బాబే A-1ముద్దాయి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబే A-1ముద్దాయి

బాబే A-1ముద్దాయి

Written By news on Wednesday, June 3, 2015 | 6/03/2015


బాబే A-1ముద్దాయి
అసలు సూత్రధారి చంద్రబాబే అనడానికి బలమైన ఆధారాలున్నాయి
వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలి
గవర్నర్‌కు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి
ఎమ్మెల్యేకు రూ.5 కోట్లు వ్యవహారంలో రేవంత్ పాత్రధారే
ఏడాది పాలనలో అవినీతిపై దర్యాప్తు జరిపించాలి    

 
 
హైదరాబాద్: ఒక ఎమ్మెల్యే ఓటుకు ఐదుకోట్లు ఎర చూపి అడ్డంగా దొరికిపోయిన ఉదంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన సూత్రధారుడు అనడానికి బలమైన ఆధారాలు ఉన్నందున ఆయనను కేసులో ప్రథమ ముద్దాయిగా (ఏ-1) గా చేర్చాలని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి ఉదంతంలో సూత్రధారి చంద్రబాబే అన్నది వీడియో క్లిప్పింగ్‌ల్లో స్పష్టంగా వెల్లడైందని, ఈ విషయంలో వెంటనే చంద్రబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని కోరారు. విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లుతున్న చంద్రబాబు ఏడాది పాలనలో జరిగిన అనేక అవినీతి కుంభకోణాలపై దర్యాప్తు జరిపించాలన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు నేతలతో కలసి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కలిశారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని పంపించి రూ.ఐదు కోట్లతో నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటు కొనుగోలు చేయడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయిన వైనాన్ని ఆయనకు వివరించారు.

చంద్రబాబు ఏడాది పాలనలో అవినీతి తారస్థాయికి చేరిందని, వాటన్నింటిపైనా విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పార్టీ నేతలతో కలిసి జగన్ రాజ్‌భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేయడానికి యత్నించిన చంద్రబాబును ఆ కేసులో ఏ-1గా చేర్చాలని గవర్నర్‌ను గట్టిగా కోరామని తెలిపారు. ఈ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పదేపదే... మా బాస్ చెబితేనే వచ్చానని చెప్పడంతోపాటు... నేరుగా చంద్రబాబుతో మాట్లాడించి హామీ ఇప్పించారని వీడియోల్లో అంత స్పష్టంగా కనబడుతున్నా ఆయనపై ఎందుకు కేసు పెట్టడం లేదని ప్రశ్నించారు. చట్టం మీద ప్రజలకు నమ్మకం కల గాలంటే ముఖ్యమంత్రి అయినా సరే నేరం చేసిన వారిని శిక్షించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
 
అంత డబ్బెక్కడిది?
తెలంగాణ మండలిలో ఒక్క ఎమ్మెల్సీ గెలిచినా ఓడినా ఏపీలో ప్రభావం ఉండదని తెలిసినా... ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి చంద్రబాబుకు అంతంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అని జగన్ ప్రశ్నించారు. ఒక ఎమ్మెల్యేకు ఐదు కోట్లివ్వడానికి సిద్ధపడ్డారంటేనే ఏడాది పాలనలో చంద్రబాబు ఎంత దోచుకుంటున్నారో అర్థమవుతోందని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారమంతా రాజకీయ కుట్ర అనడంపై జగన్ మండిపడ్డారు. చంద్రబాబు ఎప్పుడు కూడా తప్పు ఇంకొకరిపై నెట్టే ప్రయత్నం చేస్తారని దుయ్యబట్టారు. ‘‘అసలిది రాజకీయ కుట్ర ఎలా అవుతుంది? నామినేటెడ్ ఎమ్మెల్యేకు ఇవ్వడానికి డబ్బు తీసుకెళ్లింది చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యే అన్నది వీడియోల్లో స్పష్టంగా కనబడుతోంది. నల్లటి బ్యాగు తెరిచి డబ్బు ఇస్తుంటే చక్కగా నవ్వుతూ రేవంత్ వీడియోలో కనిపిస్తున్నారు. ‘బాస్’ తనకు ఇక్కడకు పంపాడని ఆ ఎమ్మెల్యేనే చెబుతున్నాడు. ఆ ‘బాస్’తో ఫోన్‌లో కూడా మాట్లాడించాడు. ఇదంతా వీడియో దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తుంటే... ఇంకా తమపై రాజకీయ కుట్ర జరిగిందంటారా? చంద్రబాబుపై రాజకీయ కుట్ర జరిగిందా? లేక చంద్రబాబే కుట్ర పన్నుతూ పట్టుబడ్డాడా?’’ అని ప్రశ్నించారు.
 
 
అక్కడో మాట... ఇక్కడోమాట...
చంద్రబాబు తన రాజకీయ స్వార్థం కోసం తెలంగాణలో ఒక మాట, ఏపీలో మరో మాట మాట్లాడతారని జగన్ మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతునిచ్చే స్థాయికి వైఎస్సార్‌సీపీ దిగజారిందని తమ పార్టీని బాబు విమర్శించిన అంశాన్ని జగన్ స్వయంగా ప్రస్తావిస్తూ... ‘‘నిజంగా చంద్రబాబుకు ఓ నమస్కారం పెట్టాలి. ఆయనేమో వరంగల్‌కు వెళ్లి తామిచ్చిన లేఖ వల్లే తెలంగాణ వచ్చిందని చెప్తారు. ఇక్కడికొచ్చి అన్యాయంగా విడదీశారని గగ్గోలు పెడతారు. కాం గ్రెస్‌పై ఓ వైపు దుమ్మెత్తి పోస్తూనే ఇటీవల జరిగిన ఏపీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీకి చెందిన సతీష్‌రెడ్డిని కాంగ్రెస్ మద్దతుతో గెలిపించుకోలేదా? సమైక్య రాష్ట్రంగా ఉన్నపుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని విప్ జారీ చేసి మరీ టీడీపీ కాపాడలేదా? ఇలాంటి విలువలు లేని రాజకీయాలు మేం చేయం. మా పార్టీ ఒక్కమాట మీద నిల బడుతుంది. చేయాలనుకున్నది ధైర్యంగా చెప్పే చేస్తాం. రాష్ట్ర విభజన జరిగే వరకూ సమైక్యత కోసం నిజాయితీగా పోరాడిన ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీయేనని చెప్పడానికి గర్విస్తాం. తెలంగాణలో మా పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించడంపై కోర్టుకు వెళ్లి, వారిని అనర్హులను చేయాలని గట్టిగా పోరాడుతున్నాం’’ అని తెలిపారు.

గవర్నర్‌ను కలసిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, తెలంగాణ పార్టీ అధ్యక్షుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎంపీలు బుట్టా రేణుక, వైఎస్ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సి.నారాయణరెడ్డి, డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కళత్తూరు నారాయణస్వామి, శెట్టిపల్లి రఘురామిరెడ్డి, గుమ్మనూరు జయరామయ్య, చింతల రామచంద్రారెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, వై.సాయిప్రసాద్‌రెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, డాక్టర్ సునీల్, బుగ్గన రాజేంద్రనాథ్, ఎన్.అమరనాథ్ రెడ్డి, సాయిప్రసాదరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, హిందూపురం పార్లమెంటు ఇన్‌చార్జి డి.శ్రీధర్‌రెడ్డి ఉన్నారు.
 
ఇదీ బాబు పాలనలో అవినీతి
ఏపీలో అడ్డగోలుగా సంపాదిస్తున్న అవినీతి సొమ్ముతో కన్నూ మిన్నూ కానరాకుండా చంద్రబాబు ఏమనుకుంటే అది చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు ఏడాది పాలనలో జరిగిన అవినీతి వ్యవహారాలను వివరించారు....
 
 పట్టిసీమలో ఎంత తిన్నావు?
  పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణాన్ని 21.9 శాతం ఎక్సెస్‌కు (అధిక మొత్తానికి) కాంట్రాక్టర్‌కు అప్పగించారు. ఈ పనులను మరెవ్వరూ తీసుకోకుండా రెండు కంపెనీలకే అర్హత వచ్చేలా నిబంధనలు రూపొందించారు. పనులు పొందిన కాంట్రాక్టర్ వాస్తవిక వ్యయం కన్నా 21.9 శాతం అధికంగా కోట్ చేస్తే నిబంధనల ప్రకారం ఐదు శాతానికి మించి ఎక్సెస్ ఇవ్వకూడదు. అందువల్ల నిబంధనల్లో లేకపోయినా మిగతా 16.9 శాతం మొత్తాన్ని బోనస్ రూపంలో అదనంగా ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. కేవలం ఆ కాంట్రాక్టర్‌కు మేలు చేయడానికే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.
 
 జీవో-22తో ఎంత దోచిపెట్టావు?
 కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి జీవో నంబర్ 22 జారీ చేశారు. ఈపీసీ ప్రాతిపదికన ఖరారు చేసిన పనుల టెండర్లకు కాస్ట్ ఎస్కలేషన్ (వ్యయం పెరుగుదలను) ఇచ్చే అవకాశమే లేదు. ఇనుము, సిమెంట్ ధరల్లో పెరుగుదల 5 శాతానికి మించినపుడు మాత్రమే వారు ఆ మేరకు పెంచుకునే అవకాశముంది. ఈపీసీ పనుల్లో 40 శాతం మేరకు ఇనుము, సిమెంట్ వ్యయం ఉంటుంది. మిగతా 60 శాతం యంత్రాలు, కూలీల తాలూకు వ్యయంగా ఉంటుంది. చంద్రబాబు కాంట్రాక్టర్లపై ప్రేమ చూపిస్తూ ఈ 60 శాతంపై కూడా 2013 నుంచే మీ ఇష్టప్రకారం పెంచుకోండి అని చెప్పి జీవో ఇవ్వడంలోని ఆంతర్యమేమిటి?
 
 బెరైటిస్‌లో బొక్కింది ఎంత?
 అంతర్జాతీయ మార్కెట్‌లో కన్నా రాష్ట్రంలో బెరైటిస్ ధర తక్కువగా ఉన్నప్పుడు దానిని పెంచాల్సింది పోయి ఇంకా ధరను తగ్గించి ఇచ్చారు. ఎఫ్‌ఓబీ ధర 75 శాతం ఉంటే దాన్ని 65 శాతానికి తగ్గించిన కారణంగా బెరైటిస్ కాంట్రాక్టర్లంతా రింగ్ అయి... రిజర్వుడు ధర కన్నా కేవలం ఒక్క 50 రూపాయలు మాత్రమే పెంచి టెండర్లు వేసిన సంఘటన మన కళ్ల ముందే జరిగింది. స్థానికంగా ఉన్న 200 మిల్లులకు 40 శాతం బెరైటిస్‌ను ఇవ్వాలనే నిబంధనను కాదని తనకు ఇష్టమొచ్చిన వ్యక్తులకు ధారాదత్తం చేసి 40 వేల మంది కడుపు కొట్టారు.
 
రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెబుతూనే మరోవైపు 2008 నుంచి పారిశ్రామిక రాయితీల బకాయిల ఫైలును ఆగమేఘాలపై దులిపి రూ.2,060 కోట్లు చెల్లించిన వ్యవహారంలో 30 శాతం మేరకు కమిషన్లు కొట్టేశారు.
 
తమకు ఇష్టమైన పలు డిస్టిలరీలు ఉత్పత్తులు పెంచుకోవడానికి అనుమతులిచ్చారు.
 
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఇసుక దందా పెద్దఎత్తున సాగుతోంది.
 
రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న భూములను స్విస్ ఛాలెంజింగ్ పద్థతిలో ఇస్తామని చంద్రబాబు చెప్పడమంటే... తనకు కావాల్సిన వాళ్లకు భూములు ఇస్తారనే.
 
అంతర్జాతీయంగా బొగ్గు ధరలు 25 శాతం మేరకు తగ్గితే ఏపీలో మాత్రం తగ్గవని బొగ్గు సరఫరాదారులనుంచి ముడుపులు తీసుకుని అధిక ధరలకు బొగ్గును తీసుకుంటున్నారు.
 
రాష్ట్రంలో అసాధారణ ధరలకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడం వెనుక ముడుపులు తీసుకుంటున్నారు.
Share this article :

0 comments: