ఆధారాలు ఉన్నా అరెస్టు చేయరా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆధారాలు ఉన్నా అరెస్టు చేయరా?

ఆధారాలు ఉన్నా అరెస్టు చేయరా?

Written By news on Tuesday, June 2, 2015 | 6/02/2015


ఆధారాలు ఉన్నా అరెస్టు చేయరా?
రేవంత్ ‘బాస్’ చంద్రబాబుపై కేసు పెట్టరా?
   
ఓటుకు నోటు వ్యవహారంలో సర్కారు తీరుపై విమర్శలు
సూత్రధారి బాబేనని రేవంత్ చెప్పినా కేసు నమోదుకు వెనుకంజ
స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు!
ఏసీబీ వద్ద పక్కా ఆధారాలున్నా మౌనమెందుకో?
చంద్రబాబు పాత్రపై గవర్నర్‌కు, కేసీఆర్‌కు వివరించిన అధికారులు
ముఖ్యమంత్రితో డీజీపీ భేటీ, గవర్నర్‌ను కలిసిన కేసీఆర్, సీఎస్

 
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాత్ర ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నా కేసు నమోదులో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నామినేటెడ్ ఎమ్మెల్యేను ప్రలోభపెట్టేందుకు రూ.50 లక్షలు ఇవ్వజూపి ఏసీబీకి పట్టుబడిన  తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి స్వయంగా బాస్(చంద్రబాబు) పేరెత్తిన సంగతి తెలిసిందే. బాస్ ఆదేశాల మేరకే తాను రూ.50 లక్షలు ఇస్తున్నట్లు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రేవంత్ అంటున్న మాటలు వీడియోలో స్పష్టంగా  రికార్డయింది. ఇదంతా జరిగి 24 గంటలు గడిచినప్పటికీ చంద్రబాబుపై కేసు నమోదు చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆడియో, వీడియో సాక్ష్యాధారాలతో పాటు ఫోన్ సంభాషణలన్నీ ఈ వ్యవహారంలో తెర వెనుక సూత్రధారులెవరో దేశమంతటికీ చాటిచెప్పాయి. తమ బాస్ చంద్రబాబు పంపిస్తేనే ఈ డీల్‌కు వచ్చినట్లు రేవంత్‌రెడ్డి పలుమార్లు ప్రస్తావించినట్లు వీడియో ఫుటేజీ ద్వారా స్పష్టమైంది. అవసరమైతే చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడిస్తానంటూ రేవంత్ తన సెల్‌ఫోన్‌ను స్టీఫెన్‌సన్‌కు అందించే ప్రయత్నం చేయడం జనానికి కళ్లకు కట్టినట్లు కనిపించింది. దీనికి సంబంధించి అవినీతి నిరోధక శాఖ వద్ద బలమైన సాక్ష్యాధారాలే ఉన్నాయని తెలుస్తోంది. చంద్రబాబు స్వయంగా స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినట్లు చెబుతున్న వీడియో కూడా ఏసీబీ వద్ద ఉన్నట్లు అత్యున్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు, ఇందులో చంద్రబాబు ప్రమేయముందని ప్రాథమిక దర్యాప్తులోనే ఏసీబీ నిర్ధారణకు వచ్చింది. కానీ, ఈ కేసుకు సంబంధించి నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఏ1గా రేవంత్‌రెడ్డి, ఏ2గా సెబాస్టియన్ హ్యారీ, ఏ3గా ఉదయసింహ, ఏ4గా మాథ్యూస్ జెరూసలేం(మత్తయ్య) పేర్లను పొందుపరిచారు.

కేసు నమోదు చేయకపోవడంపై విమర్శలు
ఈ వ్యవహారంలో చంద్రబాబు పాత్ర ఉన్నట్టు స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ ఏసీబీ కేసు నమోదు చేయకపోవడం విస్తుగొలుపుతోంది. రూ.5 కోట్ల డీల్ వెనుక ఉన్న సూత్రధారిపై కేసు నమోదు చేసే విషయంలో తాత్సారం చేయడంపై రెండు రాష్ట్రాల్లోనూ విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి హోదాలో ఉండటంతో ఈ కేసు నుంచి బాబును ఉద్దేశపూర్వకంగానే తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. 1993లో లోక్‌సభ సభ్యుల ఓట్లను కొన్నారన్న అభియోగం వచ్చినందుకే అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావుపై సీబీఐ కేసు పెట్టడం గమనార్హం. నలుగురు జేఎంఎం ఎంపీల బ్యాంకు అకౌంట్లలో రూ.1.33 కోట్లు  డిపాజిట్ చేసిన అభియోగాలపై పీవీని అప్పట్లో ముద్దాయిగా పేర్కొంది. కానీ అంతకు రెండింతలకు మించిన భారీ ముడుపుల డీల్‌లో సూత్రధారి అయిన చంద్రబాబును ఏసీబీ అరెస్టు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన సమాచారం ప్రకారం చంద్రబాబుపై కేసు నమోదుకు ఎలాంటి ఇబ్బంది లేదని న్యాయ నిపుణులుసైతం అభిప్రాయపడుతున్నారు.
 
ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి
ఈ కేసులో సూత్రధారిని వదిలేసి పాత్రధారిపై దృష్టి సారించారంటూ అన్ని వైపుల నుంచి ఆరోపణలు రావడంతో పోలీసు అధికారులు తమ వద్ద ఉన్న ఆధారాలను ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు సమర్పించినట్లు విశ్వసనీయ సమాచారం. స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడారంటూ రాష్ట్ర మంత్రి జగదీష్‌రెడ్డి ఏకంగా మీడియా సమావేశంలో వెల్లడించారు. మరోవైపు డీజీపీ అనురాగ్‌శర్మ సీఎం అధికారిక నివాసానికి వెళ్లి మరీ కేసీఆర్‌ను కలిశారు. ఈ కేసు పురోగతిని వివరించారు. అంతకుముందే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ గవర్నర్ నరసింహన్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముడుపుల కేసులో చంద్రబాబు పాత్రపై పోలీసుల వద్ద ఉన్న ఆధారాలను ఆయన గవర్నర్ దృష్టికి తెచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్‌తో భేటీ అయ్యారు. చంద్రబాబు వ్యవహారంపైనే చర్చించినట్లు సమాచారం.
 

ఫోన్ సంభాషణలతో చిక్కిన బాబు!
ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలపై రూపొందించిన నివేదికను సోమవారం ఉదయాన్నే ప్రభుత్వానికి ఏసీబీ అందించింది. ఇప్పటివరకు మీడియాలో వచ్చిన వీడియోలతోపాటు చంద్రబాబు స్వయంగా స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన ఫోన్ సంభాషణలు సైతం ఏసీబీకి చిక్కినట్లు సమాచారం. అవి లీక్ కాకుండా జాగ్రత్తపడిన అధికారులు కేసు విచారణ సందర్భంగా వాటిని నేరుగా కోర్టుకు అందించనున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ ఇచ్చిన నివేదికలో ఈ వివరాలుండటంతో ఈ వ్యవహారం తెలంగాణ మంత్రివర్గంలో హాట్‌టాపిక్‌గా మారాయి. ‘చంద్రబాబు సైతం కేసులో ఇరుక్కున్నారు.. ఈ డీల్‌లో ఆయన మాట్లాడిన ఆడియో టేపులు కూడా తొందరలోనే బయటికొస్తాయి’ అని ఓ సీనియర్ మంత్రి ధ్రువీకరించడం గమనార్హం.
 
Share this article :

0 comments: