నేటి నుంచి రెండు రోజులపాటు జగన్‌ సమరదీక్ష - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేటి నుంచి రెండు రోజులపాటు జగన్‌ సమరదీక్ష

నేటి నుంచి రెండు రోజులపాటు జగన్‌ సమరదీక్ష

Written By news on Wednesday, June 3, 2015 | 6/03/2015


బాబు మోసాలపై జగన్ సమరం
 ⇒ నేటి నుంచి రెండు రోజులపాటు ప్రతిపక్ష నేత సమరదీక్ష
 ⇒ మంగళగిరి ‘వై’ జంక్షన్
  ⇒ సమీపంలో సువిశాల దీక్షా శిబిరం
 ⇒ ప్రజలకు, కార్యకర్తలకు
 ⇒ అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు


 సాక్షి ప్రతినిధి, గుంటూరు: అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసపుచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని ఎండగడుతూ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం నుంచి చేపడుతున్న సమరదీక్షకు సర్వం సిద్ధమైంది. రెండు రోజుల పాటు సాగే సమరదీక్షకు గుంటూరు జిల్లా మంగళగిరి ‘వై’ జంక్షన్ సమీపంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. చంద్రబాబు మోసాలపై ప్రజల్లో ఎండగట్టడంతో పాటు ఇచ్చిన హామీలను అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే లక్ష్యంతో ఈ దీక్ష చేపడుతున్నారు.

జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సువిశాల ప్రదేశంలో దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరానున్న పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు అసౌకర్యం కలగకుండా పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి గురువారం సాయంత్రం 5 గంటల వరకు వైఎస్ జగన్ దీక్షను కొనసాగిస్తారు. ప్రధానంగా వ్యవసాయ రుణాల మాఫీ, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామన్న హామీ నిలబెట్టుకోకపోవడం, ఇంటింటికీ ఉద్యోగం.. లేనిపక్షంలో నిరుద్యోగులకు నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్న మాటను విస్మరించడం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో కీలకమైన ప్రత్యేక హోదాను సాధించడంలో విఫలం కావడం, రాజధాని పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములను సమీకరించి వారి జీవితాలను బజారున పడేయడం వంటి కీలక అంశాలపై ఈ వేదిక ద్వారా సర్కారుపై సమర శంఖం పూరించనున్నారు.


ప్రజల్ని ఏ విధంగా మోసం చేసిందీ జగన్ ఈ సమరదీక్షలో ఎండగట్టనున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసగిస్తున్న వైనంపై వైఎస్సార్ సీపీ గత నవంబర్, డిసెంబర్ నెలల్లో మండల, జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించింది. జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రెండు రోజుల నిరాహార దీక్షలను పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన విషయం తెలిసిందే. బుధవారం నాటి సమరదీక్ష కోసం జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో బయలుదేరి ఉదయం 10 గంటలకు నేరుగా దీక్షాస్థలికి చేరుకుంటారని ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్ తెలిపారు.

 తరలివచ్చిన అభిమానులు, నేతలు
 సమరదీక్ష ప్రారంభానికి ఒక రోజు ముందే మంగళగిరి పట్టణం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, వివిధ జిల్లాల నేతలతో నిండిపోయింది. రుణమాఫీ హామీని నమ్మి మోసపోయిన అనేక మంది రైతులు, నిరుద్యోగ భృతికి ఆశపడి ఓటు వేసిన నిరుద్యోగులు,  రాజధాని నిర్మాణం పేరుతో భూములు కోల్పోయిన రైతులు, వ్యవసాయ కార్మికులు దీక్షా స్థలికి చేరుకున్నారు. దీక్షలో పాల్గొనేందుకు తమిళనాడులోని సేవాదళ్ సభ్యులు మంగళవారం చెన్నై నుంచి బయలు దేరారు. సేవాదళ్ తమిళనాడు ప్రధాన కార్యదర్శి మేడగం శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి, అధికార ప్రతినిధి సైకం రామకృష్ణారెడ్డి నాయకత్వంలో పలు వాహనాల్లో చెన్నై మధురవాయల్ నుంచి బయలుదేరారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మంగళగిరిలో స్థానికంగానే ఉంటూ ఏర్పాట్లను పర్యవేక్షించారు. గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇతర సీనియర్ నాయకులు సమరదీక్ష విజయానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్, సభాస్థలిలో తొక్కిసలాట జరగకుండా బారికేడ్లు, మంచినీటి సౌకర్యం, అంబులెన్స్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.

 కలవరంలో టీడీపీ: విజయసాయి రెడ్డి
 సమరదీక్షా శిబిరంలో జగన్‌మోహన్‌రెడ్డి ఏవిషయంపై మాట్లాడతారోనని టీడీపీ పాలకుల్లో కలవరం పుడుతోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఏడాది పాలనలో వివిధ వర్గాల ప్రజల్ని మోసం చేయడమే కాకుండా ఎమ్మెల్సీ ఓటు కొనుగోలుకు టీడీపీ దిగజారుడు విధానాలపై జగన్ ప్రసంగిస్తారని ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
Share this article :

0 comments: