సర్కారు ఉక్కుపాదం మోపినా..చెదరని ప్రత్యేక సంకల్పం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సర్కారు ఉక్కుపాదం మోపినా..చెదరని ప్రత్యేక సంకల్పం

సర్కారు ఉక్కుపాదం మోపినా..చెదరని ప్రత్యేక సంకల్పం

Written By news on Sunday, August 30, 2015 | 8/30/2015


సర్కారు ఉక్కుపాదం మోపినా..చెదరని ప్రత్యేక సంకల్పం
- అడుగడుగునా పోలీసు అరెస్టులు
- ఆందోళన భగ్నానికి సర్కారు కుట్ర
- అయినా ఆగని ప్రత్యేక పోరాటం
- వామపక్ష, ప్రజాసంఘాల మద్దతు
- జిల్లాలో బంద్ సంపూర్ణం
- ఏజెన్సీ, గ్రామీణంలో స్తంభించిన జనజీవనం
విశాఖపట్నం:
 సమైక్యాంధ్ర ఉద్యమంలో చూపిన పోరాటపటిమ శనివారం మరోసారి ప్రస్ఫుటమైంది. ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్‌సీపీ ఇచ్చిన పిలుపునకు జిల్లా ప్రజానీకం నుంచి మంచి స్పందన లభించింది. బంద్ భగ్నానికి పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టుల పర్వం నడిపినా ఉద్యమ స్ఫూర్తి కొనసాగింది. ఆందోళనకు సంకెళ్లు వేసినా పోరాట పటిమను వీడలేదు. పార్టీ శ్రేణులు..మద్దతు పలికిన వామపక్షాలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ,కార్మిక సంఘాలు కలిసి కదంతొక్కాయి. ఒకపక్క రాఖీ పండగను ఆస్వాదిస్తూనే ప్రత్యేక హోదాకోసం ఆందోళనపథం సాగించారు.  

వైఎస్సార్ సీపీ శ్రేణులు వ్యూహాత్మక వైఖరిననుసరిస్తూ బంద్ విజయవంతం చేశాయి. విశాఖఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద తెల్లవారుజామున 4గంటల నుంచే పార్టీ నాయకులు..కార్యకర్తలు బస్సులను అడ్డుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకుని పహారా మధ్య బస్సులను తిప్పేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. ఉదయం 8గంటల వరకు బస్సులు పూర్తిగా డిపోలకే పరిమితం కాగా ఆ తర్వాత రోడ్లపైకివచ్చాయి. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం మధ్యాహ్నం వరకు బస్సుల జాడలేదు.  

జగదాంబ వద్ద ఆందోళన చేస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డితోపాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అనకాపల్లిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్..పాడేరులో ఎంఎల్‌ఎ గిడ్డి ఈశ్వరితోపాటు నియోజకవర్గాల్లో పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా వ్యాప్తంగా 700మందిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 60 మందిపై వివిధ కేసులు బనాయించగా, మిగిలిన వారిని సొంతపూచీకత్తుపై విడిచి పెట్టారు.
 
స్తంభించిన జనజీవనం: జిల్లా వ్యాప్తంగా ష్రాపింగ్ మాల్స్‌తో పాటు బంగారు దుకాణాలు సైతం తెరుచుకోలేదు. అన్ని దుకాణాలు మూతపడ్డాయి.మల్టీఫ్లెక్స్‌లతో సహా సినిమా థియేటర్లలో ఉదయం ఆటలను నిలిపివేశారు. బ్యాంకులు పని చేయలేదు. ప్రైవేటువిద్యాసంస్థలన్నీ మూత పడ్డాయి. ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబ, మద్దిలపాలెం, ఎన్‌ఎడీ, బిర్లా, గురు ద్వార, డైమండ్ పార్కు, ద్వారకా నగర్, సీతమ్మధార, పెదవాల్తేరు, పూర్ణామార్కెట్, మెయిన్‌రోడ్, గాజువాక, గోపాలపట్నం,స్టీల్‌ప్లాంట్ తదితర ప్రధానకూడళ్లల్లో బంద్ ప్రభావం స్పష్టంగా కన్పించింది. బలవంతంగా ప్రభుత్వ విద్యా సంస్థలను తెరిపించినా విద్యార్థుల లేక వెలవెల బోయాయి.

ఏయూలో డిగ్రీ పరీక్షలు వాయిదా వేశారు. యూనివర్శిటీ ఉద్యోగులు బంద్‌కు సంఘీబావంగా ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. సాగర్ నగర్ బీచ్‌రోడ్ నుంచి జగదాంబ జంక్షన్ వరకు యువజన విభాగం ఆధ్వర్యంలో బైకు ర్యాలీ చేశారు. చిప్పాడవద్ద దివీస్ లేబరేటరీలో ఉద్యోగులు వెళ్లనీయకుండా సుమారు ఐదుగంటల పాటు పార్టీ శ్రేణులు అడ్డగించారు. ఇలా స్తంభించిపోవడం ఈ లేబరేటరీ చరిత్రలో ఇదే తొలిసారి.అనకాపల్లి, నక్కపల్లి, పాయక రావుపేట, భీమిలి తదితరప్రాంతాల్లో రాస్తారోకోలు జరగడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.
 
వామపక్షాల సంఘీభావం: బంద్‌కు వామపక్షాల నుంచి సంపూర్ణమద్దతు లభించింది. సీపీఎం రాష్ర్ట కార్యవర్గదర్శి సభ్యుడు సీహె చ్. నరసింగ రావు, జిల్లా కార్యదర్శి అజయ్‌శర్మ, సీపీఐ జిల్లా కార్యదర్శి ఏజే స్టాలిన్‌ల ఆధ్వర్యంలో వామపక్షాల శ్రేణులు ప్రజాసంఘాలు జిల్లా వ్యాప్తంగా బంద్‌లో పాల్గొన్నాయి.  వామపక్షాలకు చెందిన సుమారు 200మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
 
జిల్లా వ్యాప్తంగా 992 మంది అరెస్ట్
అల్లిపురం :
 ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం చేపట్టిన రాష్ట్ర బంద్‌ను విఫలయత్నం చేసేందుకు పోలీసులు శాయశక్తులా ప్రయత్నించారు. ఉదయం 5 గంటల నుంచే బంద్‌లో పాల్గొన్న కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 379, సీపీఎంకి చెందిన 143, సీపీఐకి చెందిన 138 మంది నాయకులు, కార్యకర్తలను సెక్షన్ 151 సీఆర్‌పీసీ ప్రకారం అరెస్ట్ చేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. రూరల్ జిల్లాలో 386 మంది అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. వీరిలో 46 మందిపై వివిధ సెక్షన్లలో కేసులు నమోదు చేశారు.

శనివారం మధ్యాహ్నం జగదాంబ కూడలిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి విజయసాయిరెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, దక్షిణ నియోజకవర్గం కన్వీనర్ కోలా గురువులు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, ఎండీ ఫరూకీ, పోతల ప్రసాద్, రాష్ట్ర ఐటీ వింగ్ నేత చల్లా మధుసూదనరావుతో పాటు 72 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. ఇక్కడ 12 మంది సీపీఐ, 13 మంది సీపీఎం నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి తరలించారు. దీంతో టూటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విజయసాయిరెడ్డిని విడుదల చేయాలని కార్యకర్తలు టూటౌన్ గేటు వద బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు.

ఏజెన్సీలో రోడ్డెక్కని ఆటోలు

ఏజెన్సీలో బస్సులు పూర్తిగా డిపోలకు పరిమితమయ్యాయి. ఆటోలతో పాటుప్రైవేటు వాహనాలు కూడా రోడ్డెక్కలేదు. అనకాపల్లి, నర్సీపట్నం,యలమంచలి, భీమిలితో పాటు పాయకరావుపేట, పెందుర్తి, చోడవరంలతోపాటు పాడేరు, అరకు, మాడుగులల్లో బంద్ ప్రభావంతో జనజీవనం స్తంభించిపోయింది. అనకాపల్లి, నక్కపల్లి తదితర ప్రాంతాల్లో వేలాదిగా పార్టీ శ్రేణులు ఆందోళన బాటపట్టాయి. పెదబయలులో రోడ్లపైనే వంట వార్పుతో నిరసన వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: