పోలింగ్ చెప్పిన నిజం! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పోలింగ్ చెప్పిన నిజం!

పోలింగ్ చెప్పిన నిజం!

Written By news on Wednesday, June 13, 2012 | 6/13/2012

ఏమైనా చేసి, ఎంతకైనా తెగించి జనాభీష్టాన్ని ఏమారుద్దామని చూసిన కాంగ్రెస్, తెలుగుదేశం ప్రయత్నాలను ఓటర్లు వమ్ముచేశారు. పోలింగ్ కేంద్రాలముందు మునుపెన్నడూ లేనివిధంగా ఉదయంనుంచే భారీయెత్తున బారులు తీరి... అన్నివిధాలా భ్రష్టుపట్టిన పాలక, ప్రధాన ప్రతిపక్షాలకు తిరుగులేని జవాబిచ్చారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి దాదాపు 80 శాతం ఓటింగ్ జరగడం ఆ రెండు పార్టీలపైనా ప్రజల్లో గూడుకట్టుకుని ఉన్న ఏవగింపును వ్యక్తపరుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమ కేసుల్లో ఇరికించి, సరిగ్గా ప్రచార సమయంలో అరెస్టుచేసి ఆయన గొంతు వినబడనీయకుండా చేద్దామనుకున్న ఇరుపక్షాల కుట్రా జనాగ్రహం ముందు కొరగాకుండాపోయింది. అభ్యర్థుల్ని నిలబెట్టడం దగ్గరనుంచి పరస్పరం సహకరించుకుంటూ వచ్చి, విచ్చలవిడిగా నోట్లు వెదజల్లి, వదంతులకు, దుష్ర్పచారాలకు దిగి ఆ రెండు పార్టీలూ చివరకు సాధించింది మాత్రం గుండుసున్నాయేనని మంగళవారంనాటి పోలింగ్ సరళి స్పష్టంచేసింది. 

అసలు ఉప ఎన్నికలనేవే లేకుండా చేయడానికి ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నిందని? జగన్‌ను అరెస్టుచేసి, ఆ వంకన హింసాకాండను రెచ్చగొట్టి, పోలింగ్ వాయిదాపడేలా చూడటానికి ఎంతగా ప్రయత్నిం చిందని? అయితే, ఇవేమీ ఫలించలేదు. తనను అరెస్టుచేసినా ఎవరూ రెచ్చిపోవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఉప ఎన్నికలు జరిగితీరాలని, అందరూ సంయమనంపాటించి ఇందుకు సహకరించాలని జగన్ ముందే విజ్ఞప్తిచేశారు. ఇక జరగక తప్పని ఉప ఎన్నికల కోసం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స, చిరంజీవి కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగారు. తామంతా ఒక్కటిగా ఉన్నామని చెప్పడానికి ప్రయత్నించారు. అటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు తన పార్టీ తరఫున ప్రచారాన్ని నడిపించారు. వీళ్లందరి ప్రసంగాల సారాంశం ఒక్కటే... జగన్! చెప్పుకోవడానికి చేసిన పథకాలుగానీ, కార్యక్రమాలుగానీ లేక అందరూ కలిసి ఆయనను లక్ష్యంగా ఎంచుకున్నారు. జగన్ అరెస్టయ్యాక వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, షర్మిల పాల్గొన్న సభలే జనం నాడిని పట్టిచెప్పాయి. పోలింగ్ తేదీ ఎప్పుడొస్తుందా, ఎప్పుడు ఈ రెండు పార్టీలకూ బుద్ధి చెబుదామా అని ప్రజలంతా ఎదురుచూశారు.

అసలు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైననాటినుంచీ కాంగ్రెస్, తెలుగుదేశం, సీబీఐ కుమ్మక్కై జగనే లక్ష్యంగా విష ప్రచారాన్ని లంకించుకున్నాయి. ఒక రాజకీయ నాయకుడి కులం గురించీ, మతం గురించీ బాహాటంగా మాట్లాడిన ఘనత, తిరుపతి వెంకటేశ్వరుడి దర్శనాన్ని సైతం వివాదాస్పదం చేద్దామని చూసిన ఘనత ఆ రెండు పార్టీల నేతలదే. ఇవేమీ పారకపోవడంతో, నానాటికీ జగన్ ప్రభావం పెరిగిపోతుండ టంతో ‘సాక్షి’ మీడియా గొంతునొక్కాలని చూశారు. గత నెల 8న సీబీఐ ద్వారా ‘సాక్షి’ పత్రిక, ‘సాక్షి టీవీ’ అకౌంట్లను స్తంభింపజేయడంతో మొదలుకొని, వాటికి ప్రభుత్వ ప్రకటనలు దక్కకుండా చేసి ఆర్ధికంగా దెబ్బతీద్దామని చూడటం, ‘సాక్షి’ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు పూనుకోవడం వరకూ ప్రభుత్వం పన్నిన కుట్రలు ఎన్నెన్నో. వీటన్నిటి పరమార్ధం ఒకటే... ప్రత్యామ్నాయ గొంతు నులిమి, తమ కనుసన్నల్లో మెలిగే ఎల్లో మీడియా ద్వారా తాము చెప్పిందే జనం నిజమని నమ్మేలా చేయాలన్నదే. 

ఈ కుట్రలేవీ ఫలించకపోవడంతో, ప్రజల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఆదరణ పెరుగుతుండటంతో ఇక జగన్‌ను అక్రమ పద్ధతుల్లో అరెస్టుచేయించింది. తొమ్మిదినెలలుగా విచారణ సాగిస్తున్న సీబీఐ, అప్పుడే గుర్తుకొచ్చినట్టుగా హఠాత్తుగా రంగంలోకి దిగి ఆయనను ప్రశ్నించే పేరు మీద పిలిచి అరెస్టు చేసింది. ఇదంతా చాలదన్నట్టు ఉప ఎన్నికల పోలింగ్ ముందురోజున జగన్‌ను ఒక సాధారణ ఖైదీలా వ్యాన్‌లో తరలించి, జనంలో ఆయనకున్న పేరు ప్రతిష్టలను దెబ్బతీద్దామని ప్రయత్నించింది. 

ఆ విధంగా జగన్‌కున్న జనాదరణను తగ్గించి, ఉప ఎన్నికల్లో లాభపడదామని చూసింది. అయితే, ప్రజల ద్వారా అధికారం సంక్రమించకుండా, పైవాళ్ల దయతో పీఠంపై కూర్చున్నవారికి జనం గడ్డిపోచ విలువివ్వరని... వారు తీసుకునే ఎలాంటి చర్యలైనా వారికే తిప్పికొడతాయని ఉప ఎన్నికల పోలింగ్ సరళి నిరూపించింది. కనీవినీ ఎరుగని విధంగా జనం పోలింగ్ కేంద్రాలముందు బారులు తీరడంలోని అంతరార్ధం ఇదే. తమ అభిమాన నాయకుడిని తమనుంచి విడదీసి, ఆయనను అవమానించడానికి విపక్షంతో కుమ్మక్కయిన అధికార కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలన్న నిశ్చయంతోనే వారు అంతగా తరలివచ్చారన్నది సుస్పష్టం.


ఈ ఉప ఎన్నికల్లో ఆ రెండు పార్టీల నాయకులూ ఒక ప్రమాదకరమైన సంప్రదా యానికి తెరతీశారు. ఇన్నాళ్లూ డబ్బు, మద్యం, చీరలు, బంగారంలాంటివన్నీ ఓటేయడానికి ఇస్తుండగా, ఇప్పుడు మాత్రం ఓటరు పోలింగ్ కేంద్రంవైపు కన్నెత్తి చూడకుండా ఉండటానికి బంపర్ ఆఫర్లు బయల్దేరాయి. తాము ఎన్ని చేసినా, ఎంత ఇచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్‌కే జనం పట్టంగడతారని తెలుసుకున్న ఈ పార్టీలు... వారిని ఓటే వేయనీయకుండా ప్రయత్నించాయి. ఇలాంటి చర్యలు ఇప్పటికే అస్తవ్యస్థంగా, బలహీనంగా ఉన్న మన ప్రజాస్వామ్య వ్యవస్థను మరింతగా దెబ్బ తీస్తాయి. 

తాము జగన్‌ను ఎందుకు వ్యతిరేకించాలో, ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తమకే అర్ధంకాని అయోమయంలో కాంగ్రెస్, తెలుగుదేశం ఉన్నాయి. అలాగే, ప్రజల్లో గూడుకట్టుకున్న ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా ఎలా మలుచు కోవాలో తెలుగుదేశానికి అర్ధమే కావడం లేదు. ఈ గందరగోళంలో ఆ రెండు పార్టీలూ చేతికి దొరికినదాన్ని ప్రయోగిస్తున్నాయి. బుర్రకు తట్టినదాన్ని అమలు చేస్తున్నాయి. దాని పర్యవసానమే ఈ తరహా బంపర్ ఆఫర్లు. ఉప ఎన్నికల్లో పోలింగ్ సరళిని చూసైనా, కనీసం ఫలితాలు వెలువడినాక అయినా ఆ పార్టీలు ఆత్మవిమర్శ చేసుకుని, ఈ తరహా వ్యవహారశైలికి స్వస్తిపలకాలి. ఎదుటివారిపై బురదజల్లి, దుష్ర్పచారంచేసి పబ్బం గడుపుకోవాలనుకునే రాజకీయాలు కొనసాగిస్తే శాశ్వతంగా సమాధికావడం ఖాయమని గ్రహించాలి.
Share this article :

0 comments: