత్‌లో తృణమూల్‌తో పొత్తు కుదుర్చుకునే విషయం కూడా చర్చించారా అని మీడియా ప్రశ్నించినపుడు ‘ప్లీజ్ ఇది చాలా సీరియస్ విషయం... దీనిని పక్కదారి పట్టించొద్దు. ఇపుడు వచ్చింది దాని కోసం కాదు’ అని జగన్ సున్నితంగా వ్యాఖ్యానించారు.
 
 విభజనకు ప్రజాభిప్రాయం తప్పనిసరి: మమత
 తర్వాత మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించాలనుకున్నపుడు ప్రజాభిప్రాయం తప్పనిసరని చెప్పారు. దేశం సమైక్యంగా ఉండాలనేదే తమ వైఖరి అని, ప్రజలంతా కలసికట్టుగా ఉండాలనే తాము కోరుకుంటున్నామన్నారు. విభజన కోసం స్థానికంగా కొన్ని డిమాండ్లు ఉన్నాయని, అయితే దీని విషయంలో తమ వైఖరి చాలా సుస్పష్టమని చెప్పారు. అభివృద్ధి కోసం కొత్త జిల్లాలనే ఏర్పాటు చేసుకోవచ్చు, ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించవచ్చు, లేదా వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక హోదా కల్పించవచ్చు, అలా కాదు, అంతా కలిసి విభ జిద్దామని నిర్ణయం తీసుకుని తీర్మానం ఆమోదిస్తే దానిని ఎవరూ వ్యతిరేకించరని అన్నారు. కానీ ఇపుడు ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి భిన్నంగా ఉందని, ఒకరు కావాలంటున్నారు, మరొకరు వద్దంటున్నారు కనుక ఇది చాలా సున్నితమైన అంశమని అభిప్రాయపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టడం ఏ మాత్రం సరికాదు, కాంగ్రెస్ పార్టీకి లబ్ధి కోసమే ఇలా చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే తెలంగాణ అంశంపై అధ్యయనం చేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఇప్పటి వరకూ ఎందుకు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టలేదని కూడా మమత ప్రశ్నిస్తూ సమస్యను సవివరంగా చర్చించాలని డిమాండ్ చేశారు. శ్రీకృష్ణ కమిటీ, సర్కారియా కమిషన్ నివేదికలను పరిగణనలోకి తీసుకోవాలని, శ్రీకృష్ణ కమిటీ నివేదికను పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తున్నానని ఆమె స్పష్టం చేశారు.
Share this article :

0 comments: