సర్కారీ దవాఖానాల్లో వెంటిలేటర్ల కొరత - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సర్కారీ దవాఖానాల్లో వెంటిలేటర్ల కొరత

సర్కారీ దవాఖానాల్లో వెంటిలేటర్ల కొరత

Written By news on Thursday, August 16, 2012 | 8/16/2012

* ప్రాణాపాయ పరిస్థితుల్లో రోగులకు అందని కృత్రిమ శ్వాస
* ఈ కారణంగా ఏడాదిలోనే 20 వేల మంది మృత్యువాత
* ఉస్మానియా, గాంధీలాంటి ప్రధాన ఆస్పత్రుల్లోనూ సమస్య
* పడకల సంఖ్యలో 30 శాతం వెంటిలేటర్లు ఉండాల్సి ఉండగా 5శాతం కూడా లేని వైనం
* ఒక్కో వెంటిలేటర్ కోసం వెయిటింగ్‌లో 15 మంది!
* రాష్ర్టంలో ఉన్న మొత్తం వెంటిలేటర్లు దాదాపు వెయ్యి.. వాటిలో సగం కూడా పనిచేయని దారుణ పరిస్థితి
* 2 వేల వెంటిలేటర్లు అవసరమైతే కేవలం 20 మాత్రమే కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలోని అనేక ప్రభుత్వాసుపత్రులు ప్రాణాలకు పూచీ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాయి. వైద్యులు, సిబ్బంది కొరతతో పాటు సాధారణ మందులూ కరువైన ఆస్పత్రుల్లో కనీసం అత్యవసర పరికరాలూ అందుబాటులో ఉండటం లేదు. ముఖ్యంగా ప్రాణాపాయ స్థితిలో ప్రభుత్వాసుపత్రులను ఆశ్రయిస్తున్న రోగులకు వెంటిలేటర్లు సమకూర్చడంలో వైద్య ఆరోగ్య శాఖ ఘోరంగా విఫలమైంది. దీంతో అత్యవసరంగా కృత్రిమ శ్వాస కోసం వ స్తున్న రోగులు చివరకు మృత్యువాత పడుతున్నారు. వెంటిలేటర్ల కొరత కారణంగా గత ఏడాది కాలంలో 20 వేల మంది చనిపోవడం పరిస్థితి ఆస్పత్రుల దుస్థితికి అద్దం పడుతుంది. ఆక్సిజన్ అందని ప్రధాన కారణంగానే 2011-12లో సుమారు 5వేల మంది పైగా చిన్నారులు నెల వయసు నిండకుండానే మరణించినట్లు యూనిసెఫ్ తన నివేదికలో వెల్లడించింది. 

రాష్ర్టవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి బోధనాసుపత్రుల వరకూ అన్ని చోట్లా వెంటిలేటర్ల కొరత ఉంది. గాంధీ, ఉస్మానియా, కింగ్‌జార్జ్, ఎంజీఎం వంటి ప్రధాన ఆస్పత్రుల్లో సైతం ఈ అత్యవసర ఆక్సిజన్ యంత్రాలు సరిపడా లేవు. ఆస్పత్రి పడకల సంఖ్యలో కనీసం 30 శాతమైనా కృత్రిమ శ్వాస యంత్రాలు ఉండాలి. కానీ చాలావరకు ఆస్పత్రుల్లో 5 శాతం కూడా లేవు. దీంతో కృత్రిమ శ్వాస కోసం ఆస్పత్రికి వచ్చిన ప్రతి 15 మందిలో ఒక్కరికి మాత్రమే వెంటనే ఆక్సిజన్ అందించగలుగుతున్నారు. మిగిలిన వారు నిస్సహాయంగా తమ వంతు కోసం ఎదురుచూస్తూ పరిస్థితి విషమిస్తే ప్రాణాలు కోల్పోతున్నారు. 

ఆస్పత్రుల్లో వాస్తవ పడకల సంఖ్యకూ, ఇన్‌పేషెంట్ల సంఖ్యకు భారీగా వ్యత్యాసముంది. ఉదాహరణకు ఉస్మానియా ఆస్పత్రి 1800 పడకల సామర్థ్యముండగా, 2300 మంది ఇన్ పేషెంట్లున్నారు. కనీసం 150 వెంటిలేటర్లు ఉండాలి. కానీ కేవలం 30 మాత్రమే ఉన్నాయి. రోగుల సంఖ్యకు అనుగుణంగా వెంటిలేటర్లు సమాకూర్చుకోవాల్సి ఉన్నా సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ప్రస్తుతం వివిధ ఆస్పత్రులకు 3 వేల వెంటిలేటర్ల అవసరం ఉండగా.. వెయ్యి మాత్రమే ఉన్నాయి. 2 వేల వెంటిలేటర్లకు గాను గత ఏడాది ప్రభుత్వం కేవలం 20 వెంటిలేటర్లు కొనుగోలు చేసి చేతులు దులుపుకుందంటేనే ప్రజారోగ్యంపై ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతుంది. 

ఉన్న వెయ్యి వెంటిలేటర్లలోనూ 50 శాతం మాత్రమే పనిచేస్తున్నా పట్టించుకునే నాధుడే లేడు. పెద్దాసుపత్రులకు కీలకమైనవి అత్యవసర వార్డులే. ఇలాంటి వాటిలో... ఏఎంసీ (అక్యూట్ మెడికల్‌కేర్ యూనిట్), ఆర్‌ఐసీయూ (రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్), ఎన్‌ఐసీయూ (న్యూరో ఇంటెన్సివ్ కేర్ యూనిట్), సీటీఆర్‌సీయూ (కార్డియో థొరాసిక్ రికవరీ కేర్ యూనిట్), పీఓఐసీ (పోస్ట్ ఆపరేటివ్ ఇంటెన్సివ్ కేర్) ఉన్నాయి. ఇలాంటి ఎమర్జెన్సీ వార్డుల్లో కూడా వెంటిలేటర్లు సరిపడా లేకపోవడం వల్ల రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

జిల్లా ఆస్పత్రుల్లో మరీ ఘోరం
బోధనాసుపత్రులకే దిక్కులేదంటే.. ఇక జిల్లా ఆస్పత్రుల గురించి చెప్పాల్సిన పనేలేదు. రాష్ట్రంలో 17 జిల్లా ఆస్పత్రులున్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటి 350 పడకల సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఒక్కో ఆస్పత్రిలో కనీసం 20 వెంటిలేటర్లు ఉండాలి. కానీ 5 కూడా లేవు. అలాగే రాష్ట్రంలో 58 ఏరియా ఆస్పత్రులు ఉండగా, ఇవన్నీ 150 పడకల సామర్థ్యం కలిగినవి. ఒక్కో ఆస్పత్రిలో 10 వెంటిలేటర్లు ఉండాలి. కానీ ఒక్కొక్కటి కూడా లేవు. అదేవిధంగా రాష్ట్రంలో 247 సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక్కొక్క ఆస్పత్రిలో 5 చొప్పున 1,235 వెంటిలేటర్లు అవసరం ఉండగా, 300 వెంటిలేటర్లు కూడా లేవు. ప్రతి అరగంటకు ఒక పేషెంటు కృత్రిమ శ్వాసకోసం ఆస్పత్రులకు వస్తుండగా.. రోజుకు కేవలం ఐదారుగురికి మాత్రమే ఈ ఆస్పత్రులు శ్వాస అందించగలుతున్నాయి.

వెంటిలేటర్ల కొరత కాదు.. పేషెంట్లు ఎక్కువ
ఆస్పత్రుల సామర్థ్యానికి మించి రోగులు వస్తారు. ప్రైవేటు ఆస్పత్రుల్లాగా పేషెంట్లను వద్దనలేం కదా. వచ్చే రోగుల సంఖ్యతో పోలిస్తే వెంటిలేటర్ల కొరత ఉందనే చెప్పాలి. ఏమైనా ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయనే వస్తున్నారు.
-డా.విష్ణుప్రసాద్, వైద్య విద్య సంచాలకుడు

కొత్తవి కొనరు.. ఉన్నవి పనిచేయవు
ప్రభుత్వాసుపత్రులను వెంటిలేటర్ల కొరత పీడిస్తోంది. కొత్తవి కొనరు. ఉన్నవాటిని బాగుచేయరు. ఉస్మానియా, గాంధీ, ఎంజీఎం వరంగల్ ఆస్పత్రుల్లో 50 శాతం వెంటిలేటర్లు పాడైపోయాయి. వాటి మరమ్మతు గురించి పట్టించుకునేవారే లేరు. వెంటిలేటర్ల నిర్వహణకు సిబ్బంది లేరు. 
-బి.రమేష్, జనరల్ సర్జన్, ఉస్మానియా ఆస్పత్రి
Share this article :

0 comments: