వైఎస్సార్ సీపీ అభ్యర్థుల గెలుపు ఖాయమన్న సర్వేలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సీపీ అభ్యర్థుల గెలుపు ఖాయమన్న సర్వేలు

వైఎస్సార్ సీపీ అభ్యర్థుల గెలుపు ఖాయమన్న సర్వేలు

Written By news on Wednesday, June 13, 2012 | 6/13/2012

* ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల గెలుపు ఖాయమన్న సర్వేలు
* అదే విషయం స్పష్టం చేస్తోన్న పోలింగ్ సరళి
* అన్నిచోట్లా ఇదే చర్చ.. కాంగ్రెస్, టీడీపీల్లో ఆందోళన
* ఎన్ని కుట్రలు చేసినా అడ్డుకోలేకపోయామని విస్మయం
* ఒకట్రెండు సీట్లైనా గెలుచుకుంటామంటూ పైకి గాంభీర్యం
* ఓటమికి సాకులు వెతికే పనిలో ఇరు పార్టీలు నిమగ్నం
* నేతల హడావిడి లేక గాంధీభవన్, ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లు వెలవెల

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉప ఎన్నికల్లో అన్ని చోట్లా ఫ్యాన్ హవా స్పష్టంగా కనబడింది. ఉప ఎన్నికలు జరిగిన ఒక లోక్‌సభ, 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తారని అన్ని పార్టీల అంతర్గత నివేదికలు, దాదాపు అన్ని సర్వేలు, పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్, ఇంటి లిజెన్స్ నివేదికలు సైతం తేల్చాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి కీలకమైన రాష్ట్రంలో జరిగిన ఈ ఉప ఎన్నికల ఫలితాల కోసం దేశం యావత్తూ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 

మంగళవారం పోలింగ్ మొదలైనప్పటి నుంచి సాయంత్రం వివిధ టీవీ చానెళ్లు ప్రసారం చేసిన ఎగ్జిట్‌పోల్స్ వరకు.. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపైనే చర్చ జరిగింది. ఫలితాలను పలు కోణాల్లో విశ్లేషించిన తర్వాత అన్ని చోట్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిందని తేల్చారు. పోలింగ్ పూర్తయిన తర్వాత వచ్చిన అంతర్గత నివేదికలను చూసి అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల నేతల్లో ఆందోళన స్పష్టంగా కనిపించింది. 

నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గంతో పాటు 17 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు స్పష్టమైన మెజారిటీతో విజయం సాధిస్తారని అన్ని సర్వేలు కొంచెం అటుఇటుగా ఒకేరకమైన ఫలితాలనిచ్చాయి. పరకాల అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్య పోటాపోటీగా ఉందని చెప్పాయి. ఇక్కడ ఏ పార్టీ గెలిచినా స్వల్ప ఆధిక్యత మాత్రమే లభిస్తుందని పేర్కొన్నాయి. 

హెడ్‌లైన్స్ టుడే ఆంగ్ల చానల్ 12 నుంచి 15 చోట్ల వైఎస్సార్ సీపీ విజయం సాధిస్తుందని పేర్కొనగా, కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మెజారిటీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులే విజయం సాధిస్తారని చెప్పారు. అయితే వివిధ నియోజకవర్గాల్లో పోలింగ్ సరళి, అన్నిచోట్లా అత్యధిక సంఖ్యలో మహిళా ఓటర్లు తరలిరావడాన్ని బట్టి.. ఒక లోక్‌సభ స్థానం సహా 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు తథ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. 

వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవడంతో పాటు డబ్బుల పంపిణీ, అధికార దుర్వినియోగంతో సర్వశక్తులూ ఒడ్డిన కాంగ్రెస్, టీడీపీ నేతలకు ఈ పరిస్థితి ఏమాత్రం మింగుడుపడలేదు. దాంతో నాయకులు సాకులు వెతుక్కునే పనిలో పడ్డారు. పైకి మాత్రం గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ మూడు నాలుగు స్థానాల్లో విజయం సాధిస్తామని చెబుతున్నారు. సానుభూతి పనిచేసిందంటూ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే వ్యాఖ్యానాలు మొదలుపెట్టారు. అయితే లోలోపల మాత్రం తదనంతర రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన పడుతున్నారు. 

సర్వశక్తులూ ఒడ్డినా...
వైఎస్సార్ కాంగ్రెస్ జోరును నిలువరించడానికి అన్నిరకాలుగా ప్రయత్నించినా ఫలితం దక్కడం లేదనే వాస్తవం కాంగ్రెస్, టీడీపీలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పార్టీలు ప్రతిచోటా విచ్చలవిడిగా డబ్బులు, మద్యం పంచాయనే విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అనేకచోట్ల అధికార దుర్వినియోగానికి పాల్పడింది. సీబీఐ అరెస్టుతో ఉప ఎన్నికల ప్రచారానికి జగన్‌ను దూరం చేయడం, పరస్పర అవగాహన నేపథ్యంలో.. తమకు అనుకూలంగా ఉంటాయని భావించిన నియోజకవర్గాల్లో సైతం ఫలితాలు ప్రతికూలంగా వెల్లడికానున్నాయనే సమాచారం ఆ పార్టీల నేతలకు అంతుబట్టడం లేదు. 

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఓట్లు వేస్తారని అనుమానాలున్న ప్రాంతాల్లో ఓటర్ల నుంచి పోల్ స్లిప్పులను కొనుగోలు చేసి వారిని పోలింగ్‌నకు రాకుండా నిరోధించడం, కోవూరుకన్నా మించి కొన్ని చోట్ల ఓటుకు మూడు వేల వరకు చెల్లించడం, తిరుపతి లాంటి చోట పోలింగ్ రోజున బహిరంగంగానే డబ్బులు ఇవ్వడం, ఇన్‌చార్జీలుగా వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు సమీపంలోనే తిష్టవేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, హైదరాబాద్ నుంచి ముఖ్య నేతలు ఎప్పటికప్పుడు అధికారులను పురమాయించడం వంటి అనేక ఎత్తుగడలు వేసినా ఫలితం దక్కకపోవడం ఆ పార్టీల నేతల్ని విస్మయానికి గురిచేస్తోంది. 

వైఎస్సార్ కాంగ్రెస్‌ను అడ్డుకొనేందుకు పలు నియోజకవర్గాల్లో బహిరంగంగానే మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నప్పటికీ పరిస్థితి ఏమాత్రం అనుకూలంగా కనిపించకపోవడంపై కాంగ్రెస్, టీడీపీలు అయోమయంలో పడ్డాయి. స్పష్టమైన వ్యూహంతో మ్యాచ్ ఫిక్సింగ్‌లతో ఇంతలా పెనవేసుకొని పనిచేసిన ప్పటికీ చేదు ఫలితాలు తప్పడం లేదనే వాస్తవంతో వారిలో అంతర్మథనం ప్రారంభమైంది. కడప, పులివెందుల, కోవూరు ఉప ఎన్నికల్లో, అంతకుముందు శాసనమండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో రెండు పార్టీలు ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో నడిచినా తలబొప్పి కట్టింది. ఏకంగా డిపాజిట్లూ పోయాయి. ఈ పరిణామంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభావాన్ని తగ్గించేందుకు తెరవెనుక అనేకరకాల వ్యూహాలు పన్నినా.. ఈ ఉప ఎన్నికల్లో అవన్నీ పటాపంచలవుతున్నాయన్న వార్తలను కాంగ్రెస్, టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. 2014 ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న ఈ ఉప ఎన్నికల ఫలితాల ప్రభావం తమ పార్టీలపై తీవ్రంగానే ఉంటుందనే అంతర్గత అంచనాకు వచ్చారు. 

వైఎస్సార్ కాంగ్రెస్‌తో కాంగ్రెస్ దాదాపు ఖాళీ అయిపోతున్న సమయంలో.. తాము విజయం సాధించలేకపోతే రాష్ట్రంలో తమకూ నూకలుచెల్లినట్లే అవుతుందని టీడీపీ నేతలూ ఆందోళనతో ఉన్నారు. వాస్తవానికి ఈ ఆందోళనతోనే ఇరుపార్టీల నేతలూ గతంలో కన్నా ఈ ఉపఎన్నికల్లో మరింతగా అల్లుకుపోయి పనిచేశారు. కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంటుందని అంచనా ఉన్న నియోజకవర్గాల్లో ఆ పార్టీకి టీడీపీ మద్దతిచ్చేలా, టీడీపీ రెండో స్థానంలో ఉందన్న అంచనా ఉన్నచోట ఆపార్టీ అభ్యర్థులకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చేలా తెరవెనుక అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. అయినా ఫలితం దక్కే సూచనలు లేకపోవడంతో తర్జనభర్జనలు పడుతున్నారు.

భవిష్యత్ పరిణామాలపై కాంగ్రెస్ ఆందోళన 
ఉప ఫలితాలెలా ఉండబోతున్నాయో పోలింగ్ సరళి స్పష్టం చేయడంతో కాంగ్రెస్, టీడీపీల్లో రానున్న పరిణామాలపై గుబులు రేగుతోంది. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలు కూడా రాష్ట్రంలోని ఉప ఎన్నికల పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు రాష్ట్ర నేతల ద్వారా, నిఘా విభాగాల ద్వారా తెలుసుకున్నట్లు పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని కట్టడి చేయడంలో కిరణ్, బొత్సలు విఫలమవ్వడంతో వారి నాయకత్వం పట్ల అధినేతల్లో వ్యతిరేకాభిప్రాయాలు ఇప్పటికే ఉన్నాయని, ఉప ఫలితాలతో ఇది మరింత బలపడి కీలక మార్పులకు దారితీయకతప్పదని పార్టీ సీనియర్ నేత ఒకరు విశ్లేషించారు. పోలింగ్ సరళి గమనించిన నేతలు వాటిపై లోతుగా విశ్లేషించకుండా గప్‌చుప్‌గా మిన్నకున్నారు. వైఎస్సార్ పార్టీ అభ్యర్థుల గెలుపు మొత్తాన్ని సెంటిమెంటు ప్రభావంగా మాత్రమే చూపించే ప్రయత్నం చేశారు. సానుభూతి పనిచేసిందని ఒకరంటే, విజయమ్మ ప్రచారాలకు జనం కరిగిపోయారంటూ మరికొందరు చెబుతున్నారు. మెజారిటీ సీట్లు తమకే వస్తాయని చెప్పినప్పటికీ.. వాస్తవానికి కాంగ్రెస్ కొన్ని నియోజకవర్గాలపైనే ప్రధానంగా దృష్టి సారించింది. 

ముఖ్యంగా నర్సాపురం, రామచంద్రపురం, తిరుపతి, నర్సన్నపేట, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి బాగుంటుందని లెక్కలేసుకుని అక్కడ గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డారు. కేంద్ర మంత్రులు గులాంనబీ ఆజాద్, వయలార్ రవితోపాటు సీఎం, పీసీసీ చీఫ్, స్టార్ క్యాంపెయినర్‌గా భావించిన చిరంజీవిలు ఈ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. ఆయా నియోజకవర్గాల్లో డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేశారు. ఒక్కో నియోజకవర్గంలో రూ.10 నుంచి 15 కోట్ల వరకు వెచ్చించినట్లు పార్టీ నేతలు బాహాటంగానే చెప్పుకున్నారు. ఇంతా చేసి.. మంగళవారం సీఎల్పీ కార్యాలయానికి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఫలానా స్థానంలో గెలుస్తామని గట్టిగా ఎవరూ చెప్పలేకపోయారు. 

ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు ఆశాజనకంగా ఉంటాయని ఆశిస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రజలు అభివృద్ధి, సంక్షేమాన్ని ఆశించి ఓట్లు వేశారని భావిస్తున్నానన్నారు. ఉప ఎన్నికల పోలింగ్ అనంతరం గాంధీభవన్‌కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెల్లడించిన సర్వే ఫలితాలతో కాంగ్రెస్‌కు సంబంధం లేదని కొట్టిపారేశారు. ఉప ఎన్నికల ఫలితాలకు పార్టీ యావత్తు సమష్టి బాధ్యత వహిస్తుందన్నారు. ఫలితాలు ప్రతికూలంగా వస్తే పార్టీలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటామని, పార్టీ పరంగా తగిన మార్పులు చేస్తామని పేర్కొన్నారు. నేతలు, కార్యకర్తల హడావుడి లేక గాంధీభవన్ వెలవెలబోయింది.

కాంగ్రెస్ మాదిరే సాకులు వెతికే పనిలో టీడీపీ
ఉప ఎన్నికల ఫలితాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అంచనాలు తల్లకిందులు అయ్యాయని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నికల వేడి ప్రారంభమైనప్పటి నుంచి కనీసం ఏడు స్థానాల్లో గెలుస్తామని ఆ పార్టీ నేతలు చెప్తూ వచ్చారు. అయితే పోలింగ్ పూర్తయిన తరువాత అందిన అంతర్గత నివేదికలతో వారిలో ధీమా కొరవడింది. పార్టీ కార్యాలయంలో ఉన్న నాయకులను కదిలిస్తే రెండు స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయంటూ గాంభీర్యాన్ని ప్రదర్శించారు. 

ఉప ఎన్నికల పోలింగ్ రోజైన మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన నివాసానికే పరిమితమయ్యారు. అక్కడి నుంచే పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. దఫదఫాలుగా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో మోహరించి ఉన్న నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించటంతో పాటు వారిని ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు. అయితే పోలింగ్ ముగిసిన తరువాత నేతల నుంచి వచ్చిన సమాచారంతో నీరసపడిపోయారు. టీడీపీ కార్యాలయం బోసిపోయి కనిపించింది. 

కాంగ్రెస్ తరహాలోనే టీడీపీ కూడా ఓటమికి సాకులు వెతుక్కునే పనిలో పడింది. అంతేకాదు.. ఒక అడుగు ముందుకేసి ఏకంగా ఎన్నికల సంఘం పనితీరును తప్పుపట్టింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారని ఆరోపించింది. ఎన్నికల సంఘం ఉప ఎన్నికల నిర్వహణలో విఫలమైందని పార్టీ నేతలు దాడి వీరభద్రరావు, కంభంపాటి రామ్మోహనరావు, వైవీబీ రాజేంద్రప్రసాద్ పోలింగ్ ముగిసిన తరువాత ఎన్‌టీఆర్ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో విమర్శించారు. సీఈవో భన్వర్‌లాల్‌కు ఏ ప్యాకేజీలు అందాయో అంటూ నిందలు మోపారు. తామెన్ని ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు.
Share this article :

0 comments: